బ్రహ్మనించి స్ఫూర్తి పొందండి   | Sri Ramana Satirical Story On Andhra Pradesh TDP Leaders | Sakshi
Sakshi News home page

బ్రహ్మనించి స్ఫూర్తి పొందండి  

Oct 5 2019 1:35 AM | Updated on Oct 5 2019 1:35 AM

Sri Ramana Satirical Story On Andhra Pradesh TDP Leaders - Sakshi

మా వూళ్లో ఒక జడ్జీ గారుండేవారు అయితే ఆయన కాలం చెల్లి రిటైరయ్యారు. తప్పు, యిలాగ కాలం చెల్లీ, కాలం తీరి అని రిటైరైతే అనకూడదు. అయినా పర్వాలేదు కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనచ్చు. అయితే ఆ జడ్జీగారు  సొంతూరు  వచ్చి  స్థిరపడ్డారు. వచి్చన  కొత్తల్లో వూరు వాళ్లందరికీ  పిచ్చి గౌరవం. అన్నిటికీ ఆయననే పిలిచి, మైకు అప్పగించేవారు. బడి  వార్షికోత్సవం, ఆటల పోటీలు, రామాలయంలో భజన ప్రోగ్రామ్, శివాలయంలో  హరికథ యిత్యాదుల న్నిటికి జడ్జీగారే ముందుండేవారు. అంటే మైకు ముందుండేవారు.

ప్రారంభ దినాల్లో  కొంచెం సందేశాలు, కొన్ని నీతులు చెబుతుండేవారు. జనం సహించి, పోనీలే పెద్దాయన పైగా ఇంగ్లిష్‌ కూడా వచ్చని చాలా గట్టు(మార్జిన్‌) వదిలే వారు. అయితే దాన్ని జడ్జీగారు హద్దు మీరి  వాడుకున్నారు. అప్పటిదాకా  నల్ల గౌనులో సభలకి వచ్చేవారు. అది పూర్తిగా వెలిసి పోయింది. ఒకసారి గుళ్లో పెట్రోమాక్స్‌ లైటు అంటుకోగా అది కాస్తా పరశురామ ప్రీతికి బలైంది. అప్ప ట్నించి జడ్జీగారి హోదా ఓ మెట్టు కిందికి జారింది. అయన బోరు భరించలేక, బతికుంటే బలుసాకు తినచ్చనుకుని  పిల్లల తల్లులు, పెద్దల తండ్రులు జడ్జీగారికి దూరంగా ఉంటూ వచ్చారు. జడ్జీ గారికి దిగులు, బెంగ యిత్యాదులన్నీ కందిరీగల్లా ఆవరించాయ్‌.

వాళ్లావిడ పరిపరి విధాల నచ్చ చెప్పింది. ‘‘ బ్రహ్మదేవుడిని ఎవరు తలుచుకుంటారు. ఆయన దగ్గరికి మునులా, రుషులా ఎవరు ఆర్తనాదాలు చేస్తూ వెళ్తారు చెప్పండి. ఆయన నాలుగు తలలు పెట్టుకుని ఎనిమిది చెవుల్తో వాగ్దేవి పలికించిన పాటలే వీణ మీద మళ్లీ మళ్లీ వింటూ పొద్దున వండిన కూర, సాంబారుతోనే రాత్రి కూడా ముగిస్తూ సంతృప్తిగా కాలక్షేపం చేయడం లేదా? మీరు ఆ బ్రహ్మ దేవుడు నుంచి స్ఫూర్తి పొందండి. ఆ విధంగా ముందుకు పదండి’’ అని చెవులో ఇల్లు కట్టుకుని నచ్చ చెప్పింది. ‘‘లా ఇండస్ట్రీలో ముఫ్పై అయిదేళ్లు చట్టాన్ని కాచి వడపోసిన వాణ్ణి, శాసనాన్ని చెట్టు కొమ్మలపై ఆరేసిన వాణ్ణి. నన్నిప్పుడు మైకులకు మాటలకు దూరంగా పెడతారా.. అంతు చూస్తా’’ అంటూ శపథం చేశారు.  

మర్నాడు రచ్చబండ మీద కొంచెం ఎగుడూ దిగుడూ లేని చోట ఓ బల్లా కుర్చీ స్వయంగా ఆయనే ఏర్పాటు చేయించుకున్నారు. ఇంట్లో ఉన్న సంకురాత్రి బొమ్మకి గంతలు కట్టి, చేతులో త్రాసు వగైరా ఏర్పాటు చేసి ధర్మ దేవతగా నిలబెట్టారు. ఒక సుత్తి పాత అట్ల పెనము బల్లపై అలంకరింప చేశారు. రోజూ సరిగ్గా పది గంటలు కొట్టగానే వాళ్లింటి పెద్ద పాలేరు, భుజం మీంచి అడ్డంగా ఓ వస్త్రం వేసుకుని ఏదో అరుచుకుంటూ హెచ్చరికగా రచ్చబండ మీదికి వచ్చేసే వాడు. ఆ వెనకాల çహుందాగా జడ్జీగారు వచ్చేవారు. రోజూ వచి్చన పేపర్‌ వార్తల మీద జడ్జీ గారు స్పందించేవారు. చాలా గట్టిగా వార్నింగ్‌లు ఇచ్చేవారు. కొన్నిసార్లు శిక్షలు చెబుతూ తీర్పులు ఇచ్చేవారు.

పాట్నా హైకోర్టు 1939లో ఇచి్చన తీర్పును ఒకసారి, అలహాబాద్‌ 1942 తీర్పును అనర్గళంగా ఉటంకించి ఫలానా దానికి ఎందుకు జీవితఖైదు ప్రసాదించకూడదో చెప్పమని నిగ్గదీసేవారు. మ ధ్య మధ్య ఆడర్‌ ఆడర్‌ అంటూ పెనం మీద సుత్తితో రెండు దెబ్బలు కొట్టేవారు. చూసి పోయే జనం పాపం అని జాలిపడుతూ వెళ్లేవారు. ‘‘బాగా ముదిరింది’’ అని కొందరు పైకే అనుకుంటూ వెళ్లేవారు. శివాలయంలో పూజారిగారు మధ్యాహ్నం నైవేద్యం తర్వాత పక్కనే ఉన్న రచ్చ బండకి వచ్చి ప్రసాదం పెట్టబోతే జడ్జీ గారు చా లా చిరాకు పడేవారు. నేనిక్కడ అఫీషియల్‌ డ్యూటీలో ఉండగా డిస్టర్బ్‌ చేస్తావా, కస్టడీలోకి తీసుకోండి అంటూ లోకల్‌ పోలీస్‌కి ఆర్డర్‌ వేసేవారు.

తర్వాత పూజారిగారు జడ్జీగారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ‘‘మీరు హాయిగా నిత్యం గుడికి రండి దేవుడి ముందు కూర్చోండి. ఆ తామసం తగ్గుతుంది. హాయిగా మామూలు మనిషి అయిపోతారు. బాబు గారూ, నా మాట వినండి’’ అని బతిమాలారు. జడ్జీగారు అగ్గిమీద గుగ్గిలమై ‘‘నీ కు ఉరిశిక్షే. అప్పీల్‌ గ్రౌండ్స్‌ లేకుండా వుంటుంది తీర్పు’’ అని అరిచారు. పూజారి తలపట్టుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement