
జగన్ దీక్ష చేస్తానంటే బాబుకు గుర్తొచ్చిందా?
తెలంగాణలో నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఏపీకి చెందిన నేతలు అక్రమమంటూ గోబెల్స్ ప్రచారం
తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ సక్రమమైనవే: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఏపీకి చెందిన నేతలు అక్రమమంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు చేస్తాననే సరికి, ఏపీ సీఎం చంద్రబాబుకు గుర్తొచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. అందుకే ఆగమేఘాల మీద కేబినెట్‌లో చర్చించి, కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఇరువురు నేతలు ఏపీలో ఆధిపత్యం కోసం తెలంగాణపై విషం చిమ్ముతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. సచివాలయంలో మంత్రి తలసాని మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోలీసుల పహారా పెట్టి పోతిరెడ్డిపాడు, పులిచింతల ద్వారా అక్రమంగా నీటిని తరలించారన్నారు. తాము వారిలా కాకుండా తెలంగాణకు కేటాయించిన వాటా మేరకే వాడుకుంటున్నట్లు వివరించారు. ఏపీలోనే అనుమతి లేకుండా.. అక్రమంగా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారన్నారు. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కొత్తవి కాదని, ఉమ్మడి రాష్ట్రంలో జీవోలు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సుదీర్ఘ ఆలోచన మేరకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ జరుగుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నాలుగు నెలలు గడిచిన తర్వాత చంద్రబాబు ఇప్పుడు మేల్కొన్నట్లుందని ఎద్దేవా చేశారు.