‘కింగ్‌కోఠి’కి ఉస్మానియా రోగులు | Sakshi
Sakshi News home page

‘కింగ్‌కోఠి’కి ఉస్మానియా రోగులు

Published Thu, Jul 30 2015 12:19 AM

బుధవారం ఉస్మానియా నుంచి కింగ్ కోఠి ఆస్పత్రి రోగులను తరలిస్తున్న దృశం

* తొలి విడతగా 24 మంది రోగులు.. పలువురు వైద్య సిబ్బంది తరలింపు
 
*  దశలవారీగా మిగిలిన విభాగాలు.. క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే..
* రోగుల తరలింపుపై వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు
 
*  రెండు వర్గాలుగా విడిపోయి.. వాగ్వాదానికి దిగిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నుంచి రోగుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా బుధవారం సాయంత్రం 24 మంది రోగులను రెండు అంబులెన్సుల్లో కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఉస్మానియా పాత భవనంలో 130 ఆర్థోపెడిక్ పడకలుండగా.. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పురుషులు, 12 మంది మహిళలను తరలించారు. వీరితో పాటు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏడుగురు స్పెషలిస్టులు, ఆరుగురు జూనియర్ డాక్టర్లు, ఒక డీఎస్‌వో, 14 మంది స్టాఫ్ నర్సులను కూడా తరలించారు. మిగిలిన వారిని దశలవారీగా తరలించనున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చి మరో భవనం కట్టాలని కొంతమంది వైద్యులు వాదిస్తుంటే.. పాతభవనం ఉన్న రెండెకరాల స్థలాన్ని వదిలేసి, మిగిలిన ప్రాంతంలో భవన నిర్మాణం చేపట్టవచ్చని మరికొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఒకరిద్దరితో మాట్లాడి ఏకపక్షంగా రోగులను తరలించడం ఎంత వరకు సమంజసమని కార్డియో థొరాసిక్ విభాగానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ప్రశ్నించగా.. తెలంగాణ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు బొంగు రమేష్ అడ్డుతగలడంతో వాగ్వాదం చోటు చేసుకుని.. ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
 
సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో వైద్యుల నిరసన
ఉస్మానియా పాత భవనంలో 875 పడకలున్నాయి. వీటిలో 130 పడకల ఎముకల విభాగాన్ని కింగ్‌కోఠి ఏరియా ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్‌లోని 8 యూనిట్లు, జనరల్ సర్జరీలోని 8 యూనిట్లు, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్, గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్‌ను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని భావించింది.

సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డుల్లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తై తర్వాతే ఉస్మానియా రోగులను తరలించాలని నిర్ణయించింది. అయితే తమ ఆస్పత్రిని తరలించవద్దంటూ సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో  వైద్యులు బుధవారం ఆందోళనకు దిగారు.
 
క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే..

ఉస్మానియా పాత భవనం ప్రమాదకరంగా మారడంతో దానిని ఖాళీ చేయడం అనివార్యమైంది. అయితే క్యాజువాలిటీ సహా అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలు మాత్రం ఉస్మానియాలోనే అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే క్షతగాత్రులకు ఇక్కడే చికిత్స లభించనుంది. ఎమర్జెన్సీ రోగులను కాక ఎలక్టివ్ పేషెంట్లను మాత్రమే నిర్దేశిత ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఆయా ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ఓపీ సేవలతోపాటు ఇన్‌పేషెంట్ల అడ్మిషన్ ప్రక్రియంతా ఉస్మానియా నుంచే జరుగుతుందని ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ రఘురామ్ తెలిపారు.

Advertisement
Advertisement