అకాడమీ సిగలో కొత్త కాంతి

Shivareddy nominated for Telugu language Committee - Sakshi

సందర్భం
తెలుగు భాషా కమిటీ కార్యవర్గ సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ప్రజా కవి, బహు పురస్కృత, బహు కావ్య రచయిత  కె. శివారెడ్డి  ఎన్నిక కావడం తెలుగు సాహిత్య వికాసానికి మంచి పరిణామం.

సాహిత్య అకాడమీ కొత్త కార్యవర్గం  ఏర్పడగా,  అధ్యక్ష హోదా ఈసారి 1998 తరువాత తిరిగి, కన్నడ దేశానికి దక్కింది. 1998లో యు.ఆర్‌ అనంత మూర్తి  తరువాత, ప్రస్తుతం ఫిబ్రవరి పన్నెండున  సాహిత్య అకాడమీ  అధ్యక్ష  పదవికి  ప్రముఖ  సాహితీ వేత్త, ఎనభయ్యేళ్ళ చంద్రశేఖర కంబర్‌ ఎంపిక అయ్యారు.  1964 వరకూ జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ ప్రధాని అయినందుకు కాకుండా, ఆయన స్వయానా రచయిత, సాహిత్య వేత్త కావడం మూలాన అకాడెమీ అధ్యక్ష పదవిలో  కొనసాగారు.

అటుపై  సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్‌ హుస్సేన్, సునీతి కుమార్‌ చటర్జి,  కె.ఆర్‌ శ్రీని వాస అయ్యంగార్, (రెండు సార్లు) ఉమాశంకర్‌ జోషి,  బీరేంద్ర కుమార్‌ భట్టాచార్య,  యు.ఆర్‌. అనంతమూర్తి, రమాకాంత్‌  రథ్,  గోపిచంద్‌  నారంగ్, సునీల్‌ గంగోపాధ్యాయ్‌ (పదవిలో మరణం) విశ్వనాథ్‌ ప్రసాద్‌ తివారీ నిర్వహిం చగా, 2018 నుంచి 2022 వరకూ ఈ జాతీయ  సంస్థ అధ్యక్ష పదవిలో చంద్రశేఖర్‌ కంబర్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. 
కంబర్‌ ప్రఖ్యాత రచయిత, జానపద గేయ కర్త, సినిమా దర్శకులు కావడం, బహు కళా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి, సాహిత్య అకాడమీకి తగు దిశా దర్శనం చేయగలరు అన్న ఆశాభావం నలుదిశలా వ్యక్తం అవుతున్నది. హంపి లోని కన్నడ విశ్వ విద్యాలయం పూర్వ ఉప కులపతిగా, ఉత్తర కన్నడ మాండలికం తన కవితలు, నాటకాలు, ఇతర  రచనల్లో సృజనాత్మకంగా ఉపయోగించిన సాహిత్యవేత్తగా మంచి గుర్తింపు ఉన్నవారు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాకి, కర్ణాటక నాటక అకాడమీకి కూడా వారు ఉన్నత పదవులని నిర్వహించారు. షికాగో విశ్వ విద్యాలయంలో కొంత కాలం బోధన తరువాత, తాను బెంగళూర్‌ విశ్వ విద్యాలయంలో రెండు దశాబ్దాలకు పైగా ఆచార్య వృత్తిలో ఉన్నారు.

ఇరవై అయిదు నాటకాలు, పదకొండు సంపుటాల కవిత్వం, అయిదు నవలలు, పదహారు పరిశోధనలు వారి నిరంతర సాహిత్య కృషిలో భాగంగా వెలుగు చూశాయి. జానపద కళా రంగం, విద్యా, సాహిత్య అంశాల పైన పలు రచనలు వెలువరించారు. వీరి నాట కాలు భారతీయ భాషలు, అలాగే ఆంగ్లంలోకి కూడా అనువాదం జరిగాయి. కర్ణాటక రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాల కోసం వీరు కొన్ని డాక్యుమెంటరీలు కూడా నిర్మించారు.
సాహిత్య అకాడమీ  అవార్డులతో పాటు, జ్ఞాన్‌ పీఠ, కబీర్‌ సమ్మాన్, కాళిదాస్‌ సమ్మాన్, మొదలయిన పురస్కారాలు పొందినవారు. ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌గా, సాహిత్య పరిశోధకులు కూడా. దక్షిణ భారతీయ సాహిత్య రంగం, మరింత ప్రాధాన్యత సంతరించుకుని, తన ప్రతిష్టను పెంపొందించుకోగలదని ఆశి ద్దాము.

అలాగే తెలుగు భాషా కమిటీ కార్యవర్గ సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ఆధునిక కవిత్వ చేతనతో ఎన్నో సంపుటాలు  వెలువరించిన  ప్రజల కవి, ప్రముఖ కవి,  బహు పురస్కృత  కె. శివారెడ్డి  ఎన్నిక కావడం మంచి పరి ణామం. తెలుగు భాషకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు గల నిధులను రెండు రాష్ట్రాలలోనూ సముచి తంగా వినియోగించడంలో మేలైన పాత్ర పోషించాలని ఆశిద్దాం. తెలుగు ప్రాంతాల్లో జరగకుండా పోతున్న ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అలాగే, దక్షిణ భారతీయ సాహిత్య  సమ్మేళనం వంటి అనేక ప్రాతిపదికలు పరిశీలనలో ఉండి పోయాయి. ముఖ్యంగా అనువాద ప్రణాళిక విస్తరించి, నిర్ణీతంగా, తెలుగు సాహిత్య రచనలు భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి వెళ్ళేలా, కొత్త కమిటీ ఆలోచనలు చేయాలి. 

అందుకు తగు పరిణతి, అంతర్జాతీయ దృక్పథం, ప్రగతిశీల స్వభావం, బహుళ సాంస్కృతిక చైతన్యం కలిగిన శివారెడ్డి వంటి కన్వీనర్‌ వలన తెలుగు సాహిత్య సంఘం, తన ప్రతిష్ట, దేశ భాషల్లో పెంపొందేలా, వీరి నేతృత్వంలో పని చేస్తుందని ఆశించవచ్చును. సాహిత్య రంగంలో కొత్త కమిటీ జాతీయంగా, భాషీయంగా ఏర్పాటు అయిన ఈ సందర్భంలో జాతి తరఫున శుభాకాంక్షలు.

వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత
రామతీర్థ 
మొబైల్‌ : 98492 00385 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top