
మార్కెట్ ధరలు సవరించేలా చూడండి
సాగునీటి ప్రాజెక్టులకు భూములు సేకరిస్తున్న ప్రభుత్వం బాధిత రైతులకు ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న నెపంతో ...
ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని
హైకోర్టులో వట్టెం రైతుల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు భూములు సేకరిస్తున్న ప్రభుత్వం బాధిత రైతులకు ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న నెపంతో మూడేళ్లుగా భూముల మార్కెట్ విలువను పెంచలేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ విలువను సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రైతులు శ్రీనివాసగౌడ్, మరో ముగ్గురు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు సేకరిస్తోందని పిటిషనర్లు తెలిపారు. తమ గ్రామాలు కూడా భూ సేకరణ పరిధిలో ఉన్నాయన్నారు. తమ మండలంలో ప్రస్తుతం ఎకరా భూమి ధర బహిరంగ మార్కెట్‌లో రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉందన్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర మాత్రం రూ.60 వేలు మాత్రమే చూపుతోందన్నారు. పక్క గ్రామం పోతిరెడ్డిపాడులో ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందిన బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ఎకరా రూ.5 లక్షల చొప్పున 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందన్నారు. మార్కెట్ ధరలను సవరిస్తే 2013 భూ సేకరణ చట్టం కింద తమవంటి బాధిత రైతులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో ప్రభుత్వం మార్కెట్ ధరలను సవరించడం లేదన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు కోర్టును కోరారు.