ఇక్కడ ఆదిల్... అక్కడ బాబాజాన్! | Conspiracy case in Ahmedabad on aphroj | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఆదిల్... అక్కడ బాబాజాన్!

Mar 4 2016 12:23 AM | Updated on Sep 3 2017 6:55 PM

సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై వచ్చిన నగరవాసి మహ్మద్ ఆదిల్ అఫ్రోజ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమోదైన కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు.

అఫ్రోజ్‌పై అహ్మదాబాద్‌లో కుట్ర కేసు
గత నెలలో సౌదీ నుంచి డిపోర్టేషన్
గుజరాత్‌కు తరలించిన డీసీబీ అధికారులు

 
సిటీబ్యూరో:  సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై వచ్చిన నగరవాసి మహ్మద్ ఆదిల్ అఫ్రోజ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమోదైన కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. బాబాజాన్ పేరుతో అక్కడి యువతకు పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అఫ్రోజ్‌ను అహ్మదాబాద్ డీసీబీ అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకువెళ్లారు. న్యాయస్థానం అనుమతి మేరకు తదుపరి విచారణ నిమిత్తం గురువారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఆదిల్ అఫ్రోజ్ సీసీఎస్ ఆధీనంలోని సిట్‌లో 2003లో నమోదైన కేసులో వాంటెడ్‌గా ఉండి దాదాపు 13 ఏళ్లు పాటు సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నాడు.

సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఇతడి ఆచూకీ కనిపెట్టిన నిఘా వర్గాలు సంబంధిత ఏజెన్సీలకు ఆధారాలను సమర్పించడం ద్వారా గత నెల 22న డిపోర్టేషన్‌పై తీసుకువచ్చాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్య 2003 మార్చ్‌లోహత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేసిన డీసీబీ అధికారులు గుజరాత్‌లో పేలుళ్లకు పన్నిన ఓ కుట్రను ఛేదించారు. గుజరాత్, తెలంగాణలకు చెందిన వ్యక్తులు పథకం ప్రకారం కొంత మందిని పాకిస్థాన్‌కు పంపించి ఉగ్రవాద శిక్షణ ఇప్పించారని, భారీ విధ్వంసానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో డీసీబీ అధికారులు ఇప్పటి వరకు 62 మందిని అరెస్టు చేయగా... 22 మంది దోషులుగా తేలారు. మరో 22 మందిని అహ్మదాబాద్‌లోని పోటా న్యాయస్థానం సరైన ఆధారాలు లేనికారణంగా నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2003లోనే నమోదైన ఈ కేసులో ఆదిల్ వాంటెడ్‌గా ఉన్నాడు.

అహ్మదాబాద్ యువతను బాబాజాన్ పేరుతో ఆకర్షించి పాకిస్థాన్‌కు పంపి ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడని డీసీబీ అధికారులు ఆరోపించారు. అఫ్రోజ్‌ను డిపోర్ట్ చేసిన విషయం తెలుసుకున్న అహ్మదాబాద్ పోలీసులు గత వారం పీటీ వారెంట్‌పై గుజరాత్ తీసుకువెళ్లారు. పోటా కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించడంతో తదుపరి విచారణ నిమిత్తం గురువారం సబర్మతి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement