అప్పుడే మొదలైన వారసుల హడావుడి

అప్పుడే మొదలైన వారసుల హడావుడి - Sakshi


ఇప్పుడు రాష్ర్టంలో రాజకీయ వారసుల హడావుడి ఒక్కసారిగా ఊపందుకుంది. జీహేచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే ఆయా పార్టీల ముఖ్యనేతల వారసులు పావులు కదుపుతున్నారట. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో అప్రకటిత రెండోస్థానంలో కొనసాగుతున్న ముఖ్యనేత కుమార్తె ఇప్పుడు ఈ విషయంలో రేసులో ముందున్నదనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి హైదరాబాద్ మేయర్ పదవికి తన పేరునే ప్రకటించాలని సదరు నేత కుమార్తె పట్టుబడుతోందట. ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగువెలిగి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేత కుమారుడి పేరు కూడా ఆ పార్టీ తరఫున మేయర్  రేసులో ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేత కుమారుడు ఇప్పటికే గత ఎన్నికల్లో ఎంపీ సీటుకు పోటీచేసిన విషయం తెలిసిందే.



అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కేంద్ర మాజీమంత్రి, ఒకప్పుడు కాంగ్రెస్‌లో చక్రం తిప్పి ఆ తర్వాత పార్టీ మారి... రాజకీయంగా అంత క్రియాశీలంగా లేని ఈ నేత కుమారుడి పేరును కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ నేత కుమారుడు కూడా డాక్టర్‌గా ప్రసిద్ధుడే కాకుండా, పీఆర్‌పీలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీ తరఫున అసెంబ్లీ సీటుకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ మేయర్ పీఠం బీసీలకు రిజర్వ్ కానున్నదని తెలిశాకే వీరంతా కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారట. కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించలేదనే విమర్శలను మూటగట్టుకున్నందున మేయర్‌గా టీఆర్‌ఎస్ నేత కుమార్తెకు అవకాశం కల్పిస్తే మంచిదేనని అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉందనే ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top