జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన కేసులో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, సీఎఫ్‌వో రఘునాథ్‌లకు నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన కేసులో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, సీఎఫ్‌వో రఘునాథ్‌లకు నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఏప్రిల్ 13లోగా వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పద్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఎయిర్‌పోర్టుకు చెల్లించాల్సిన పన్నుల్లో భాగంగా కింగ్‌ఫిషర్ ఇచ్చిన రూ.50 లక్షల చెక్కు బౌన్స్ అయింది.
దీంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 10న విజయ్ మాల్యా, రఘునాథ్‌లను ప్రత్యక్షంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా వారు హాజరుకాలేదు. వీరి తరఫు న్యాయవాది గడువు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేశారు. ఇదిలా ఉండగా కింగ్‌ఫిషర్ ఇచ్చిన మరో 11 చెక్కులు కూడా బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ దాఖలు చేసిన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.