'సారాయి పల్లెలు' మారాయి

'సారాయి పల్లెలు' మారాయి - Sakshi

- గుడుంబాతో కునారిల్లిన పల్లెల్లో మళ్లీ జీవకళ 

రాష్ట్రంలో 95% గుడుంబా రహిత గ్రామాలు

సత్ఫలితాలు ఇస్తున్న ‘రిహాబిలిటేషన్‌ స్కీమ్‌’  

మత్తు వదిలి వృత్తులు, ఉపాధి వైపు మళ్లుతున్న జనం

 

గుడుంబా రక్కసి కోరల్లో చిక్కి విలవిల్లాడిన పల్లెలవి! పని చేయాల్సిన యువత సారా మత్తులో తూగేది.. చిన్న వయసులోనే నానా రోగాలతో కునారిల్లిపోయేది.. పచ్చని సంసారాలు కూలిపోయేవి.. పోషించేవారు ప్రాణాలొదలటంతో కుటుంబాలు అనాథలయ్యేవి. కానీ ఇప్పుడా పల్లెలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. కుల వృత్తులు, ఇతర ఉపాధి పనులతో కళకళలాడుతున్నాయి. యువత హుషారుగా పనిచేసుకుంటూ తలెత్తుకుని జీవిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సారా తయారు చేసే కుటుంబాలను ఆ పని మాన్పించి.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చేపట్టిన ‘పునరావాస పథకమే (రిహాబిలిటేషన్‌ స్కీమ్‌)’ దీనికి కారణం. రాష్ట్రవ్యాప్తంగా 9,560 గ్రామాలు సారాతో ప్రభావితమైనట్లుగా గుర్తించిన ఎక్సైజ్‌ శాఖ... ఈ ఏడాది జూన్‌ నాటికి 9,350 గ్రామాల నుంచి సారాను తరిమి వేసింది. సారా తయారీపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు కొత్త జీవితాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలు, కుటుంబాల పరిస్థితులపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్‌..

– సాక్షి, హైదరాబాద్‌

 

సారా మహమ్మారికి విధ్వంసమైన పల్లె కొత్తగూడెం. తొలి తెలంగాణ సాయుధ పోరాటానికి యోధులను అందించిన ఈ పల్లె.. అనంతర కాలంలో సారా కోరలకు చిక్కి విలవిల్లాడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని ‘సాక్షి’ ప్రతినిధి సందర్శించినప్పుడు విస్తుగొలిపే అంశాలెన్నో వెలుగు చూశాయి. 1,700 ఎకరాల సాగు భూమి, ఊట బావులు, ఆత్మగౌరవంతో బతుకుదామనే పల్లె జనం, తొలి తెలంగాణ సాయుధ పోరాటానికి వీరులను అందించిన చైతన్యం... ఇన్ని ఉన్నా ఈ గ్రామం సారా కోరలకు చిక్కింది. 1,100 గడపలున్న ఈ పల్లెలో 150 కుటుంబాలకు సారానే జీవనాధారం.



ఒక్కో ఇంట్లో రోజుకు రెండు బట్టీలు గుడుంబా తయారు చేసేవారు. ఒక్కో బట్టీ నుంచి నాలుగు సేర్ల.. లెక్కన 1,200 సేర్ల (ఒక్క సేరు = 650 మిల్లీలీటర్లు) సారా ఉత్పత్తయ్యేది. ఇందులో సగం ఆ గ్రామం వాళ్లే తాగగా.. మిగతా సారాను చుట్టూ ఉన్న 10 గ్రామాలకు సరఫరా చేసేవాళ్లు. 2000వ సంవత్సరం నుంచి 2014 దాకా దాదాపు 14 ఏళ్లపాటు సారా రాజ్యమేలింది. ఆయా కుటుంబాల నుంచి పక్క గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల స్కూల్‌ బ్యాగుల్లో కూడా సారా సీసాల సరఫరా జరిగేది. అప్పట్లో గ్రామం నుంచి ఏటా 8 మందికిపైగా పదో తరగతి పూర్తి చేసుకుంటే.. అందులో ఐదుగురు పైచదువులకు వెళ్లకుండా సారా పనిలో, గ్రామంలో దొరికిన పనిలో పడిపోవడం గమనార్హం.



మార్పు వచ్చింది..

గత దశాబ్దకాలంలో కొత్తగూడెంలో సారా మహమ్మారి బారినపడి 

36 మందికిపైగా బలయ్యారు. సారాకు బానిసై జవసత్వాలు ఉడిగిపోయినవారు కొందరైతే.. మత్తులో ఆత్మహత్యకు పాల్పడినవారు మరికొందరు. ఇప్పటికీ సారా రక్కసి విధ్వంసం తాలూకు ఆనవాళ్లు పల్లెలో స్పష్టంగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సారాపై ఉక్కుపాదం మోపడం, ఆయా కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపడంతో.. ఆ పల్లె కోలుకుంటోంది. రెండేళ్లుగా సారా తయారీ పూర్తిగా నిలిచిపోయింది. గతంలో సారా కాసిన కుటుంబాలతోపాటు ఊరు జనం అంతా ఉపాధి హామీ పనులకు, ఇతర వృత్తులకు వెళ్లటం కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ స్కీమ్‌ కింద తమకు ఆర్థిక సహకారం అందిస్తే.. అందరితో కలసి గౌరవంగా బతుకుతామని సారా కాసే కుటుంబాలు చెబుతున్నాయి.

 

చాలా ప్రమాదకరం

బెల్లం, పలు రకాల రసాయనాలు ఉపయోగించి నాటు సారా తయారు చేస్తారు. ఆ మిశ్రమం త్వరగా పులియడానికి, మరింత మత్తు రావడానికి బ్యాటరీ పొడీ, యూరియా వంటివి కలుపుతారు. ఇలా తయారయ్యే సారాలో ఎక్కువ మోతాదులో ఫ్యూజల్‌ ఆయిల్, ఆల్డిహైడ్స్, తక్కువ శాతంలో మిథనాల్‌ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూజల్‌ ఆయిల్, ఆల్డిహైడ్స్‌ శరీరంలో కండర వ్యవస్థ, నాడీ మండలం, జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. శరీరంలో వీటి అవశేషాలు లేకుండా పూర్తి జీర్ణం కావడానికి కనీసం మూడు నెలలకు పైగా పడుతుందని స్పష్టం చేస్తున్నారు.

 

కొత్తగూడెంలో పెద్ద గుట్ట మీద బండ రాళ్లు పగుల గొడుతున్న కుంచం వెంకటయ్యను ‘సాక్షి’ పలకరిస్తే.. ‘‘బండ కొట్టడమే నా కుల వృత్తి. మొదట్ల మంచిగనే బతికినం. నాకు సారా అలవాటైంది. పొద్దున్న లేస్తే సారా తాగడంతో పని చేతగాకపోయేది. నా భార్య పనిచేస్తేనే ఇల్లు గడిచేది. నా భార్య ఇది భరించలేక మా బిడ్డ చదువు మాన్పించి పెళ్లి చేసింది. నా తాగుడు, బిడ్డ పెళ్లితో అప్పులు పెరిగిపోయినయి. కానీ ఇప్పుడు సారా బందయింది. ఆలుమగలం కలసి కంకర కొడితే రోజుకు రూ.600 దాకా వస్తున్నయి. ఎంత మంచిగ తిన్నా రూ.400 మిగులుతున్నయి. నా ఆరోగ్యం కూడా బాగుంటంది..’’ అని తన అనుభవాన్ని వివరించాడు.

 

10 మందిలో ఏడుగురికి..

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురికి సారా అలవాటు ఉందని ఎక్సైజ్‌ శాఖ చేసిన సర్వేలో తేలింది. కొందరైతే రోజుకు సేరు (650 మిల్లీలీటర్లు) సారా కూడా తాగుతున్నట్లుగా బయటపడింది. ఇంతగా సారాకు అలవాటు పడిన వారి సగటు ఆయుష్షు 45 ఏళ్లు.. గిరిజనుల్లో అయితే 35 ఏళ్లు మాత్రమేనని వెల్లడైంది. ఇక సారాకు బానిసైన యువకుల్లో పనిచేసే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. విపరీతంగా సారా తాగేవారికి, కేవలం అలవాటుగా ఉన్న వారికి మధ్య పనిచేసే సామర్థ్యంలో 21 శాతం తేడా ఉందని తేలింది. కేవలం అలవాటుగా ఉన్నవారికి, అసలు సారా అలవాటులేని వారితో పోల్చితే.. 35శాతం పనిచేసే సామర్థ్యం తక్కువని తేలింది.



సారాలోని రసాయనాల కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని, ఆకలి వేయదని.. దాంతో సరిగా తిండి తినక పోవటం, రక్తంలో కీటోన్లు పెరగటంతో కండరాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. దీంతో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు ముసురుకుంటాయని స్పష్టం చేస్తున్నారు. ఇలా యువతను పీల్చిపిప్పి చేస్తున్న సారాను నిర్మూలించి.. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

ఇది ఆర్థిక, సామాజిక సమస్య

రాష్ట్ర ప్రభుత్వం సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించింది. గుడుంబా తయారు చేసేవారికి, అలవాటుగా మారిన వారికి ఆర్థిక సహాయం అందించటం ద్వారా ఈ జాడ్యం నుంచి దూరం చేయవచ్చని నిర్ణయించింది. ఈ మేరకు రిహాబిలిటేషన్‌ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవడానికి ఈ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తుంది. ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ గ్రామాల్లో సర్వే నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా 7,886 కుటుంబాలు సారా తయారు చేస్తున్నట్లు గుర్తించాయి. వారిలో 5,712 కుటుంబాలకు రిహాబిలిటేషన్‌ పథకం కింద రూ.107.88 కోట్లు సాయం అవసరమని అంచనా వేశారు. తొలిదశలో 1,366 కుటుంబాలకు రూ.26.51 కోట్లు అందజేశారు. మిగతా కుటుంబాలకు కూడా దశల వారీగా ఆర్థిక సహాయం అందజేసేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లోని ధూల్‌పేట, ఉమ్మడి మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఈ పథకంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.

 

► సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి పంచాయతీ పరిధిలోని ఆవుకుంట తండాకు వెళ్లి లకావత్‌ స్వరూపను పలకరిస్తే.. ‘‘వెంటపడి తరుముతూ కేసులు పెట్టిన, ఇంట్లో ఉన్నకాడికి గుంజుకుపోయిన ఎక్సైజ్‌ పోలీసులే ఇంటికి వచ్చి... కేసులు తీసేసి రూ.2 లక్షలు చేతుల్లో పెట్టటం కొత్తగా అనిపిస్తంది. తండాలకు పోలీసులు వస్తున్నారంటే ఎక్కడి సామాన్లు అక్కడ దాచిపెట్టేటోళ్లం.. చెట్టుకొకలం పుట్టకొకలం అయ్యేవాళ్లం. ఇప్పుడు గుడుంబా బంద్‌ చేసి.. మాకు మూడు పాలిచ్చే బర్రెలను ఇచ్చారు. వాటి పాలు అమ్ముకుంటూ మంచిగ బతుకుతున్నం..’’ అని చెప్పారు.

 

రాళ్లతో కొట్టారు: ఏఈఎస్‌ అంజిరెడ్డి 

హైదరాబాద్‌లోని ధూల్‌పేటకు గుడుంబా అడ్డాగా పేరుంది. ఎక్సైజ్‌ అధికారులు అక్కడికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. అక్కడి పరిస్థితులను ఏఈఎస్‌ అంజిరెడ్డి వెల్లడించారు. ‘‘ధూల్‌పేటలో దాదాపు 550 కుటుంబాలు సారా తయారు చేసేవి. ఎక్సైజ్‌ బృందాలు వెళ్లినా ఖాతరు చేసేవాళ్లు కాదు. మేం వెంటబడి బెల్లం ఊట కుండలను పగలగొట్టే వాళ్లం, సారాను పారబోసేవాళ్లం. కానీ వాళ్లను ఆపలేకపోయాం.. తర్వాత సారా ఉత్పత్తి మూలాలు, రవాణా మీద నిఘా పెట్టాం. ప్రధానంగా ఆరు గ్యాంగులను గుర్తించి.. ఉత్పత్తి మూలాలు, రవాణా మీద దెబ్బకొట్టే చర్యలు చేపట్టాం. పక్కా ప్రణాళికతో దాడులు చేసి.. 350 మందిని అరెస్టు చేశాం, 678 మందిని బైండోవర్‌ చేశాం. ఆరుగురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశాం. దాదాపు 60–70 వాహనాలు సీజ్‌ చేశాం. అయితే సారా సద్దుమణిగిందిగానీ.. మా మీద దాడులు జరిగాయి. ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని వచ్చి ఎక్సైజ్‌ సిబ్బందిపై రాళ్లు విసిరారు. స్టేషన్‌మీదకు రాళ్లు వేశారు. సిబ్బంది ఎవరైనా ఒంటరిగా దొరికితే చితకబాదారు కూడా. కానీ చివరికి పరిస్థితి మా చేతికి వచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలకు కౌన్సెలింగ్‌ చేశాం. రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి.. ప్రత్యామ్నాయ ఉపాధికి సహకరించాం..’’ అని అంజిరెడ్డి వెల్లడించారు.

 

మంచి స్పందన ఉంది..

‘‘95 శాతం గ్రామాలు గుడుంబా రహితమయ్యాయి. రిహాబిలిటేషన్‌ స్కీమ్‌ మంచి ఫలితాలు ఇస్తోంది. ఇప్పటివరకు 1,366 కుటుంబాలకు రూ.26.51 కోట్లు సాయంగా అందజేశాం. ఈ డబ్బుతో వాళ్లు ఇతర వ్యాపారాలు, పనులు చేసుకుని గౌరవంగా బతకడానికి అవకాశం వచ్చింది. త్వరలోనే మిగతా అన్ని కుటుంబాలకు కూడా నిధులు అందజేస్తాం. వారికి కావాల్సిన వ్యాపారం కోసం సలహాలు సూచనలు స్థానిక ఎక్సైజ్‌ అధికారులు ఇస్తారు.’’

– చంద్రవదన్, ఎక్సైజ్‌ కమిషనర్‌

 

పాలు అమ్ముతున్న..

‘‘నా ఇంటికే నేను దొంగోడి లెక్క వచ్చి పోయేటోన్ని. పోలీసులు ఎప్పుడు వస్తరో? ఎప్పుడు పోతరో తెల్వక రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా ఉండేది కాదు. కానీ సారా అమ్మితేనే పైసలొచ్చేది. అదే బుక్కెడు బువ్వ పెట్టేది. మానాలంటే మానే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం రెండు లక్షలు ఇవ్వడంతో రోజుకు 10 లీటర్ల పాలిచ్చే గేదెలు తీసుకున్నాం. ఇప్పుడు ఎవరితో భయం లేకుండా బతుకుతున్నం..’’

– రాములు, మల్కాపూర్, నవాబుపేట (గతంలో సారా విక్రయించిన వ్యక్తి)

 

ఇక గుడుంబా జోలికి వెళ్లను

‘‘15 ఏళ్ల నుంచి సారా అమ్ముతున్న. నా భార్య కూడా ఇదే పని చేస్తది. ఎక్సైజ్‌ పోలీసులకు దొరికినా మేం ఈ పని మానుకోలేదు. ఎందుకంటే మాకు జీవనాధారం. పిల్లలను సారా పనికి దూరంగానే ఉంచిన. ఈ కేసులతో మేం ఒక్క రోజన్నా సుఖంగా ఉండలేదు. చివరికి ఎక్సైజ్‌ సార్లు వచ్చి... సహాయం చేస్తే సారా పని మానుతవా అన్నరు. సరే అన్నా. 30 గొర్రెలు కొనిచ్చారు. గొర్రెలు కాసుకుంటున్నా.. పిల్లలు బడికి పోతున్నారు. ఇక గుడుంబా జోలికి వెళ్లను..’’

– తేజావత్‌ బుజ్జినాయక్, మిర్యాలగూడ మండలం ఐలాపురం 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top