ఆర్థిక అసమానతలు పోవాలి
సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించాలని, అందుకు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- దేశ శ్రామికుల్లో నైపుణ్య శిక్షణ కలిగినవారు 4.7 శాతమే
- నైపుణ్యాభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించాలని, అందుకు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇప్పటికీ నిరుద్యోగ సమస్య సంతృప్తికర స్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావని, ఇప్పటికే ఎక్కువ మంది ఉన్నారన్న భావన ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయని, అందుకు నైపుణ్యాభివృద్ధి అవసరమని చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ)లో ప్రాంతీయ వృత్తి శిక్షణ సంస్థ (ఆర్‌వీటీఐ) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం ఎంతయినా ఉందని వెంకయ్య తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినపుడే దేశం మరింత ముందుకు వెళ్తుందన్నారు. మహిళలు వెనుకబడి ఉంటే ఏ దేశమూ ముందుకు పోదన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలు..
ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ప్రతిభకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పదును పెడితే అద్భుతాలు సృష్టించొచ్చని తెలిపారు. 2022 నాటికి 109.73 మిలియన్ల మంది నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం ఉంటుందని, దేశంలో మొత్తం శ్రామికుల్లో 4.7 శాతం మంది మాత్రమే నైపుణ్య శిక్షణ పొందినట్లు అంచనా ఉందని చెప్పారు. జర్మనీలో 75 శాతం, జపాన్‌లో 80 శాతం, దక్షిణ కొరియాలో 96 శాతం నైపుణ్య శ్రామికులు ఉన్నారని వివరించారు. వృత్తివిద్య శిక్షణను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరతను అధిగమించడం సాధ్యమన్నారు. ఆరోగ్య సంరక్షణ, పర్యాటక పరిశ్రమ, ప్యాకేజింగ్, ప్రింటింగ్‌లలోనూ ప్రాంతీయ వృత్తి విద్య శిక్షణ సంస్థలు శిక్షణను అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. శిక్షణ పొందిన వారికి సరైన మార్గదర్శకత్వం లభిస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
మహిళా పారిశ్రామిక వేత్తలకు అండదండలు
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండదండలు అందించడంలో ముద్రా బ్యాంకు ప్రముఖ పాత్ర పోషిస్తోందని వివరించారు. బ్యాంకులు, సిడ్బి వంటి సంస్థలతో సైతం అనుబంధం ఏర్పరచుకోవాలని సలహా ఇచ్చారు. వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన శ్రామికులకు గిరాకీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌జీవోల సమన్వయంతో ఇటువంటి శిక్షణ సంస్థలు మరిన్ని ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. కేంద్ర పెట్రోలియమ్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ వృత్తి విద్య శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 17 శిక్షణ సంస్థలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంకయ్య సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్యనాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఘనస్వాగతం పలికారు.