భానుడి భగభగలు

భానుడి భగభగలు - Sakshi


- మార్చిలోనే మంటలు... అనేకచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రత

-భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలలో 50 డిగ్రీలకు చేరే అవకాశం

-ఎలినినో వల్లే ఈ పరిస్థితి... గతేడాది వడదెబ్బతో 541 మంది మృతి

-వడగాలి నుంచి రక్షణకు సర్కారు కార్యాచరణ ప్రణాళిక

-చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులకు లేఖలు

-ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకమంటోన్న వాతావరణశాఖ


సాక్షి, హైదరాబాద్: రోహిణి ఇంకా రానేలేదు.. కానీ రాళ్లు పగలటానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మార్చిలోనే పలు చోట్ల 41 డిగ్రీలకు పైగా వేడిమి తీవ్రత నమోదవుతుండటాన్ని బట్టి అసలైన వేసవి వచ్చేనాటికి పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నాటికి సేకరించిన సమాచారం మేరకు నిజామాబాద్‌లో 43 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇంతకుముందెన్నడూ మార్చి నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు.



2013 మార్చిలో గరిష్టంగా 38 డిగ్రీలకు మించలేదు. 2014 మార్చిలో 39-40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2015 మార్చి 25వ తేదీ లోపున 39.5 డి గ్రీలే నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది మార్చి నెల మొదలైనప్పటి నుంచే ఎండల తీవ్రత ఉంది. ఇకనుంచి రోజు రోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టంచేస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి రామగుండం, భద్రాచలం, నిజామాబాద్‌ల్లో 49-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి 'సాక్షి'కి తెలిపారు.





పాజిటివ్ ఎలినినో కారణంగానే...

ఈ ఏడాది పాజిటివ్ ఎలినినో, ఉత్తరం నుంచి వేడి గాలుల కారణంగా ఎండలు మరింత మండనున్నాయని చెబుతున్నారు. 1973 మే 9వ తేదీన భద్రాచలంలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. అదే ఇప్పటివరకు గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు. గతంలో ఏ వేసవిలోనైనా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు 10 రోజుల వరకు మాత్రమే ఉంటే... ఈ వేసవిలో ఏకంగా నెల రోజులపాటు వడగాల్పులు ఉంటాయని వాతావరణశాఖ చెబుతోంది. ఇదిలావుంటే ఎలినినో ప్రభావం జూన్ నాటికి తగ్గుతుందని... ఆ తర్వాత జులై నుంచి రుతుపవనాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని వై.కె.రెడ్డి చెబుతున్నారు. గతేడాది కంటే పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.



ఎండ నుంచి రక్షణకు సర్కారు కార్యాచరణ ప్రణాళిక

ఎండల తీవ్రత నుంచి ప్రజలను రక్షించేందుకు విపత్తు నిర్వహణ శాఖ కార్యాచరణ ప్రణాళిక తయారుచేసింది. ఆ ప్రణాళికను అమలుచేయాలని కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులకు లేఖలు రాసినట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్‌కుమార్ తెలిపారు. గతేడాది సాధారణ ఎండలకే 541 మంది చనిపోయారు. ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు కోరారు.



తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలు (సెంటీగ్రేడ్లలో)



1) ఆదిలాబాద్ 46.8, 1995 జూన్ 5

2) భద్రాచలం 48.6, 1973 మే 9

3) హన్మకొండ 47.8,  2003 జూన్ 3

4) హైదరాబాద్ 45.5,  1966 జూన్ 2

5) ఖమ్మం 47.6, 2015 మే 22

6) మహబూబ్‌నగర్ 45.3, 2015 మే 21,1973 ఏప్రిల్ 30

7) మెదక్ 46.3, 2006 మే 18

8) నల్లగొండ 46.8, 2015 మే 22

9) నిజామాబాద్ 47.3,  2005 మే 22

10) రామగుండం 47.3, 1984 మే 24



వడగాల్పుల కారణంగా మరణంచివారి సంఖ్య

2008 - 17

2009 -  7

2010 - 11

2012  - 144

2013 - 516

2014  - 31

2015 - 541

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top