వృద్ధాప్యం ఇక రానే రాదు! | Sakshi
Sakshi News home page

వృద్ధాప్యం ఇక రానే రాదు!

Published Sat, Feb 20 2016 4:57 PM

వృద్ధాప్యం ఇక రానే రాదు!

సెనిసెంట్ కణాల తొలగింపుతో ఆయుష్షు, ఆరోగ్యం సొంతం!
ఎలుకలపై జరిపిన ప్రయోగం సక్సెస్


బతికినన్ని రోజులూ ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా గడవాలనేది దాదాపు ప్రతీ వ్యక్తి కోరిక. నేటి టెక్నాలజీ యుగంలో ప్రాణాంతకమైన వ్యాధులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయిలో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. కానీ చత్వారం, కీళ్లనొప్పులు, మతిమరుపు.. శరీర పటుత్వం తగ్గడం వంటి వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేయలేకపోతున్నాం. వీటిని సైతం రూపుమాపి మనిషిని నిత్య యవ్వనుడిగా ఉంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు కీలకమైన విజయాలు సాధించారు. - సాక్షి, హైదరాబాద్

మన శరీరం వివిధ రకాల కణాలతో నిండి ఉంటుంది. ఒకటి రెండుగా... ఆ రెండు నాలుగుగా విభజితమై.. బహుకణాలుగా మారి అవయవాలు ఏర్పడ్డాయని మనకు తెలుసు. అయితే ఈ శరీర కణాలు మనం జీవించినంతకాలం విభజితం కావు. కొన్నాళ్లకు అలసిపోయి విభజన సాధ్యం కాదని ఆగిపోతాయి. ఒక కణం దాదాపు 60 సార్లు విభజితమవుతుందని ఓ అంచనా. విభజితం ఆగిపోయిన కణాలను సినసెన్స్ కణాలంటారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఈ కణాలూ పెరుగుతాయి. యుక్త వయసులో శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ రకం కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. వృద్ధాప్యంలో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడంతో వృథా కణాలు శరీరంలో పేరుకుపోతాయి. చర్మంలో పేరుకుపోయే కణాలు ముడుతలకు కారణమైతే... మిగిలిన కణజాలాలు, అవయవాల్లోనివి రకరకాల ఇన్‌ఫ్లమేషన్‌లకు కారణమవుతాయి. దీంతో రకరకాల సమస్యలు, వ్యాధులు చుట్టుముడతాయి. ఏదో ఒక మందును వాడి ఈ వృథా కణాలన్నింటినీ లేదా ఎక్కువవాటిని శరీరం నుంచి తొలగిస్తే....?

ఎలుకల ఆయుష్షు పెరిగింది

సెనిసెంట్ కణాలను శరీరం నుంచి తొలగించడం ద్వారా ఆయుష్షును పెంచవచ్చని మేయో క్లినిక్ శాస్త్రవేత్త వాన్ డ్యూరసెన్ తాజాగా నిరూపించారు. శరీరంలోని అన్ని రకాల కణాలను గుర్తించగలిగే విధం గా జన్యుమార్పిడి చేసిన ఎలుకలకు వారానికి రెండుసార్లు చొప్పున 6 నెలల పాటు ఒక రసాయనాన్ని ఎక్కించినప్పుడు వాటి ఆయుష్షు దాదాపు 25% పెరిగింది. వయసుతోపాటు వచ్చే మార్పుల వేగం గణనీయంగా తగ్గింది. సాధారణ ఎలుకలతో పోలిస్తే వీటి మూత్రపిండాలు, గుండె మెరుగ్గా పనిచేసినట్లు గుర్తించారు. ఈ కణాలు తగ్గిన ఎలుకలు ఎంతో చురుకుగా కని పించాయి. అయితే ఈ విధానం మనుషుల్లోనూ పనిచేస్తుందా? సాధ్యమే అంటున్నారు డ్యూరసెన్. ఈ కణాలను తొలగించేందుకు వాడే మందుల తయారీకి ఓ కంపెనీని ఏర్పాటు చేశారు.

ఇతర మార్గాలూ ఉన్నాయ్..

 ఆయుష్షు పెంచేందుకు సెనిసెంట్ కణాలను తొలగించడం ఒక్కటే మార్గం కాదు. కొన్ని రకాల జన్యువులను తొలగించడం ద్వారా, కేలరీలను తగ్గించడం ద్వారా ఆయుష్షు పెంచవచ్చు. ఈ పద్ధతులు మనుషులకు అంత ఆచరణయోగ్యం కాదని నార్త్ కారొలినా స్కూల్ ఆఫ్ మెడిసన్ జన్యుశాస్త్రవేత్త నెడ్ షార్ప్‌లెస్ చెప్పారు. ఈ కణాల తొలగింపు ద్వారా ఆయుష్షు పెంచడం ఇదే తొలిసారి అని అన్నారు. డ్యూరసెన్ కంపెనీ సెనిసెంట్ కణాలను సమర్థంగా తొలగించేందుకు తగిన విధానాన్ని, రసాయనాన్ని తయారు చేస్తే త్వరలో మంచి ఆరోగ్యంతో కష్టాల్లేని వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చునేమో!

Advertisement
Advertisement