పలాయనం చిత్తగించారు! | T.Harish Rao commented on bjp | Sakshi
Sakshi News home page

పలాయనం చిత్తగించారు!

May 26 2017 2:37 AM | Updated on Mar 29 2019 9:31 PM

పలాయనం చిత్తగించారు! - Sakshi

పలాయనం చిత్తగించారు!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సవాలును స్వీకరించకుండా, కనీసం స్పందించకుండా బీజేపీ పలాయనం చిత్తగించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

బీజేపీ నేతలపై హరీశ్‌రావు ధ్వజం
► సీఎం కేసీఆర్‌ అడిగిన ఏ ప్రశ్నకూ జవాబివ్వలేదు
►  తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
►  చిత్తశుద్ధి ఉంటే హైకోర్టును విభజించాలి


సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సవాలును స్వీకరించకుండా, కనీసం స్పందించకుండా బీజేపీ పలాయనం చిత్తగించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం రూ.లక్ష కోట్లు ఇచ్చినట్లు అధికారికంగా లెక్కలు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి సవాలు చేశారని, అయితే ఆయన అగిడిన ఏ ఒక్క ప్రశ్నకు బీజేపీ సమాధానం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఏపీకి వెళ్లిపోయారని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి స్పందించినా సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని అన్నారు. దీంతో సీఎం చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని బీజేపీ పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు.

గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. అమిత్‌ షా అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారని తేటతెల్లం అయిందన్నారు. సీఎం కేసీఆర్‌ రాజీనామాకు సిద్ధపడ్డా, వారు చెప్పిన దాంట్లో ఒక్కదానిని కూడా రుజువు చేయలేకపోయారని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు రూ.లక్ష కోట్ల గురించి వివరించకుండా, 90వేల ఇళ్ల గురించి మాట్లాడారని, అంటే రూ.లక్ష కోట్లు తప్పని ఒప్పుకున్నట్లేగా అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ పనులు చేయండి: బీజేపీకి నిజంగానే తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే సీఎస్టీలో పెండింగ్‌లో ఉన్న రూ.19వేల కోట్లను, క్యాంపా పథకం కింద రావాల్సిన రూ.17వందల కోట్లను వెంటనే విడుదల చేయించాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టును తక్షణమే విభజించాలని, ఎయిమ్స్, ట్రైబల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయించాలనీ అన్నారు. ఏపీకి ఇచ్చినట్లుగానే తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అమిత్‌ షా రాకతో బీజేపీ పదేళ్లు వెనక్కి పోయిందని, మోదీ, యోగీలు వస్తే పాతికేళ్లు వెనక్కి పోవడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.  

ఊకదంపుడు ఉపన్యాసాలు
బీజేపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, మెదక్, వరంగల్‌ ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో, అలాగే నారాయణఖేడ్, పాలేరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆడిన అబద్ధాలే మళ్లీ మళ్లీ ఆడారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను అనేక రాష్ట్రాలు అభినందించాయి.

యూపీ, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల అధికారులు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు..’అని మంత్రి పేర్కొన్నారు. వాస్తవాలు అలా ఉంటే బీజేపీ నేతలు మాత్రం బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నడిచినట్లు ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణలో నడవదని, రాష్ట్ర బీజేపీ నాయకులు తమ జాతీయ అధ్యక్షునికి తప్పుడు సమాచారం ఇచ్చి అబద్ధాలు మాట్లాడించారని, తాము మాట్లాడింది వాస్తవం కాదని క్షమాపణ చెప్పి ఉంటే గౌరవం పెరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement