పల్లెకు చేరని ప్రగతి చక్రం! | rtc buses no transportation to 1341 villages in telangana | Sakshi
Sakshi News home page

పల్లెకు చేరని ప్రగతి చక్రం!

Nov 1 2016 2:43 AM | Updated on Aug 14 2018 10:54 AM

పల్లెకు చేరని ప్రగతి చక్రం! - Sakshi

పల్లెకు చేరని ప్రగతి చక్రం!

ఎన్నో రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

రాష్ట్రంలో 1,341 గ్రామాలకు రాని ఆర్టీసీ బస్సులు
ఆక్యుపెన్సీ రేషియో లేదన్న కారణంతో నడపని ఆర్టీసీ
లాభాపేక్షతో ముడిపెట్టబోమన్న హామీ గాలికి..
రెండున్నరేళ్లలో మరో 200 ఊళ్లకు బస్‌ కట్‌!
ఆటోలు, జీపుల వంటి ప్రైవేటు వాహనాలు కిటకిట
వాటిని నియంత్రించాలన్న సీఎం ఆదేశాలు బుట్టదాఖలు
ఆర్టీసీ–ఆర్టీఏల మధ్య సమన్వయం శూన్యం



సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నో రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత పలు రంగాల్లో వేగంగా ముందుకు దూసుకెళుతూ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్టీసీ బస్సు వెళ్లని పల్లెలు 1,341 ఉన్నాయి. అంతేకాదు ఈ లెక్కన వచ్చే రెండున్నరేళ్లలో మరో రెండు వందల ఊళ్లకూ ప్రగతి రథ చక్రం దూరమవనుంది. మరి ఆర్టీసీ బస్సులు రాకపోవడం రోడ్లు లేక కాదు.. సరైన సంఖ్యలో ప్రయాణికులు ఉండడం లేదని బస్సులు నడపడం లేదు. వాస్తవానికి కొత్త రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వం కొలువుదీరాక.. ‘‘రాష్ట్రంలో 1,050 గ్రామాలకు బస్సు వసతి లేదు. వాటికి  వెంటనే బస్సు వసతి కల్పిస్తాం, లాభాపేక్షతో ప్రమేయం లేకుండా బస్సులు నడుపుతాం. అవసరమైన చోట రోడ్ల నిర్మాణం జరిగేలా చూస్తాం..’’ అని ప్రకటించింది. కానీ వాటికి బస్సు రాకపోగా.. మరో రెండు వందల పల్లెలకూ దూరమైంది. తాజాగా ఆర్టీసీ అధికారుల పరిశీలనలోనే ఈ లెక్కలు తేలాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,265 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా.. 1,341 పల్లెలకు నడపడం లేదని అధికారులు గుర్తించారు.

ఎందుకిలా..?
మహబూబ్‌నగర్‌ జిల్లా–కర్ణాటక సరిహద్దు మండలం కృష్ణా. ఈ మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఐనాపూర్‌. దాదాపు 400 ఇళ్లున్న ఈ పల్లెకు బీటీ రోడ్డున్నా.. ఇప్పటికీ ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీనికి సమీపంలోనే ఉన్న మాగనూరు మండలంలోని కృష్ణానదీ తీర గ్రామం తంగిడి. ఇటీవలి కృష్ణా పుష్కరాల కోసం ఈ గ్రామానికి విశాలమైన రోడ్డును కూడా నిర్మించారు. కానీ ఇప్పటికీ ఆర్టీసీ బస్సు మాత్రం రావడం లేదు. ఈ రెండు గ్రామాల పరిస్థితే కాదు... పూర్వపు జిల్లాల స్వరూపంలోని వరంగల్‌ పరిధిలో 70 గ్రామాలకు, ఆదిలాబాద్‌ పరిధిలో 300, మహబూబ్‌నగర్‌ పరిధిలో 275, నల్లగొండ జిల్లా పరిధిలో 189 పల్లెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రంగారెడ్డి జిల్లాలోనూ ఈ దుస్థితి ఉంది. దీనిపై ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే... ‘‘చాలా ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రయత్నిస్తున్నాం. కానీ సరిపడా ప్రయాణీకులు ఉండడం లేదు. డీజిల్‌ ఖర్చుకు తగినంత కూడా టికెట్‌ ఆదాయం రావడం లేదు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింతగా నష్టాల్లో కూరుకుపోతుంది. అందుకే కొన్ని ప్రాంతాలకు బస్సులు నడపటం లేదు..’’ అని చెబుతున్నారు. మరోవైపు ఆయా పల్లెలకు పెద్ద సంఖ్యలో ఆటోలు, జీపులు కిక్కిరిసి తిరుగుతుండడం గమనార్హం.

ముఖ్యమంత్రి ఆదేశాలూ బుట్టదాఖలు
రాష్ట్రంలోని అన్ని పల్లెలకూ బస్సులు నడపాలని గత జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. చాలా చోట్ల సరైన అనుమతులు, పర్మిట్లు లేకుండా ప్రైవేటు వాహనాలు తిరుగుతుండడంతో ఆర్టీసీ బస్సులకు ప్రయాణీకులు ఉండడం లేదని... దానిని నియంత్రించాలనీ సూచించారు. ప్రైవేటు వాహనాలను నియంత్రించేందుకు వీలుగా ఆర్టీసీ–ఆర్టీఏ మధ్య సమన్వయం కోసం ఓ లైజన్‌ ఆఫీసర్‌ను కూడా నియమించారు. ఆర్టీసీ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లును దీనికి సిఫారసు చేశారు. కానీ ఇప్పటివరకు ఈ రెండు విభాగాల మధ్య కనీస సమన్వయం కూడా ఏర్పడలేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాల నియంత్రణకు సరైన చర్యలే దిక్కులేవు. దీంతో ప్రైవేటు వాహనాలు ప్రయాణీకులను తరలిస్తుండగా.. ఆక్యుపెన్సీ లేదంటూ ఆర్టీసీ అధికారులు బస్సులు నడపటం లేదు.

సరైన ప్రణాళిక లేక..
గతంలో కొన్ని గ్రామాలకు బస్సులు నడిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఇలా నాలుగు పూటల ఆయా గ్రామాలను అనుసంధానిస్తూ బస్సులు సర్వీసులు నిర్వహించారు. కానీ బస్సు ట్రిప్పుల మధ్య ప్రైవేటు వాహనాలు ప్రయాణీకులను తరలించుకుపోతుండటంతో.. బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఉండడం లేదని స్థానిక ఆర్టీసీ అధికారులు గుర్తించి సర్వీసులు రద్దు చేశారు. ఇక కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు అసలు బస్సులే నడపలేదు. రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని, గుంతలు, ఎత్తుపల్లాలతో ఉన్నాయని, బస్సులు నడిపితే పాడవుతాయంటూ సర్వీసులు మొదలుపెట్టలేదు. ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రణాళిక కూడా రూపొందించలేదు.

పరిష్కారంపై దృష్టే లేదు
ఇక చాలా మార్గాలను ఆర్టీసీ అద్దె (హైర్‌) బస్సులకు కేటాయిస్తుండటంతో వాటి నిర్వాహకులు లాభదాయక మార్గాలనే ఎంచుకుంటున్నారు. నిర్వాహకులతో కొందరు అధికారులు లాలూచీ పడుతుండడంతో దూరంగా ఉండే పల్లెలకు బస్సులు తిరిగే పరిస్థితి ఉండడం లేదు. దాంతో ఆయా పల్లెల ప్రజలు ప్రైవేటు వాహనాలకు అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. ప్రైవేటు వాహనాలను నియంత్రించి, అనుకున్న వేళలకు బస్సులు నడిపితే ఆక్యుపెన్సీ రేషియో మెరుగుపడుతుందనే వాదనను పట్టించుకునేవారే లేరు. ఇటీవల కొన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసిన సమయంలో.. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, నిపుణుల నుంచి ఆర్టీసీకి ఎన్నో సూచనలు వచ్చాయి. కానీ వాటిని అమలు దిశగా ఎటువంటి యోచనా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement