
ఇక్కడ చదవలేను
మియాపూర్ శ్రీచైతన్య బాలికల జూనియర్ కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
- నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్య
- మియాపూర్ శ్రీచైతన్య బాలికల కళాశాలలో ఘటన
హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య బాలికల జూనియర్ కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కన్నవాళ్లకు తీరని వేదన మిగిల్చింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన నడ్కుడ సంతోష్‌రెడ్డి, లత వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి సాత్విక(16)ను బాగా చదివించాలన్న ఉద్దేశంతో నగరంలోని మియాపూర్ శ్రీచైతన్య బాలికల జూనియర్ కళాశాలలో చేర్పించారు. ఇక్కడే హాస్టల్‌లో ఉంటూ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక దసరా సెలవులకు ఇంటికి వెళ్లింది. ఆ కాలేజీలో చదవడం, హాస్టల్లో ఉండటం తనకిష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వారు కూతురికి నచ్చజెప్పి, సోమవారం తిరిగి హాస్టల్‌లో దించి వెళ్లారు.
చివరిసారిగా తల్లికి ఫోన్: వచ్చినప్పటి నుంచీ తోటి విద్యార్థినులతో ముభావంగా ఉంటున్న సాత్విక... మంగళవారం తరగతులకు హాజరైంది. మధ్యాహ్నం 12.30కి భోజన విరామ సమయంలో తల్లికి ఫోన్ చేసింది. ఇక్కడ తాను చదువలేనని ఆమెకు చెప్పినట్టు తెలిసింది. అనంతరం హాస్టల్‌లోని తన గదికి వెళ్లి, మంచపైనున్న పరుపులను ఒకచోట చేర్చి వెంట తెచ్చుకున్న అగ్గిపెట్టెతో అంటించింది. ఆ మంటల్లో నిలుచుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఒకటిన్నర సమయంలో గదులు తనిఖీ చేస్తున్న వాచ్‌మన్ పూర్తిగా కాలివున్న సాత్వికను గుర్తించాడు. వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావుకు తెలిపాడు.
ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. హాస్టల్ గదిలో సాత్వికతో పాటు మరో ఐదుగురు విద్యార్థినులు ఉంటున్నారు. ఘటన సమయంలో వారెవరూ రూమ్‌లో లేరు. కాగా, మార్కుల రేసులో తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని గతంలో ఇక్కడి విద్యార్థినులు ఆరోపించారు. సాత్విక బలవన్మరణానికి కూడా మానసిక ఒత్తిడే కారణమయి ఉండవచ్చని భావిస్తున్నారు. తల్లితో సాత్విక ఫోన్‌లో ఏం మాట్లాడింతో తెలియాల్సి ఉందని, వారిచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ రమేష్ కొత్వాల్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, గతంలో ఇదే కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
పిల్లల్ని తీసుకెళుతున్న తల్లిదండ్రులు
ఈ ఘటనతో కళాశాల విద్యార్థినులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రులు మంగళవారం కళాశాల హాస్టల్ నుంచి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.