రూ.లక్ష చెల్లించిన ఉల్లం‘ఘనుడు’

One lakh pending traffic penalty was payed  - Sakshi

పెండింగ్‌ ట్రాఫిక్‌ జరిమానా ఒకేసారి చెల్లింపు 

సాక్షి, హైదరాబాద్‌: అదో బీఎండబ్ల్యూ కారు.. ఏపీ28డీఎక్స్‌6363 నంబర్‌తో కూడిన ఆ వాహనం ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఇప్పటి వరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దీనిపై విధించిన రూ.1,00,450 జరిమానా పెండింగ్‌లో ఉండిపోయింది. హఠాత్తుగా శనివారం ఈ మొత్తం క్లియర్‌ అయింది. ఆన్‌లైన్‌లో సింగిల్‌ పేమెంట్‌తో జరిమానా మొత్తం చెల్లించేశారు దాని యజమాని. గతేడాది నవంబర్‌ వరకు రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో టాప్‌–20 ఉల్లంఘనలు చేసిన వాహనాలపై పెండింగ్‌లో ఉన్న జరిమానా రూ.4.8 లక్షలుగా తేలింది. దీని ప్రకారం చూస్తే ఈ వాహనానిదే టాప్‌ అయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ వాహన యజమాని హఠాత్తుగా ఈ మొత్తం చెల్లించడం వెనుక దాన్ని అమ్మాలని భావించడమో, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నోటీసుల ద్వారా ఒత్తిడి చేయడమో కారణమై ఉండవచ్చని నగర పోలీసులు భావిస్తున్నారు.  

‘సైబరాబాద్‌’ పరిధిలోనే అధికం: ఒకప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు స్పాట్‌ చలాన్లు మాత్రమే విధించేవారు. ఈ కారణంగానే అప్పట్లో చలాన్ల పెండెన్సీ అన్నది అరుదుగా ఉండేది. ప్రస్తుతం రాజధానిలో అత్యధికంగా ఈ–చలాన్లు పంపిస్తున్నారు. దీన్ని సదరు వాహన చోదకుడు ఆన్‌లైన్‌లోనో, ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లోనో చెల్లించాల్సి ఉంది. ఈ–చలాన్లను అనేక మంది బేఖాతరు చేస్తుండటంతో పెండెన్సీ పెరిగిపోతోంది. సైబరాబాద్, రాచ కొండల్లో కొరత కారణంగా సరాసరిన ఓ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కు ఒక పీడీఏ మిషన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారణం గానే ఓ వాహనంపై ఎన్ని పెండింగ్‌ చలాన్లు ఉన్నాయన్నది ఇక్కడ తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఈ కారణంగానే పెండింగ్‌ ఈ–చలాన్లలో అత్యధికం సైబరాబాద్, ఆ తర్వాత రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సంబంధించినవే ఉంటున్నాయి. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top