సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో కొత్త ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది.
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో కొత్త ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన సికింద్రాబాద్-విశాఖ ఏసీ ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం(19వ తేదీ) ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు సికింద్రాబాద్-విశాఖ(12784) రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. నాందేడ్-ఔరంగాబాద్(17620) ట్రైన్‌ను కూడా ఆయన రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎంపీలు కేశవరావు, వి. హనుమంతరావు, మహ్మద్ అలీఖాన్ పాల్గొననున్నారు.
24 నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం
సికింద్రాబాద్-విశాఖ(12784/12783) కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ప్రతి శనివారం సాయంత్రం 5.55కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కి విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి ఆదివారం సాయంత్రం 7కి విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40కి సికింద్రాబాద్ చేరుతుంది. అలాగే నాందేడ్-ఔరంగాబాద్ (17620/17619) ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలు ప్రతి శుక్రవారం ఉదయం 8కి నాందేడ్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12.45కి ఔరంగాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం రాత్రి 12.45కి ఔరంగాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 6.30కి నాందేడ్ చేరుతుంది.
నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) ఆదివారం ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరవలసి ఉండగా, 3 గంటలు ఆలస్యంగా ఉదయం 9.25 గంటలకు బయలుదేరుతుందన్నారు. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ రావలసిన ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడుస్తున్నందున ఈ మార్పు చోటుచేసుకున్నట్లు చెప్పారు.