
సిటీపై ఖాన్‌సాబ్ చెరగని ముద్ర
దక్షిణభారత ప్రముఖ విద్యావేత్త, రాజకీయనాయకుడు, మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసిన బషీరుద్దీన్ బాబూఖాన్ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అస్తమయం చెందారు.
దారుషిఫా,న్యూస్‌లైన్: దక్షిణభారత ప్రముఖ విద్యావేత్త, రాజకీయనాయకుడు, మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసిన బషీరుద్దీన్ బాబూఖాన్ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అస్తమయం చెందారు. ఈ విషయం తెలుసుకున్న అనేకమంది ప్రముఖులు, పరిచయస్తులు, రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీలు నగరానికి చేరుకొని ఆయన జనాజ నమాజులో పాల్గొని ఆత్మకుశాంతి చేకూరాలని పార్థనలు చేశారు. ఈయన మరణం మైనార్టీ ప్రజానీకానికి తీరనిలోటని పలువురు పేర్కొన్నారు. బాబూఖాన్ మైనార్టీల కోసం విద్య,ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారు. ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
కుటుంబ నేపథ్యం: బాబూఖాన్‌కు భార్య, సల్మాన్ బాబూఖాన్ అనే కుమారుడితోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిజాం కాలంలో బషీరుద్దీన్ బాబూఖాన్ తండ్రి ఖాన్‌బహదూర్ అబ్దుల్ కరీం బాబూఖాన్ 1930లో హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని స్థాపించారు. అప్పటికీ ఇప్పటికీ ప్రసిద్ధి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనం, నాంపల్లిలోని గాంధీభవన్, ఢిల్లీలోని హైదరాబాద్‌హౌస్, గోదావరి తీరంలోని సోహన్ బ్రిడ్జి, కదం డ్యామ్, తుంగభద్ర డ్యాం, రామగుండం థర్మల్ పవర్‌స్టేషన్ తదితర నిర్మాణాలను అబ్దుల్ కరీం బాబూఖాన్ నిర్మించారు. నాంపల్లి గాంధీభవన్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కానుకగా అందజేశారు. నిజాం కాలంలో గొప్ప పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించారు. హైదరాబాద్ రాష్ర్ట అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కరీం బాబూఖాన్‌కు ఖాన్‌బహదూర్ బిరుదు కూడా ఉంది.
నిర్మాణాలు: నిజాం కళాశాల నుంచి డిగ్రీలో పట్టభద్రులైన బషీరుద్దీన్ బాబూఖాన్ అనంతరం వారసత్వంగా వస్తున్న కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో చేరారు. బషీరుద్దీన్ బాబూఖాన్ బండ్లగూడలో గ్లెండెల్ అకాడమీ స్కూల్‌తో పాటు స్ప్రింగ్‌ఫీల్డ్ పాఠశాలను కూడా నడుపుతున్నారు. బషీర్‌బాగ్‌లోని బాబూఖాన్ ఎస్టేట్స్, సోమాజీగూడ చౌరస్తాలోని బాబూఖాన్ మిలీ నియం, బాబూఖాన్ హిల్‌వియ్యూ,బాబూఖాన్ మాల్,క్వీన్ ప్లాజా,బాబూఖాన్ చాం బర్స్,నోబుల్ చాంబర్స్‌తోపాటు 30 ఏళ్లుగా నగరంలో దాదాపు 20కిపైగా మల్టీస్టోరేడ్ రెసిడెన్షియల్,కమర్షియల్‌కాంప్లెక్స్‌లను నిర్మించారు.
రాజకీయ ప్రస్థానం: 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి అదేఏడాది ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. 1985లో మైనార్టీ సంక్షేమ శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం తాను మైనార్టీలకు పూర్తిస్థాయిలో సేవలందించలేదని 1989లో జరిగిన ఎన్నికల్లో పోటీచేయలేదు. 1994 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉన్నతవిద్య, భారీ పరిశ్రమలు, పర్యాటక, మైనార్టీశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.