వాళ్లను ఊహించుకొని.. వీళ్లను చంపేశాడు | Sakshi
Sakshi News home page

వాళ్లను ఊహించుకొని.. వీళ్లను చంపేశాడు

Published Tue, May 10 2016 5:19 AM

హత్య జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలో నిందితుడి చిత్రం

* అన్న భార్య, కుమారుడిపై ఉన్న కోపం ఇతరులపై..
* పదిహేను నిమిషాల వ్యవధిలో రెండు హత్యలు
* సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్

సాక్షి, సిటీబ్యూరో: అన్న భార్య, కుమారుడితో జరిగిన ఘర్షణతో వారిపై కసి పెంచుకున్నాడు... తెల్లవారుజామున సైకిల్‌పై తిరుగుతూ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారి వయసున్న ఇద్దర్ని గుర్తించి... అన్న కుమారుడు, వదినల్ని తలచుకుంటూ రాళ్లతో మోది చంపేశాడు... అబిడ్స్, నాంపల్లి ఠాణాల పరిధిలో గత సోమవారం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు హత్యల వెనుక ఉన్న కారణమిది.

ఈ ఘాతుకాలకు పాల్పడిన నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నారని డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
 
ఆది నుంచీ వివాదాస్పదుడే...
మంగళ్‌హాట్‌లోని సీతారామ్‌బాగ్‌కు చెందిన జితేందర్‌సింగ్(40)కు జిత్తు, జిదుర సింగ్, గల్లుదాదా అనే మారు పేర్లూ ఉన్నాయి. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, ఎనిమిదేళ్ల క్రితం తల్లి కన్నుమూసింది. 23వ ఏట చెట్టు మీద నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన జిత్తు ఆపై అల్లరిచిల్లరగా తిరగడం ప్రారంభించాడు. 12 ఏళ్ల పాటు సమోసా కార్ఖానాలో, మూడేళ్ల పాటు వాటర్ ట్యాంకర్ క్లీనర్‌గా పనిచేసిన అతడు ప్రస్తుతం కార్పెంటర్‌గా జీవిస్తున్నాడు. తరచూ గొడవలకు దిగే ఇతడిపై మంగళ్‌హాట్, హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్ ఠాణాల్లో దాడి సంబంధిత కేసులతో పాటు ఎక్సైజ్ విభాగంలోనూ కేసులున్నాయి. గతంలో దాదాపు నాలుగేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చాడు.  
 
వదిన, ఆమె కుమారుడితో ఘర్షణపడి...
ప్రస్తుతం దత్తనగర్‌లో అన్న కుటుంబం నివసిస్తున్న ఇంట్లోనే ఓ గదిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. జిత్తుకు వదిన సుచిత్ర, అన్న కుమారుడు దుర్గేష్‌తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ ఇంటికి రావద్దని, గదిని ఖాళీ చేయాలని వారు స్పష్టం చేస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే గత నెల 29 రాత్రి సైతం వీరితో జిత్తుకు ఘర్షణ జరిగింది. దీంతో సుచిత్ర, దుర్గేష్‌లు జిత్తును దూషించడంతో పాటు చేయి చేసుకుని తీవ్ర స్థాయిలో బెదిరించారు. ఫలితంగా జిత్తు తీవ్ర మనస్థాపానికి గురికావడంతో పాటు ఒకటో తేదీ రాత్రి వరకు సరైన ఆహారం లేక వారిపై కసి పెంచుకున్నాడు.
 
కనిపించిన వారిని చంపేశాడు...
అలాంటి మానసిక స్థితితో ఉన్న జిత్తు ఈ నెల ఒకటో తేదీ అర్ధరాత్రి తన ఇంటి నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. ఆసిఫ్‌నగర్ కాంపౌండ్, విజయ్‌నగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్, చింతలబస్తీ, లక్డీకాపూల్, పబ్లిక్‌గార్డెన్స్, సంతోష్-స్వప్న థియేటర్స్ రోడ్, సాగర్ టాకీస్ రోడ్, ట్రూప్ బజార్, రామకృష్ణ థియేటర్, అబిడ్స్, ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్ మీదుగా తెల్లవారుజాము 3.05 గంటలకు బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ యువకుడు జిత్తు కంటపడ్డాడు.

అతడిదీ దాదాపు దుర్గేష్ వయస్సే కావడంతో ఆ యువకుడినే దుర్గేష్‌గా ఊహించుకుని తలపై బండతో మోది చంపేశాడు. అక్కడ నుంచి 3.20 గంటలకు రెడ్‌హిల్స్ ప్రాంతానికి వచ్చిన జిత్తుకు అక్కడ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వృద్ధురాలు కనిపించింది. ఆమె వయస్సు తన వదిన వయస్సంతే ఉండటంతో సుచిత్రను ఊహించుకుని బండరాయితో మోది వృద్ధురాలిని చంపేశాడు.
 
సీరియల్ కిల్లర్‌గా భావించిన పోలీసులు...

అబిడ్స్, నాంపల్లి ఠాణాల పరిధిలో చోటు చేసుకున్న ఈ రెండు హత్యలూ రెండో తేదీ వెలుగులోకి రావడంతో కేసులు నమోదయ్యాయి. ఘటనా స్థలాలకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు సైకిల్‌పై వచ్చిన ఒకే వ్యక్తి టార్చ్‌లైట్‌తో నిద్రిస్తున్న వారిని గుర్తించి, ముందుకువెళ్లి రాయి తెచ్చి రెండు హత్యలు చేసినట్లు గుర్తించారు. ఒకే తరహాలో అకారణంగా జరగడంతో అతడో సీరియల్ కిల్లర్‌గా భావించి అప్రమత్తమయ్యారు.

ఇలాంటి హత్య మరోటి జరగకుండా ఉండేందుకు అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ గంగారామ్ నేతృత్వంలో ఏర్పడిన ఎనిమిది బృందాలు ఆయా ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని ఒకచోటికి చేర్చి కాపుకాయడం ప్రారంభించాయి. హత్య కేసుల్ని కొలిక్కి తీసుకువచ్చి, నిందితుడిని పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.జానయ్య నేతృత్వంలో ఆరు బృందాలు రంగంలోకి దిగాయి.22 కెమెరా ఫీడ్ అధ్యయనంతో...
రెండు హత్యలు జరిగిన ప్రాంతాలతో పాటు అటు-ఇటు ఉన్న మార్గాల్లోని 22 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. దీంతో నిందితుడు మంగళ్‌హాట్ వైపు వెళ్లినట్లు తేలింది. ఈ ఫీడ్ నుంచి సేకరించిన నిందితుడి అస్పష్టమైన ఫొటో సాయంతో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ నాగేంద్ర మంగళ్‌హాట్‌లోని బస్తీల్లో ఆరా తీయడం ప్రారంభించారు. చివరకు స్థానికుల ద్వారా ఆ ఫొటోలో ఉన్నది జిత్తుగా గుర్తించి అబిడ్స్ పోలీసులతో కలిసి అతడి గదిపై దాడి చేశారు. జిత్తు చిక్కడంతో పాటు సైకిల్, టార్చ్‌లైట్ తదితరాలు రికవరీ అయ్యాయి. నిందితుడిని అబిడ్స్ పోలీసులకు అప్పగించామని, ఇతడి అరెస్టులో కీలకపాత్ర పోషించిన వారికి రివార్డ్ ఇస్తామని లింబారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement