ఫరూఖ్‌ నిర్బంధం తీవ్ర తప్పిదం

Sakshi Guest Column Article By Manoj Joshi

విశ్లేషణ  

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నేత, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లాను కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి ప్రజాభద్రతా చట్టం కింద నిర్బంధించడం మతిలేని చర్యే కాదు.. అది భారత రాజ్యాంగ, న్యాయ సంవిధానానికి మాయనిమచ్చగా మిగులుతుంది. జమ్మూ కశ్మీర్‌ నేతలను నిరంకుశ చట్టాలతో అడ్డుకుంటున్న కేంద్రం ఆ రాష్ట్రాన్ని తన అంతర్గత వలసగా మార్చుకునే దిశలోనే పయనిస్తోంది. మనుషులందరిలాగే, రాజకీయ నాయకులందరిలాగే ఫరూఖ్‌ అబ్దుల్లా పరిపూర్ణ వ్యక్తి కాకపోవచ్చు. కానీ అయన చేసిన తప్పులు, పాపాలకు మించి ఆయనను పాపాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. కశ్మీర్‌లో దేశపతాకాన్ని సమున్నతంగా నిలిపిన పార్టీలు రాజకీయ భూమికలో పాలు పంచుకోలేని స్థితిలో కశ్మీర్‌లోయ ప్రజలకు రాజకీయ నాయకత్వాన్ని అందించే కర్తవ్యాన్ని చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే.

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లాను ప్రజాభద్రతా చట్టం కింద కేంద్రప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవడం భారత రాజ్యాంగ, న్యాయ సంవిధానానికి మాయనిమచ్చగా మిగులుతుంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీనుంచి 81 సంవత్సరాల ఈ వయోవృద్ధుడిని గృహనిర్బంధంలో ఉంచారు. కానీ ఆయన ఎక్కడున్నదీ చెప్పాలంటూ తమిళనాడుకు చెందిన ఎమ్‌డీఎమ్‌కే అధినేత వైగో హెబియస్‌ కార్పస్‌ పిటిషనన్‌ తో సుప్రీం కోర్టు తలుపులు తట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫరూఖ్‌పై ప్రజాభద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న ఏ వ్యక్తినైనా 3 నెలల నుంచి రెండేళ్ల వరకు బెయిలు లేకుండా నిర్బంధించవచ్చు.

ఈ చర్య ద్వారా కశ్మీర్‌ రాజకీయ ప్రతినిధులను పూర్తిగా తృణీకరిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా సంకేతాలు పంపినట్లయింది. కశ్మీర్‌ రాజకీయాల్లో పాలుపంచుకోనీయకుండా జమ్మూ కశ్మీర్‌ నాయకులను నిరంకుశ చట్టాలతో అడ్డుకుంటున్న కేంద్రం మునుపటి జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాన్ని తన అంతర్గత వలసగా మార్చుకునే వైపుగా పయనిస్తోందనే చెప్పాలి. దీనిపై కేంద్రం అనుమానాస్పద వైఖరిని సమర్థిస్తూ సుప్రీకోర్టు తన ఉజ్వల ప్రతిష్టను మరుగుపర్చుకుందనే చెప్పాలి. సోమవారమే మరొక అంశాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌ఎ. బాబ్డే, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాన్ని గమనించాలి. ‘‘జాతి హితాన్ని, అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం సాధారణ జీవితాన్ని పునరుద్ధరించడానికి కావలసిన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇవ్వాలి’’.
అయితే జాతిహితం గురించి ఆందోళన ప్రకటిస్తూ, కశ్మీర్‌ రాష్ట్రంలో వ్యక్తిగత పర్యటనలు చేసుకోవడానికి హామీ ఇస్తున్నట్లు సినీ ఫక్కీ భంగిమలు ప్రదర్శించడానికి బదులుగా గౌరవనీయ న్యాయమూర్తులు న్యాయాన్ని ఎత్తిపట్టడం అనే తమ రాజ్యాంగ విధిని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జడ్జీల ఈ విద్యుక్త ధర్మం నేడు జమ్మూకశ్మీర్‌లో తీవ్రంగా అప్రతిష్ట పాలవుతూండటం గమనార్హం. ఆగస్టు 6న, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటు హాల్లో ప్రసంగిస్తూ, ఫరూఖ్‌ అబ్దుల్లాను అరెస్టు చేయడం కానీ, నిర్బం ధంలోకి తీసుకోవడం జరగలేదని ప్రకటించారు. పైగా, ఫరూఖ్‌ తన అభీష్టం ప్రకారం తన స్వగృహంలోనే ఉంటున్నారని షా పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పెద్దాయన ప్రజా భద్రతకే ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం కొత్తగా కనిపెట్టింది. ఆయనను నిర్బంధంలోకి తీసుకునేంత ప్రమాదం ఏం జరిగిందన్నది స్పష్టం కావడం లేదు. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న వరుస పరిణామాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని అనుమతించకపోవడం భాగంగానే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారని స్పష్టంగా బోధపడుతోంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఫరూఖ్‌ అబ్దుల్లాను జైల్లో పెట్టడం లేదు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయన స్వగృహంలోని సింగిల్‌ రూమ్‌లో ఆయన్ని నిర్బంధించినట్లు తెలుస్తోంది. 

