
రీ ఇంజనీరింగ్ ఇందుకే..
ప్రాణహిత -చేవెళ్ల సహా ఇతర ప్రాజెక్టుల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ ఇంజనీరింగ్‌కు కారణాలు, అందుకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికపై రిటైర్డ్ ఈఎన్‌సీ, ప్రముఖ నీటి పారుదల
♦ ప్రాజెక్టుల రీ డిజైన్‌పై హనుమంతరావుకు హరీశ్ వివరణ
♦ రిటైర్డ్ ఈఎన్‌సీ అనుమానాలు నివృత్తి చేసిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత -చేవెళ్ల సహా ఇతర ప్రాజెక్టుల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ ఇంజనీరింగ్‌కు కారణాలు, అందుకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికపై రిటైర్డ్ ఈఎన్‌సీ, ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణుడు టి.హనుమంతరావుకు భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. శుక్రవారం స్వయంగా హనుమంతరావు ఇంటికి వెళ్లి సుమారు గంటపాటు ప్రాజెక్టుల రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, గోదావరి, ఇతర ఉపనదుల పూర్తిస్థాయి నీటి వినియోగంపై చర్చించారు. ప్రాణహిత రీ డిజైన్‌ను సమర్థిస్తూనే, ప్రాజెక్టులో కొన్ని మార్పుల ద్వారా ప్రభుత్వానికి రూ.20 వేల కోట్లు ఆదా అవుతుందని, వీలైనంత ఎక్కువ నీటిని తమ్మిడిహెట్టి నుంచే తీసుకోవాలంటూ పలు వేదికలపై హనుమంతరావు సూచిస్తున్న నేపథ్యంలో ఆయనతో హరీశ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత 110 టీఎంసీలు ఉంటుందని, ఎత్తుతో సంబంధం లేకుండా దాన్ని మళ్లించుకోవచ్చని హనుమంతరావు చెబుతున్న అంశాలపై అధికారులతో కలిసి మంత్రి ఆయనకు వివరణ ఇచ్చారు. సాంకేతికంగా తమ్మిడిహెట్టి ఎత్తు వద్ద 148 మీటర్ల ఎత్తులో 40 నుంచి 50 టీఎంసీలకు మించి నీటి లభ్యత ఉండదని, అందులో ఆదిలాబాద్ తాగు, సాగు అవసరాలకు 25 టీఎంసీల మేర వినియోగించుకుంటామని మంత్రి వివరించారు. ‘‘అదీగాక తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్లేక్రమంలో 71వ కిలోమీటర్ వద్ద 39 మీటర్ల లిఫ్టు అవసరముంటుంది. దానికే రూ.5 వేల కోట్లు కావాలి. అదే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే అదే ఖర్చుతో ఎక్కువ నీటిని తీసుకోవచ్చు’’ అని వివరించారు. దీనితో హనుమంతరావు కూడా ఏకీభవించారు. అనంతరం ఆయన, మంత్రి మీడియాతో మాట్లాడారు.
జీవనదులుగా గోదావరి, ఉపనదులు: హరీశ్
ప్రాజెక్టుల పరిధిలో రీ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నామో హనుమంతరావుకు వివరణ ఇచ్చినట్టు హరీశ్ వివరించారు. ‘‘తమ్మిడిహెట్టి నుంచి నీళ్లు వచ్చే పరిస్థితుల్లేవు గనక ఇంజనీరింగ్ తప్పనిసరి. మేడిగడ్డ వద్ద ఎక్కువ నీటిని తీసుకోవడంతో పాటు స్టెప్ లేడార్ పద్ధతిన నౌకాయాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యారేజీలు నిర్మిస్తున్నాం. మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య వరద ఉన్నప్పుడు విద్యుదుత్పాదన చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే జరిగిన పనులను వాడుకుంటూనే, కరువు ప్రాంతాలైన మెదక్, నిజామాబాద్, నల్లగొండలకు నీరందించేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ హనుమంతరావుకు వివరించాం. ఆయన సైతం మేడిగడ్డే మేలన్నారు. గోదావరిని, దాని ఉపనదులను జీవనదులుగా మార్చాలని సూచించారు. దీన్ని పరిశీలిస్తాం. మిషన్ కాకతీయ విషయంలోనూ ఆయన చేసిన సూచనలను తక్షణం అమలు చేస్తాం’’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా: హనుమంతరావు
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వచ్చి చర్చలు జరపడం శుభపరిణామమని, రాష్ట్ర పురోగాభివృధ్ధికి ఇవి దోహదపడతాయని హనుమంతరావు అన్నారు. ‘‘రాష్ట్ర స్వల్ప, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి చర్చించాం. నౌకాయానానికి, విద్యుదుత్పత్తికి నిధుల కూర్పు, భూగర్భ జలాల పెంపునూ చర్చించాం. ఉపనదులను జీవనదులుగా ఎలా మార్చవచ్చో వివరించా. ప్రాజెక్టుల ఇంజనీరింగ్‌ను ప్రభుత్వం పూర్తి శాస్త్రీయంగా చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నా. ఎల్లంపల్లికి నీటిని తమ్మిడిహెట్టి కన్నా మేడిగడ్డ నుంచి తరలించడమే ఉత్తమం. తమ్మిడిహెట్టి-ఎల్లంపల్లి మార్గంలో 5 వేల కోట్ల ఖర్చుతో 39 మీటర్ల లిఫ్టు కట్టడం ప్రయోజనకారి కాదు. అవే నిధులతో మేడిగడ్డ-ఎల్లపల్లి బ్యారేజీలు నిర్మిచండంతో పాటు వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిదే’’ అన్నారు.