దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడిన ఫర్హత్ ఉన్నిస్సా హైదరాబాదీ యువతిగా తేలింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కిన హైదరాబాద్ యువతి
సాక్షి, హైదరాబాద్: దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడిన ఫర్హత్ ఉన్నిస్సా హైదరాబాదీ యువతిగా తేలింది. అబుదాబి నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమానంలో వచ్చిన ఈ యువతిని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఈమె లోదుస్తుల్లో దాచి ఉంచిన రూ.64.39 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తూ పలువురు మహిళలు గతంలో హైదరాబాద్ విమానాశ్రయంలోనూ చిక్కారు. అయితే ఈ యువతుల వెనుక ఉన్న బడా స్మగ్లర్ల వివరాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు తమ రూటు మార్చుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన బడా స్మగ్లర్లు ఇక్కడి యువతినే వినియోగించి ఢిల్లీ మీదుగా బంగారం అక్రమ రవాణాకు కుట్రపన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫర్హాత్ పూర్వాపరాల కోసం ఢిల్లీ నుంచి ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుని దర్యాప్తు చేపట్టింది.