ప్రాణహిత పడుకున్నట్లే..!

Funds allocation for pranahita chevella project - Sakshi

2017–18లో రూ.775 కోట్లు కేటాయింపు

ఖర్చయింది కేవలం రూ.106 కోట్లు

ఈ ఏడాది రూ.350 కోట్లే కేటాయింపు

ఇందులోనూ పరిహారానికే రూ.267 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: నాలుగేళ్లుగా అతీగతీ లేని ప్రాణహిత ప్రాజెక్టుకు మున్ముందూ అవే పరిస్థితులు దాపురించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. బడ్జెట్‌లో మొక్కుబడి కేటాయింపు లతో ప్రాణహిత ప్రాజెక్టు పూర్తిగా పడకేసే సూచనలున్నాయి. 2017–18 బడ్జెట్‌లో భారీ బడ్జెట్‌ కేటాయింపులు జరిగినా, పనులు జరగక నిధులన్నీ నీరసపడగా.. ఈ ఏడాది ఏకంగా బడ్జెట్‌ను సగం తగ్గించి రూ.350 కోట్లకే పరిమితం చేయడం ద్వారా ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.

నిధులున్నా నీరసం
2008లో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణ యించగా, దాన్ని తదనంతరం రెండు లక్షల ఎకరాలకు పెంచింది. దీనికి అనుగుణంగా రూ.6,465 కోట్లకు అంచనాలు సవరిం చింది. ఇక అటవీ, వన్యప్రాణి అనుమతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులో భాగంగా నిర్మించే తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని ఒకటిన్నర కిలోమీటర్‌ దూరం పైకి జరిపింది.

బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడంతో నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలకు తగ్గింది. అయితే గేట్ల సంఖ్య, పొడవు పెరగడం వంటి కారణాలతో నిర్మాణ వ్యయం రూ.965 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు పెరిగింది. అయితే పెరిగిన వ్యయాన్ని 2008–09 ఎస్‌ఎస్‌ఆర్‌ లెక్కల ఆధారంగా గణించగా.. తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను పరిగణనలోకి తీసుకొంటే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీలో చర్చ జరిగినా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు.

ఈ అనుమతి వచ్చిన తర్వాతే టెండర్‌ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. దీనికి తోడు బ్యారేజీ నిర్మా ణానికి 665 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా ఈ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో పాటే బ్యారేజీ నుంచి 72 కిలోమీటర్ల మేర కాల్వల తవ్వకం చేయాల్సి ఉన్నా ఆ పనులు అంతంత మాత్రంగానే జరుగుతు న్నాయి. గత ఏడాది రూ.775.40 కోట్లు కేటాయించినా 106.46 కోట్లే ఖర్చయ్యాయి.

ఈ బడ్జెట్‌లో మిగిలేది రూ.83 కోట్లే!
ఇక ప్రాజెక్టు మొత్తానికి 508 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉండగా, దీనికి కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ మొదటి దశ అనుమతి వచ్చి 8 నెలలైంది. దీనికి రూ.102 కోట్ల పరిహారాన్ని చెల్లిస్తే రెండో దశ అనుమతి లభించే అవకాశం ఉన్నా, నిధులు విడుదల చేయలేదు. ఇక వన్యమృగ సంరక్షణ ప్రాంతం లో మరో 622 హెక్టార్ల భూమి బదలా యింపునకు కూడా మొదటి దశ అనుమతి లభించింది. దీనికి పరిహారంగా రూ.165 కోట్లు మేర అవసరం అవుతున్నాయి.

ఈ పరిహార ప్రతిపాదనలకు ఇంకా తుదిరూపు రాకపోవడంతో 2017–18లో కేటాయించిన బడ్జెట్‌ను రూ.220 కోట్లకు సవరించారు. ఇందులో రూ.106.46 కోట్లే ఖర్చవగా మిగిలిన నిధులు ఈ నెలాఖరులోగా విడుదల చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో అటవీ, వన్యప్రాణి పరిహా రానికి  రూ.267 కోట్లను 2018–19 బడ్జెట్‌లో కేటాయించిన రూ.350 కోట్ల నుంచే ఖర్చు చేయాల్సి ఉంది. అదే జరిగితే మిగతా భూ సేకరణ, ఇతర పనులకు మిగిలింది రూ.83 కోట్లే. ఈ నిధులతో ప్రాణహిత ప్రాజెక్టు  పనులెలా సాగుతాయన్నది ప్రశ్న.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top