
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ 2026–27 బడ్జెట్ రూపకల్పన కసరత్తును అక్టోబర్ 9 నుంచి ప్రారంభించనుంది. ఒకవైపు అమెరికా 50 శాతం టారిఫ్ రేటును అమలు చేస్తుండడం, అంతర్జాతీయ వాణిజ్య ధోరణుల్లో మార్పుల నేపథ్యంలో తీసుకురానున్న ఈ బడ్జెట్‌లో కేంద్రం ఏవైనా కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తుందేమో చూడాల్సి ఉంది. ముఖ్యంగా దేశీ డిమాండ్‌కు మరింత ఊతమివ్వడం, ఉపాధి కల్పనను విస్తృతం చేయడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత కేంద్రం ముందుంది.
ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన బడ్జెట్ ముందస్తు సమావేశాలు అక్టోబర్ 9 నుంచి మొదలవుతాయంటూ ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ సర్క్యులర్‌లో పేర్కొంది. సమావేశాలు ముగిసిన అనంతరం 2026–27 బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ ఖరారు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.