చరిష్మాకు మారుపేరు వైఎస్‌ జగన్‌

YS Jagan Is a Leader Says Subbi Rami Reddy - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత టి. సుబ్బరామిరెడ్డి

ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌కి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం పద్ధతిగా ఉన్న ఈ రోజుల్లో, ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఏది బాగుంది. ప్రజలకు ఏది కావాలంటున్నారు అని తెలుసుకోవడానికి వెళుతున్నారని ప్రశంసించారు.

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ గట్టిగా పట్టు పట్టారు కాబట్టే ప్రజల్లో ఆయనపై అభిమానం పెరుగుతోందన్నారు. పవన్‌ కల్యాణ్‌తో సహా ఎవరైనా సరే ప్రత్యేక హోదాపై అంత గట్టిగా పట్టుపడితేనే అది వారికి కూడా ప్లస్‌ పాయింట్‌ అవుతుందంటున్న టి. సుబ్బరామిరెడ్డి అబిప్రాయాలు ఆయన మాటల్లేనే...

ఎక్కడ మీడియా అలర్ట్‌గా ఉందంటే అక్కడ మీరు ఉంటారని ప్రతీతి. నిజమేనా?
దాంట్లో ఏమీ తప్పు లేదు. ఇంట్లో కూర్చుంటే ఫొటో రాదు కదా. మనిషిలో చురుకుదనం, కార్యాచరణ ఉంటేనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆదివారం కదా అని ఇంట్లోనే కూర్చుని ఉంటే మీకు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాను కదా. ఆ చురుకుదనమే ఉంటేనే ఏదయినా వస్తుంది.

ఇద్దరు సీఎంల మధ్యలో మీరు తల పెట్టేస్తారని మీడియాలో ప్రచారం ఉంది. నిజమేనా?
ముఖ్యమంత్రి పక్కన లేకుంటే మన ఫొటో ఎందుకేస్తారు ఎవరైనా? 35 ఏళ్ల క్రితం అనుకుంటాను. అక్కినేని నాగేశ్వరరావు మా ఇంటికివచ్చారు. ఏదో పేపర్లో నాదీ, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌ ఫొటో కలిసి వచ్చింది. ఏమండీ రెడ్డిగారూ, దిస్‌ ఈజ్‌ టూమచ్‌. మీ ఫొటో ఏమిటి మా మధ్యలో వచ్చింది అనేశారు. సరదాగానే అనుకోండి. నేను వేయించుకున్నాను లేండి అనేశాను.

ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు పెద్దగా పొసిగేది కాదంటారు నిజమేనా?
పైకి అలా కనిపించినా వాళ్లిద్దరికీ పరస్పర గౌరవం ఉండేది. ఇద్దరూ గొప్ప వ్యక్తులు. గొప్ప క్వాలిటీ ఉన్న వారు. కాని మనిషిలో బలహీనతలు తప్పవు కదా. ఎక్కడో ఒక చోట ఘర్షణ వచ్చేది. స్టూడియో అభివృద్ధి కోసం ప్రభుత్వం అక్కినేనికి స్థలం ఇస్తే వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారనే విషయంలో కాస్త ఘర్షణ ఏర్పడింది ఇద్దరికీ. స్నేహితుడిగా ఉండి కూడా ఇలా చేశాడే అని ఏఎన్నార్‌ బాధపడేవారు. కాని అది గతం అయిపోయింది. మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు.

మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు?
నాకు తెలిసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావులతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇక వైస్సార్‌ అయితే గ్రేట్‌ సోల్‌. స్నేహితులకు, స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు. ఢిల్లీకి ఎప్పడొచ్చినా మా ఇంట్లోనే భోంచేసి వెళ్లేవారు. ఆయన భోజనానికి వచ్చినప్పుడు కూడా ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌ని, ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శిని ఇలా  ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించి వైఎస్‌కి పరిచయం చేసి రాష్ట్రానికి మీరు సహాయం చేయాలని అని చెప్పేవాడిని. తెలుగు సీఎంలలో వైఎస్సార్‌ నాకు అత్యంత సన్నిహితుడు.

కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలతో సమాన సంబంధాలు ఎలా నిర్వహించగలిగారు?
1983లో ఎన్టీఆర్‌ పార్టీ పెడుతున్నప్పుడే నన్ను పిలిచి ‘రెడ్డిగారూ పార్టీ పెడుతున్నాం. మీరు రావాలి. పార్టీలో చేరాలి’ అని ఆహ్వానించారు. ‘కానీ మీరు నాకు చాలా క్లోజ్‌ కదా పార్టీలో చేరితే మిమ్మల్ని బాస్‌గా ట్రీట్‌ చేయాల్సి ఉంటుంది. అది నాకిష్టం లేదు. పైగా నేను రాజకీయాల్లోకి రాను’ అని చెప్పాను. కానీ 1989లో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరా. జాతీయ పార్టీలో ఉండాలనేది నా కోరిక. పైగా నాకు స్థానిక రాజకీయాలపై ఆసక్తి లేదు. చేరినవెంటనే ఎంపీ టికెట్‌ ఇచ్చినట్లే ఇచ్చి లాగేశారు. దానికీ నేను బాధపడలేదు. తర్వాత టీటీడీ చైర్మన్‌ని చేశారు. 40 ఏళ్ల చిన్న వయస్సులోనే టీటీడీ చైర్మన్‌ కావడం నా జీవితంలోనే గొప్ప మలుపు. అదే సమయంలో తిరుపతిలో కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీ జరిగింది. దాదాపు పార్టీ నేతలందరితో పరిచయం అయింది. దైవనిర్ణయం అనుకున్నాను.

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటారు?
రాష్ట్ర విభజన విషయంలో రాంగ్‌ ట్రాక్‌లో పోయింది. అన్ని రాజకీయ పార్టీలూ కలిసి విభజన చేయాలని చెప్పాయి. దాన్ని కాంగ్రెస్‌ పరిగణనలోకి తీసుకుంది. అదే సమయంలో బీజేపీ తాను అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని విభజిస్తామని సవాలు విసిరింది. మనమెందుకు ఇక మౌనంగా ఉండాలని కాంగ్రెస్‌ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ విభజించినప్పటికీ హైదరాబాద్‌ లేని ఏపీకి వీలైనంత సహాయం చేయాలని కూడా పార్టీ నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఇచ్చి సహకరిస్తామని కూడా చెప్పారు. కేంద్రంలో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి విభజన తర్వాత ఏపీని వీలైనంతగా అభివృద్ధి చేద్దామని అధినాయకత్వం భావించింది. కానీ ఫలితాలు అక్కడే తారుమారయ్యాయి. దెబ్బతిన్నాం.

కాంగ్రెస్‌ తన కొంప తానే కూల్చుకుందంటున్నారు నిజమేనా?
ఒక్కమాటలో చెబుతాను. అది డెస్టినీ. విధినిర్ణయం. దాన్ని అంగీకరించాల్సిందే. ఇంతకుమించి ఏమీ చేయలేం కూడా. కానీ పరిస్థితులు మారతాయని నమ్మకం ఉంది.

వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై మీ అభిప్రాయం?
చూస్తున్నాం కదా. పాదయాత్రలు ఎవరు చేస్తారు ఈరోజుల్లో. ఇప్పుడలా ఎవరు నడుస్తారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం ఒక పద్ధతి. ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. ఏది బాగుంది. ప్రజలు ఏది కావాలంటున్నారు అని తెలుసుకోవడానికి వెళుతున్నారాయన. అది చేసిన వాడే గొప్పవాడు. కాని అది అంత సులభం కాదు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు?
జగన్, రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు వాళ్లనెవరు ఆపగలరు? ఆయన వయస్సులో రాహుల్‌ గాంధీకున్నంత చరిష్మా ఎవరికుంది? అలాగే జగన్‌కి కూడా అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి మరి. ఆ ఏజ్‌లో ఎవరు ఆయనకు పోటీ రాగలరు? అలాగే మోదీ వయస్సు ఇప్పుడు 68 ఏళ్లు. రాహుల్‌కు 46 ఏళ్లు. పైగా ప్రజాకర్షణ బాగా ఉన్న వ్యక్తి. భవిష్యత్తు వీళ్లది కాక మరెవరిదవుతుంది?

మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్‌వైపు ఉన్నా, సీఎం పదవిని తనకు ఎందుకివ్వలేదు?
జాతీయ రాజకీయాల్లో కమ్యూనిస్టులతో సహా ఏ పార్టీ అయినా సరే మెజారిటీ సభ్యులు ఎవరిని సూచిస్తున్నారు అన్నది నాయకత్వ ఎంపికకు కొలమానంగా ఉండదు. పశ్చిమబెంగాల్‌లో మెజారిటీ సభ్యుల అభిప్రాయం బట్టి జ్యోతిబసుకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా ముందునుంచి ఉన్న సంప్రదాయం ఇదే. 2004లో వైఎస్‌ నాయకత్వంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ అద్భుత విజయం సాధించింది.

కాని ఆయనే మా సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్‌ ప్రకటించలేదు కదా. 99 శాతం మంది ఎమ్మెల్యేలు ఆయనే సీఎం కావాలని కూడా చెప్పేవారు. కానీ పార్టీ అధిష్టానం సిస్టమ్‌ ప్రకారమే వెళ్లింది. జాతీయ స్థాయిలో చర్చలు జరిపి, వాటిని మళ్లీ కిందికి పంపి వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటించింది.

సినిమా రంగంలోకి ఎలా వచ్చారు?
మా చిన్నాయన టీవీ రమణారెడ్డి ఫిల్మ్‌ యాక్టర్‌గా ఉండేవారు. ఆయన ద్వారా నాకు సినీనటులు పరిచయం అయ్యారు. అక్కినేని నాకు చాలా సన్నిహితులు. తర్వాత దేశంలోనే ఉత్తమ సినిమా ధియేటర్లను కట్టాను. మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు. ఇవి కట్టిన తర్వాతే నిర్మాతనయ్యాను. పైగా కళాకారులంటే నాకు ఎంతో అభిమానం. నా పాలసీ ఒకటే. ఇతరులకు సన్మానం చేయించి పదిమందిని సంతోషపెట్టడం నాకిష్టం.

పవన్‌ రాజకీయాల్లో సక్సెస్‌ అవుతారా?
పవన్‌ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. పైగా నిజాయితీపరుడు. ఆయన ఇప్పుడు ఫోకస్‌ చేస్తున్న ప్రత్యేక హోదా విషయాన్ని ఇలాగే ముందుకు తీసుకుపోతే చాలా పేరు వస్తుంది. ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ గట్టిగా పట్టు పట్టారు. పవన్‌ కూడా అలాగే పట్టుబడితే కచ్చితంగా తనకు అది ప్లస్‌ పాయింట్‌ అవుతుంది.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top