కబ్జా కోరల్లో వర్సిటీ స్థలం | Slipped into the university to take place | Sakshi
Sakshi News home page

కబ్జా కోరల్లో వర్సిటీ స్థలం

Mar 6 2017 12:52 AM | Updated on Sep 5 2017 5:17 AM

కబ్జా కోరల్లో వర్సిటీ స్థలం

కబ్జా కోరల్లో వర్సిటీ స్థలం

రాజేంద్రనగర్‌లోని పీవీనర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన విలువైన స్థలం కబ్జాకు గురవుతుంది.

ఇదివరకే కొంత స్థలం
కబ్జాచేసి ప్రహరీ నిర్మాణం
స్పందించకుంటే మొదటికే మోసం


రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌లోని పీవీనర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన విలువైన స్థలం కబ్జాకు గురవుతుంది. నాలుగు రోజులుగా యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించిన కబ్జాదారులు చదును చేసి కబ్జాకు ప్రయత్నాలు ప్రారంభించారు. సెక్యూరిటీ సిబ్బంది స్థలం కబ్జాదారులను అడ్డుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో చేసేది లేక సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వివరాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ వర్సిటీలోనే హార్టికల్చర్, వ్యవసాయ, వెటర్నరీ మూడు విశ్వవిద్యాలయాలు కలిసి ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం యూనివర్సిటీలు వేరుపడి కొత్తగా రూపాంతరం చెందాయి. పిల్లర్‌ నెంబర్‌ 250 ప్రాంతంలో వెటర్నరీ వర్సిటీకి చెందిన ఎకరం స్థలం ఉంది. ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్లలో పలుకుతుంది. ప్రధాన రహాదారిపై ఈ స్థలం ఉండడంతో కబ్జాదారుల కన్ను పడింది. స్థలం చూట్టు ప్రహారీ లేకపోవడం, కేవలం ఒక బోర్డును మాత్రమే ఏర్పాటు చేయడంతో కబ్జాదారుల పని సులభమైయింది. నాలుగు రోజుల కిందట కొందరు స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డుతో పాటు గోడలపై లిఖించిన రాతలను తొలగించారు. గుంతలుగా ఉన్న స్థలంలో మట్టిపోసి చదును చేశారు. ఈ విషయమై సెక్యూరిటీ సిబ్బంది శనివారం కబ్జాదారులను నిలదీసింది. కబ్జాదారులు పదుల సంఖ్యలో ఉండడంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పంపించారు. ఈ విషయమై సెక్యూరిటీ సిబ్బంది వెటర్నరీ కళాశాల రిజిస్ట్రార్‌కు సమాచారం అందించారు.ఇదివరకే కొంత స్థలాన్ని కబ్జా చేసిన కబ్జాదారులు పకడ్భందీగా ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం అదే ప్రణాళిక అమలు చేస్తున్నారు.ఈ విషయంలో వెటర్నరీ వర్సిటీ అధికారులు వెంటనే స్పందించకపోతే అత్యంత విలువైన ఈ స్థలం కబ్జాదారుల చేతుల్లో పడనుంది.

స్థలాన్ని వర్సిటీ భవనానికి కేటాయించాలి
రూ.కోట్ల ఖరీదైన స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులపై ఉంది. ప్రధాన రహదారిపై ఉన్న ఈ స్థలాన్ని విద్యార్థి భవనానికి కేటాయించాలి. స్థల విషయమై వెంటనే రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.   – కాటం శ్రీధర్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement