'ఫీజు బకాయిలతో చదువులు దూరం' | Kodandaram attends PDSU meeting as a chief guest | Sakshi
Sakshi News home page

'ఫీజు బకాయిలతో చదువులు దూరం'

Sep 20 2016 4:59 PM | Updated on Jul 29 2019 2:51 PM

పోస్టు మెట్రిక్ చదివే విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు.

హైదరాబాద్: పోస్టు మెట్రిక్ చదివే విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పీడీఎస్‌యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల సంఖ్య తగ్గి, ప్రైవేటు రంగంలో పెరిగాయని గుర్తుచేశారు.

1980 తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కళాశాలలను ఆహ్వానించారని, బతుకు దెరువు కోసం విద్యావంతులైన యువకులు అప్పట్లో కళాశాలలు ప్రారంభించుకున్నారని అన్నారు. తరువాత కాలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రవేశించి విద్యా వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. పేద ప్రజలు తమకు స్థోమత లేకున్నా ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించుకుంటున్న పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేకపోతే ప్రైవేటు కాలేజీలు కూడా మూతపడి కార్పొరేట్ విద్యాసంస్థల జులుం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫీజు బకాయిలను చెల్లించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను పూరించి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల సంఘం అధ్యక్షుడు గౌతం రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 2500 కోట్లను సరైన సమయంలో చెల్లిస్తే పేద విద్యార్థులకు చదువు దూరం కాదన్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు ఒక్కపైసా విడుదల కాలేదని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసే పరిస్థితి ఏర్పడితే డీమ్డ్ యూనివర్సిటీలు, కార్పొరేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతాయని, అదే జరిగితే పేదపిల్లలు ఉన్నత విద్యకు దూరమవుతారని అన్నారు.

ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కార్పొరేట్ కళాశాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్య అందిస్తే కార్పొరేట్ రంగం వెనక్కుపోతుందని అన్నారు. ఫార్మసీ కళాశాలల అధ్యక్షుడు కె. రామ్‌దాస్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.

ప్రభుత్వ విధానంతో ఇప్పటికే కళాశాలల సంఖ్య సగానికి తగ్గిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోతే పేద విద్యార్థులకు చదువు దొరకదని అన్నారు. ఈ సదస్సుకు పీడీఎస్‌యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు వి.రియాజ్ అధ్యక్షత వహించగా, ప్రొఫెషనల్ కళాశాలల ప్రతినిధి కె. ప్రభాకర్ రెడ్డి, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.డి. రాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement