కిరాతకం...

కిరాతకం...


భార్యను చంపిన భర్త

బెల్టుతో ఉరేసి.. ఆత్మహత్యగా చిత్రీకరణ


 

చైతన్యపురి:  బెల్టుతో మెడకు ఉరేసి భార్యను హతమార్చి.. ఆపై మూర్ఛతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడో కిరాతక భర్త. మృతురాలి మెడపై ఉన్న గాట్లును గమనించి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. సరూర్‌నగర్  పోలీసులు, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడకు చెందిన యాదయ్య, బాసమ్మ దంపతుల కుమార్తె రేణుక(26)కు విజయవాడకు చెందిన ప్రసాద్‌తో 8 ఏళ్ల క్రి తం పెళ్లైంది. ప్రస్తుతం వీరు సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రసాద్ ఓ బ్యాంక్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి.  రేణుక తమ్ముడు వెంకటేశ్ (15) వీరి ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం బావమరిదిని పనిపై కూకట్‌పల్లి పంపించాడు. కొద్దిసేపటి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.   దీంతో ఆవేశానికి గురైన ప్రసాద్ భార్య మెడకు బెల్టుతో ఉరిబిగించి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బావమరిది తన అక్కను లేపినా కదలక పోవటంతో బావకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇద్దరూ ఆమెను స్థానిక  ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. బావమరిదితోనే మామకు ఫోన్ చేయించి, పిట్స్ రావడంతో రేణుక చనిపోయిందని చెప్పించాడు. సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని కారులో శివన్నగూడకుతీసుకెళ్లాడు. మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులకు రేణుక మెడపై గాయాలు కనిపించాయి. అల్లుడిని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు.  దీంతో మృతదేహాన్ని  రాత్రి 11 గంటకు తిరిగి హుడా కాంప్లెక్స్‌కు తీసుకొచ్చి సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రసాద్‌కు మరో యువతితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని మృతురాలి బంధువులు పోలీసులకు తెలిపారు.



అల్లుడు ప్రసాద్ అతని సోదరి జ్యోతి కలిసి గతంలో రెండు పర్యాయాలు రేణుకను హత్య చేయటానికి యత్నించారని, ఇప్పుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో గొంతు నులిమి చంపేశారని   తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు బుధవారం రేణుక మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ప్రసాద్‌ను విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించినట్టు తెలిసింది. కాగా, హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top