జలం పదిలం..... భవిత భద్రం | Retain water ..... Bhavita saved | Sakshi
Sakshi News home page

జలం పదిలం..... భవిత భద్రం

Sep 9 2013 1:44 AM | Updated on Jul 11 2019 6:33 PM

పెరుగుతోన్న జనాభా.. తరుగుతోన్న భూగర్భ జల మట్టాలు.. వెరసి నగరంలో నీటి లభ్యత దారణంగా పడిపోతుంది.

సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతోన్న జనాభా.. తరుగుతోన్న భూగర్భ జల మట్టాలు.. వెరసి నగరంలో నీటి లభ్యత దారణంగా పడిపోతుంది. గ్రేటర్ పరిధిలో ఏటేటా భూగర్భ జలాలు అధఃపాతాళానికి పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వర్షపు నీటిలో వృథా 70 శాతానికి పైగానే ఉంటుంది. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే. మహానగర పరిధిలో 22 లక్షల నివాస సముదాయాలుంటే, అందులో ఇంకుడు గుంతలున్న భవనాలు లక్ష కూడా లేకపోవడం విశేషం. దీంతో చాలా ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా చుక్కనీరు లభించట్లేదు.

ఈ నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణపై ఇంటింటికీ, నగర వ్యాప్తంగా అమలు చేయాల్సిన పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ‘గ్రేటర్ పరిధిలో వార్షిక సగటు వర్షపాతం 800 మిల్లీ మీటర్లు. ఇందులో కనీసం 400 మి.మీ. వర్షపాతాన్ని భూగర్భంలో నిల్వ చేసుకుంటే అది 270 మిలియన్ గ్యాలన్ల నీటికి సమానం. ఈ మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేస్తే నగరంలో బావురుమంటున్న బోరుబావులు జలకళ సతరించుకోవడం తథ్యం.

అంతేకాదు తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు నిరంతరం సమృద్ధిగా భూగర్భ జలం అందుబాటులో ఉంటుంది. జలమండలి సరఫరా నెట్‌వర్క్ లేని సుమారు 870 కాలనీల్లో నివసిస్తున్న 30 లక్షల మందికి నిత్యం క‘న్నీటి’ కష్టాలు తప్పుతాయి..’’ అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆ స్థాయి లో వర్షపు నీటిని ఒడిసిపట్టేదెలా అన్నదే మీ సందేహమా..? అయితే నగరవాసుల కోసం.. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) హనుమంతరావు డిజైన్ చేసిన ఈ నూతన నీటి నిల్వప్రక్రియ దీనికి జవాబిస్తోంది. అదెలాగో మీరే చదవండి.. ఆచరించండి..
 
 ఇంకుడు గుంత ఇలా ఉండాలి  
 (వంద చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇల్లయితే..)
 బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు లోతున గుంత తీయాలి
     
 గొయ్యి లోపలి గోడలకు ఆనుకొని గ్రానైట్ రాళ్లను  సిమెంటు లేకుండా మధ్య మధ్యలో ఖాళీ స్థలం విడిచి పేర్చుకోవాలి
     
 గొయ్యిపై సిమెంటు జాలీని ఏర్పాటు చేయాలి
     
 ఇంటిపై పడిన వర్షపునీరు ఇందులోకి చేరేలా చూడాలి
 
 ఉపయోగాలివి..

 సంప్రదాయ పద్ధతుల్లో తవ్విన ఇంకుడు గుంతల్లో 40 ఎంఎం, 20 ఎంఎం కంకరరాళ్లు,ఇసుక ఉండడం వల్ల వర్షపునీరు ఇంకడం కష్టసాధ్యమవుతుంది. ఈ నూతన పిట్‌తో ఆ పరిస్థితి ఉండదు
     
 బోరుబావి త్వరగా రీచార్జి అవుతుంది. భూగర్భ జలాలు నాలుగైదు మీటర్ల మేర పెరిగే అవకాశాలుంటాయి
     
 ఖర్చు రూ.1500కు మించదు.
 
 ఇంకుడు కొలనులు (పెర్కొలేషన్ పాండ్స్)
 ప్రతి 20-25 కిలోమీటర్ల విస్తీర్ణానికి (కాలనీలు, బస్తీల్లో ఇంకుడు కొలను) వీటిని ఏర్పాటు చేయాలి
     
 వర్షపు నీరు తరచూ నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేస్తే మేలు
     
 సుమారు 25 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల లోతున పెద్ద కొలను తవ్వాలి. సమీప ప్రాంతాల నుంచి వర్షపునీరు ఈ గొయ్యిలోకి నేరుగా చేరే ఏర్పాట్లు చేయాలి. కొలను గోడలకు గ్రానైట్ రాళ్లనుసిమెంటు లేకుండానే మధ్యలో ఖాళీస్థలం వదిలి ఒకదానిపై మరొకటి పేర్చుకోవాలి.
     
 కొలను నిండిన తరవాత వర్షపునీరు బయటికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి
     
 కొలను చుట్టూ రక్షణ గోడను, ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలి
 
 ఉపయోగాలివీ..
 దీని వల్ల వృథాగా పోయే వర్షపునీటిలో 70 శాతం నీటిని నిల్వ చేయవచ్చు
     
 భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా చూడవచ్చు
     
 భూ పై పొరల్లో నిరంతరం జలం లభ్యమయ్యేలా చేసుకోవచ్చు
 
 గ్రేటర్ యంత్రాగం కింకర్తవ్యమిదే..
 ఫిలడెల్ఫియాలో వర్షపునీటి నిల్వకు అమలు చేస్తున్న విధానాలపై జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలి
     
 తమ అధ్యయనంపై సాంకేతిక నివేదిక (టెక్నికల్ రిపోర్టు)ను రూపొందించాలి
     
 అధ్యయనం చేసిన విధానాలపై నగర పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలి
     
 వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే వ్యక్తులు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు, నగదు సహాయం అందజేయాలి
 
 సత్ఫలితాలు సాధించిన ఉదంతాలివే..
 అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పై విధానాలను అమలు చేయడంతో వరదనీటి నిల్వ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు తగ్గింది. భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగాయి
     
 చైనాలోని హెబాయ్ ప్రావిన్స్ నాన్‌పీ ప్రాజెక్టు కూడా ఈ విధానంతో సత్ఫలితాలు సాధించింది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement