ఏఎమ్మార్పీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుగా మారేప్రమాదం ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఏఎమ్మార్పీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుగా మారేప్రమాదం ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కింద 2లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 60 వేల నుంచి 70 వేల ఎకరాలు బీడుగా మారాయన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు విషయం లో కొద్దిగా నిర్లక్ష్యం జరిగింది వాస్తవమేనని, ఈ ప్రభుత్వమైనా సరిగ్గా కృషిచేస్తే రెండేళ్లలో పనులు పూర్తి అవుతాయన్నారు.
సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించేందుకు రూ.900 కోట్ల రుణాన్ని జైకా మంజూరు చేసినా గత ప్రభుత్వాలు కావాలనే పక్కన పెట్టాయని హరీశ్ అన్నారు. ఇప్పుడు వ్యయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు పెరిగిందని, పురపాలక శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ఏఎమ్మార్పీ నీళ్లు పూర్తిగా ఆయకట్టుకు సరఫరా అవుతాయన్నారు. నల్లగొండ జిల్లా నీటి అవసరాల కోసం కృష్ణాబోర్డు 4.5 టీఎంసీలను కేటాయించిందని, అవసరమైనప్పుడు విడుదల చేస్తామని తెలిపారు.
ఎత్తిపోతలకు మరమ్మతులు: హరీశ్
ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి మళ్లీ ఆయకట్టును స్థిరీ కృతం చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మూడు, నాలుగేళ్లుగా నిలిచి పోయిన ఉదయ సముద్రం పనులను పునరుద్ధరించి వేగంగా చేస్తున్నామని చెప్పారు. 2,277 ఎకరాల సేకరణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి సహకరిస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ప్రధాన కాల్వ లైనింగ్ జరగక 3,500 క్యూసెక్కులకు బదులు 2,500 క్యూసెక్కులే పారుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఏఎమ్మార్పీ ప్రాజెక్టులోని ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను తొలగించి టెండర్లు పిలి చిందని, సాధ్యమైతే మళ్లీ ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను పెట్టేందుకు పరిశీలిస్తామన్నారు.