మినీ షోరూం | Commissioner of Police | Sakshi
Sakshi News home page

మినీ షోరూం

Jan 28 2014 1:37 AM | Updated on Aug 21 2018 7:58 PM

మినీ షోరూం - Sakshi

మినీ షోరూం

బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ‘తనిష్క్ ప్రెస్‌మీట్’ కమిషనరేట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల్ని ఆకర్షించింది.

  •      వెల్లడైన సంస్థల సెక్యూరిటీ లోపాలు
  •      భద్రతా చర్యలపై పోలీసుల కసరత్తు
  •      సిద్ధమవుతున్న పక్కా ప్రణాళికలు
  •  
    బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ‘తనిష్క్ ప్రెస్‌మీట్’ కమిషనరేట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల్ని ఆకర్షించింది. నిందితుడు కిరణ్ నుంచి పోలీసులు రికవరీ చేసిన రూ.5.75 కోట్ల విలువైన 15.5 కేజీల బంగారాన్ని ప్రదర్శించడమే అందుకు కారణం. దీనికి సంబంధించిన 40 బ్రాస్‌లెట్స్, 33 నెక్లెస్‌లు, 89 లాకెట్లు, 58 చెవిదుద్దులు, 98 ఉంగరాలతో పాటు మరికొన్ని ఆభరణాలతో కలిపి 528 వస్తువులు ఒకేచోట ప్రదర్శించారు. దీంతో అదో మినీ షోరూమ్‌ను తలపించింది. వీటిలో అత్యధికం అత్యాధునిక డిజైన్లతో కూడినవి కావడంతో కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగినులు సందర్శకులుగా మారిపోయారు. దాదాపు అరగంటకు పైగా విభాగాల వారీగా బృందాలుగా వచ్చి చూసిపోవడం కనిపించింది. పోలీసులు, ‘తనిష్క్’ ఉద్యోగులు, ఈ సందర్శకులు, మీడియా... ఇలా అందరి దృష్టీ బంగారం పైనే ఉండగా... చోరీ చేసిన రూ.5.98 కోట్ల విలువైన పసిడిని  నిందితుల ఇంట్లో ‘దాచిన’ రెగ్జిన్ బ్యాగ్ మాత్రం ఓ మూలన కాళ్ల మధ్యన పడుండి ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు.
     
    సాక్షి, సిటీబ్యూరో : అత్యంత సంచలనం సృష్టించిన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన చోరీ తక్కువ వ్యవధిలోనే నాటకీయంగా కొలిక్కి వచ్చినా... పోలీసులకు కొన్ని పాఠాలు నేర్పింది. ఇన్సూరెన్స్ విధివిధానాలు, బంగారం దుకాణాల్లో ఉన్న భద్రతా లోపాల్ని ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని నేరాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
     
    అంతుచిక్కని ‘ఇన్సూరెన్స్’ విధానం
     
    సాధారణంగా ఓ వ్యక్తి రూ.వేలు, రూ.లక్షల్లో ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అతనికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే కానీ సదరు సంస్థ పాలసీ మంజూరు చేయదు. అయితే తమ సరుకుకు కోట్ల రూపాయల బీమా కోరుతూ పెద్ద పెద్ద దుకాణాలు ఆశ్రయించిన సందర్భంలో ఇన్సూరెన్స్ సంస్థలు ఎలాంటి తనిఖీలు లేకుండానే పాలసీ ఎలా ఇస్తున్నాయన్నది పోలీసులకు అంతుచిక్కట్లేదు. బీమా సంస్థలూ చెల్లించేది ప్రజల సొమ్మే కాబట్టి కోట్ల సరుకుకు బీమా కోరినప్పుడు సదరు దుకాణంలో పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయా? అనేది తనిఖీ చేయకపోవడం నిర్లక్ష్యమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
     
    అప్‌డేట్ కాని సీసీ కెమెరాలు
     
    ప్రస్తుతం సిటీలో ఉన్న అనేక సంస్థలు భద్రత కోసం సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్నాయి. అయితే వీటి నిర్వహణను కొన్ని మర్చిపోతుంటే... మరికొన్ని అప్‌డేట్‌ల విషయం పట్టించుకోవట్లేదు. రూ.కోట్ల విలువైన సొత్తుతో లావాదేవీలు నిర్వహించే సంస్థలు రాత్రివేళల్లో దుకాణాలు మూసిన తరవాత సదరు సీసీ కెమెరాల్ని పర్యవేక్షించే బాధ్యత సెక్యూరిటీ గార్డులకు అప్పగించడమో, అందుకు ప్రత్యేకంగా ఉద్యోగుల్ని నియమించుకోవడమో చేయాలన్నది పోలీసుల మాట. ఈ రెండూ ఇబ్బందికరమని భావించిన నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్‌ను సమీకరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. వీటిలో సీసీ కెమెరాల సర్వర్స్‌ను అప్‌డేట్ చేసుకోవడం వల్ల దుకాణం మూసిన తరవాత లోపలి వైపు ఏవైనా కదలికలు ఉన్నట్లైతే వెంటనే అప్రమత్తమయ్యే సర్వర్లు ఫీడ్ చేసిన ఫోన్ నెంబర్లకు తక్షణం సంక్షిప్త సందేశాన్ని (ఎస్సెమ్మెస్) పంపిస్తాయి. వీటిలో ఏ ఏర్పాటు ఉన్నా... ‘తనిష్క్’ ఉదంతం మరోలా ఉండేదని అధికారులు చెప్తున్నారు.
     
    ‘కొత్తవారి’ ఆరా బాధ్యత

    కీలకమైన సంస్థలు సెక్యూరిటీ గార్డులతోపాటు ఇతర ఉద్యోగుల్ని నియమించుకునే సందర్భంలో వారి పూర్వాపరాల్ని పరిశీలించట్లేదు. అందుకు అవసరమైన మౌలిక వసతులు యాజమాన్యం దగ్గర ఉండకపోవచ్చు. అయితే పోలీసులను ఆశ్రయించి ఒక్కో వ్యక్తికి రూ.500 చొప్పున చెల్లిస్తే.. వారి వివరాలను పోలీసులే ఆరా తీసి అందిస్తారు. దీనిపై ప్రచారం లేకపోవడంతో సరైన రీతిలో సద్వినియోగం కావట్లేదని గుర్తించిన పోలీసులు.. ఈ విషయం అందరికీ తెలిసేలా చేయాలని భావిస్తున్నారు. మరోపక్క తనిష్క్‌లో చోరీ పాత ఉద్యోగస్థుల పనిగా మొదట అనుమానించిన పోలీసులు ఆ వివరాల కోసం ఆరా తీయగా... తమ దగ్గర లేవని యాజమాన్యం స్పష్టం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు పాత ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డుల వివరాలను పొందుపరిచేలా సంస్థల యాజమాన్యాలను చైతన్య పరచాలని భావిస్తున్నారు. ‘తనిష్క్’ ఉదంతంలో విధుల్లో ఉన్న గార్డులు విఫలమైన నేపథ్యంలో సెక్యూరిటీ గార్డుల్ని చైతన్యపరిచి, వారు విధి నిర్వహణలో ఎలాంటి అప్రమత్తత పాటించాలనేది స్పష్టం చేయాలని భావిస్తున్నారు.
     
    చట్టం లేకే...
     
    ఫలానా సంస్థలు ఈ విధమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలంటూ నగర పోలీసు చట్టంతో సహా ఎక్కడా ప్రస్తావన లేదు. దీనికి సంబంధించిన ప్రజా భద్రతా చట్టం ఇంకా రూపుదాల్చుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏటీఎం సెంటర్ల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసిన పోలీసులు.. గడువు తీరినా అవి అమలు చేయని బ్యాంకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. తరచూ ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉండే నగరంలోని వాణిజ్య సంస్థలు, సముదాయాలకు సైతం సూచనలు చేయడం తప్ప ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని నగర పోలీసులు యోచిస్తున్నారు.
     
     రసూల్‌పుర బస్తీలోనే ‘తనిష్క్’ దొంగ

     బేగంపేట, న్యూస్‌లైన్: పంజగుట్ట తనిష్క్ షోరూంలో భారీ దొంగతనానికి పాల్పడి సంచలనం సృష్టించిన కిరణ్ తమ ఇంటి పక్కనే నివసించాడని తెలుసుకొని బేగంపేట రసూల్‌పుర బస్తీవాసులు ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఈపూరు ప్రాంతానికి చెందిన కిరణ్ రెండు నెలల క్రితం ఇక్కడకు వచ్చాడు. అప్పటి నుంచి మరో ముగ్గురు మిత్రులతో కలిసి ఇంటి పైభాగాన ఉన్న చిన్న రేకుల గదిలో ఉంటున్నాడు. కొన్నాళ్లపాటు స్థానిక క్లబ్‌లో బాయ్‌గా పనిచేసి మానేశాడు. తమ ప్రాంతంలో సాదాసీదాగా తిరిగే యువకుడు భారీ దొంగతనానికి పాల్పడ్డాడంటే స్థానికులు నమ్మలేకపోతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement