బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తి

బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తి - Sakshi


హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లు, వేదికపై ఎంతమంది ఉండాలి, సభాధ్యక్షత, పార్టీలో అంతర్గతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శనివారం సమీక్షించారు. పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్న ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాకు వివరించారు. ఆదివారం ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.20కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.



అక్కడ పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలుకుతాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనంతకుమార్, ఎం.వెంకయ్యనాయుడు, హన్సరాజ్ గంగారాం అహిర్, బండారు దత్తాత్రేయ ఉంటారు. తొలుత గజ్వేల్‌లో కార్యక్రమాలు ముగిశాక మోదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి 40 నిమిషాలపాటు ప్రసంగిస్తారు. వేదికపైకి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నాయకుడు జి.కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు.



సభాధ్యక్షతపై సందిగ్ధం..

ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న బీజేపీ మహాసమ్మేళన్‌కు ఎవరు అధ్యక్షత వహించాలనేదానిపై పార్టీలో సందిగ్ధం నెలకొంది. పార్టీ కార్యక్రమం కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలోనే సభ నిర్వహించడం సంప్రదాయం అని కొందరు నాయకులు వాదించారు. అయితే వివిధ కారణాల వల్ల పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్షనేత జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని బీజేపీ వర్గాలు ముందుగా వెల్లడించాయి. అంతర్గతంగా జరిగిన పరిణామాలేమిటో వెల్లడి కాకున్నా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సభకు అధ్యక్షత వహిస్తారని శనివారం సాయంత్రానికి పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంలో సందిగ్ధం ఎందుకు ఏర్పడిందో తెలియాల్సి ఉందని అంటున్నారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top