ఫ్రంట్‌ పేరుతో చంద్రబాబు స్టంట్‌

YSRCP Leader C Ramachandraiah Slams On TDP And Congress Alliance - Sakshi

సందర్భం

‘‘గతం గతః గతంలో మేము చేసుకున్న పరస్పర ఆరోపణలు, తిట్లు అన్నీ మర్చిపోయి.. దేశాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసి పని చేయాలనుకొంటున్నాం’’ అంటూ నవంబర్‌ 2న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసం వద్ద చంద్రబాబు తమ నూతన బంధంపై మీడియాకు వివరణ ఇచ్చుకొన్నారు. ఈ పొత్తుకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమిటి? అని  కొందరు మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను విననట్టు నటిస్తూ ఇరువురు నేతలు చిరునవ్వులు చిందిస్తూ వెనుదిరిగి వెళ్లిపోయారు. 

ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం ఏకైక లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాహుల్, చంద్రబాబు కలిసి పని చేసుకొనే క్రమంలో పరస్పరం గతాన్ని మర్చిపోవచ్చుగాక, కానీ, ప్రజలు ఆ రెండు పార్టీల మధ్యనున్న వైరుధ్యాన్ని మర్చిపోగలరా? తనను, తన మాతృమూర్తి సోనియా గాంధీని చంద్రబాబు అవమానకరరీతిలో దూషించినప్పటికీ, రాహుల్‌గాంధీ ఆ మాటలను మరచిపోవడానికి కారణం చంద్రబాబు ఆయనకు తమను ఆర్థికంగా ఆదుకొనే ఆపద్బాంధవుడిగా కనబడటమే. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం అవినీతిని, వైఫల్యాలను ఎండగడుతున్న ఏపీ కాంగ్రెస్‌కు తమ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మింగుడు పడటం లేదు. ఆ క్రమంలోనే కొత్త అపవిత్ర పొత్తును జీర్ణించుకోలేక పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్‌పార్టీకి రాజీనామాలు చేసి బయటపడుతున్నారు. 

సిద్ధాంతాలు అవసరం లేదా?
ఎన్డీఏ నుంచి బయటకొచ్చే ముందే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి చేరువ కావడానికి మార్గం సుగమం చేసుకొన్నారు. ప్రçస్తుత పరిస్థితులలో సిద్ధాంతాలకు కాలం చెల్లిందని, ఎత్తుగడలే పార్టీలకు మనుగడ అంటూ చంద్రబాబు చాలా కాలం నుంచే తమ పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 23 మంది వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఫిరాయించుకొని, అందులో నలుగుర్ని మంత్రులుగా చేసిన సందర్భంలో కూడా తన అప్రజాస్వామిక చర్యను సమర్ధించుకోవడానికి చంద్రబాబు ఇదే వాదనను తెరమీదకు తెచ్చారు. 

కార్పొరేట్‌ శక్తులకే పెద్దపీట
చంద్రబాబు ఎన్నికలను–అవి సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా–మద్యాన్ని, కరెన్సీని విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికలను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. పార్టీలో క్యాష్‌కే తప్ప క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఇవ్వరన్న మాట చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఫలితంగానే లోక్‌సభలో, రాజ్యసభలో అత్యంత ధనవంతులైన వారు టీడీపీ నుంచి ఎన్నిక కావడం జరిగింది.

సంకీర్ణ రాజకీయాల్లో ఊసరవెల్లి రంగులు
దేశంలో సంకీర్ణ రాజకీయాల శకం మొదలయ్యాక వివిధ రాజకీయ పార్టీలు ఆయా సమయాల్లో భిన్నమైన కూటమిలలో ఉంటూ వచ్చాయి. మమతా బెనర్జీ, రాంవిలాస్‌ పాశ్వాన్, జయలలిత మొదలైన వారు ఒకసారి ఎన్డీఏ ఫ్రంట్‌లో, మరోసారి యుపిఏ ఫ్రంట్‌లో ఉన్నారు. కానీ చంద్రబాబు మాదిరిగా ఒక ఫ్రంట్‌ నుంచి మరో ఫ్రంట్‌లోకి దుమికినపుడు అత్మవంచన చేసుకోలేదు. 1996లో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు చంద్రబాబు వామపక్షాలతో పొత్తు పెట్టుకొన్నారు. 1999 ఎన్నికలలో బీజేపీతో ఎన్నికల పొత్తుకు సిద్ధమై కలిసి పోటీ చేశారు. 2004లో కూడా బీజేపీతో కలిసే నడిచారు. ఫలితాలు తారుమారు కావడంతో ‘జన్మలో బీజేపీతో పొత్తు ఉండదు’ అంటూ తనను నమ్మాలని ముస్లిం మైనార్టీలను వేడుకొన్నారు. 2009లో టీడీపీని తెలుగు దొంగల పార్టీగా అభివర్ణించిన టీఆర్‌ఎస్‌తో సహా వామ పక్షాలను చేర్చుకొని కూటమి కట్టి ఎన్నికల్లో మట్టికరిచారు. 2014 వచ్చేసరికి నరేంద్రమోదీకి లభిస్తున్న ఆదరణ చూసి మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. తనకు కావాల్సిన వారిని కేంద్రమంత్రులుగా చేయడం కోసం మరోమాట లేకుండా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఇద్దరికి స్థానం కల్పించారు. సంకీర్ణ రాజకీయాల్లో చంద్రబాబు మాదిరిగా ఊసరవెల్లి రంగులు ప్రదర్శించిన నేత దేశంలో మరొకరు కనపడరు.

ఏపీలో ప్రజాస్వామ్యం సవ్యంగానే ఉందా?
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపినట్టు చంద్రబాబు చెబుతున్నారు. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలు గాడి తప్పాయన్నది రెండో కారణం. బీజేపీ సీబీఐ, ఈడీలతో టీడీపీ నేతలపై దాడులు చేయిం చడం మూడో కారణంగా చూపుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు దృష్టిలో ఏమిటి? ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య మనుగడ సవ్యంగానే ఉన్నదా? రాజ్యాంగ వ్యవస్థలు అపహాస్యం కావడం లేదా? ప్రధాన ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని అందులో నలుగుర్ని మంత్రులుగా చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారితో రాజ్యాంగం మీద ప్రమాణం చేయించి మంత్రులుగా చేర్చుకోవడాన్ని మించిన ప్రజాస్వామ్య హననం మరొకటి ఉంటుందా?

స్థానిక సంస్థల అధికారాలను కాలరాస్తూ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంగా పరిగణించగలమా? పార్లమెంట్‌ ఆమోదించిన ‘భూసేకరణ చట్టం2013’ను మార్పుచేసి భూసేకరణ చేయడం ప్రజాస్వామ్యమా? ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఎస్‌డిఎఫ్‌ నిధులను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా, ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ నేతలకు కట్టబెడుతూ జీవోలు జారీ చేయడం ప్రజాస్వామ్యమా? ఇక, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో సీఎం చంద్రబాబు, ఆయన అనుచర గణం ఎగతాళి చేసి మాట్లాడ్డం, కేసుల్లో వాస్తవాలను తొక్కిపెడుతున్న తీరు తెన్నులు గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఏవిధంగా కునారిల్లుతోందో అర్థం అవుతుంది.

ప్రజా సమస్యలు గాలికి !
కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం అంటూ నిర్వహిస్తున్న ధర్మదీక్షలకు పెడుతున్న ఖర్చు ప్రజాధనమే. తను నాలుగున్నరేళ్ల అధికారంలో పాల్పడిన అవినీతి, అక్రమాల పుట్టలు పగిలి వివిధ రూపాల్లో బయట పడుతుంటే సీఎం చంద్రబాబు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికి పోతున్నారు. అందుకే సీబీఐ, ఈడీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయంటూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై చట్టం  తన పని తాను చేసుకుపోతే దానికి రాజకీయం పులమడానికి, అండగా దేశంలోని ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు నిలబడటానికి మాత్రమే చంద్రబాబు యూపీఏ పక్షాల చుట్టూ తిరుగుతున్నారు. పేరుకు మోదీకి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు చేయడం.. కానీ, అసలు విషయం చట్టం నుంచి తను తప్పించుకోవడం. ఇదీ చంద్రబాబునాయుడి అసలైన వ్యూహం.


- సి. రామచంద్రయ్య
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
మొబైల్‌ : 81069 15555

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top