మనుషులందరిలాగే, రాజకీయ నాయకులందరిలాగే ఫరూఖ్‌ అబ్దుల్లా పరిపూర్ణ వ్యక్తి కాకపోవచ్చు. కానీ అయన చేసిన తప్పులు, పాపాలకు మించి ఆయనను పాపాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. ప్రస్తుత పాలకులు చరిత్రను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు కాబట్టే 1980లలో కశ్మీర్‌ రాజకీయాలను అస్థిరపర్చడానికి దారితీసిన వరుస ఘటనలను అందరూ మర్చిపోయి ఉండవచ్చు. 1982లో షేక్‌ అబ్దుల్లా అస్తమయం తర్వాత, ఇందిరా గాంధీ తన విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫరూఖ్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్సు 1983 జూన్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఇందిర కోరుకున్నారు. కానీ అలా చేస్తే కశ్మీర్‌లో తన విశ్వసనీయత పూర్తిగా అడుగంటిపోతుందని స్పష్టంగా గ్రహించిన ఫరూఖ్‌ అబ్దుల్లా ఇందిర కోరికను గౌరవించకుండా మిర్వాయిజ్‌ ఫరూఖ్‌తో పొత్తు పెట్టుకున్నారు. వీరిద్దరి పొత్తు ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఫరూఖ్‌ 1983 అక్టోబర్‌లో శ్రీనగర్‌లో అఖిల భారత ప్రతిపక్ష సదస్సుకు పిలుపునివ్వడం ద్వారా తీవ్రమైన తప్పు నిర్ణయం తీసుకున్నారు.

ఫరూఖ్‌ చర్యతో ఆగ్రహించిన ఇందిరా గాంధీ అరుణ్‌ నెహ్రూ, ముఫ్తి మొహమ్మద్‌లను కూడగట్టి తిరుగుబాటు లేవదీశారు. నాటి జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ జగ్‌మోహన్‌ సహకారంతో ఫరూఖ్‌ పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలై ఆయన బావమరిది జీఎమ్‌ షా 1984 జూలైలో సీఎం అయిపోయారు. మూడేళ్ల తర్వాత ఫరూఖ్‌ 1987లో కాంగ్రెస్‌తో పొత్తుకు అంగీకరించారు. ఆ ఎన్నికల్లో రిగ్గింగు పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో పాలన బాగా దెబ్బతినింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పరిస్థితిని కొలిక్కి తేవడంలో విఫలమయ్యాయి. దీంతో 1989 నాటి లోక్‌ సభ ఎన్నికలను కశ్మీర్‌ ఓటర్లు పూర్తిగా బాయ్‌కాట్‌ చేశారు. ఇది పాకిస్తాన్‌ కశ్మీర్‌ యువతను తిరుగుబాటుకు ప్రేరేపించింది. ఇదే 1989–90లో తీవ్రవాదం పెరగడానికి దారి తీసింది. చివరకు జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ సాయుధ పోరాటం ప్రారంభించిన సమయంలోనూ ఫరూఖ్‌ తనమీద తాను జోకులేసుకుంటూ గడిపేశారు. ఈ నేపథ్యంలోనే జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ జేకెఎల్‌ఎఫ్‌ శక్తులు నాటి నూతన హోంమంత్రి ముఫ్తి మొహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబియ్యాను కిడ్నాప్‌ చేశారు.

ఫరూఖ్‌ జేకేఎల్‌ఎఫ్‌తో చర్చలను వ్యతిరేకిస్తూనే.. రుబియ్యా విడుదలకై జేకేఎల్‌ఎఫ్‌పై ఒత్తిడి తేవడం కోసం ఆయన తన కాంటాక్టులను ఉపయోగించారు. చివరకు జేకేఎల్‌ఎఫ్‌ నేతలను విడుదల చేసే విషయమై నాటి కేంద్ర మంత్రులు అరుణ్‌ నెహ్రూ, ఐకే గుజ్రాల్, అరిఫి మొహమ్మద్‌ ఖా¯Œ తో ఒక కమిటీ ఏర్పాటుకు ఆదేశించడం ద్వారా ఫరూఖ్‌ తన ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ ఒకే ఒక చర్య ఆరోజు నుంచి కశ్మీర్‌లో అగ్నిజ్వాలలను రేపుతూనే ఉంది. దీని ఫలితంగా 1990 నుంచి 1996 దాకా ఫరూఖ్‌ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఏవిధంగా చూసినా అది చర్చలను తుపాకీ ఆదేశించిన కాలం.  కేంద్రప్రభుత్వం కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొన్నదని చూపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. న్యూఢిల్లీలో హెచ్‌.డి. దేవేగౌడ నేతృత్వంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల తర్వాత కశ్మీర్‌కి గరిష్ట స్వయంప్రతిపత్తిని కల్పిస్తామని వాగ్దానం చేసిన తర్వాతే ఫరూఖ్‌ అబ్దుల్లా బెట్టు వీడి ఎన్నికల్లో పోటీ చేశాడు. 1996 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఘనవిజయం సాధించింది.

బహుశా, మోదీ ప్రభుత్వ కశ్మీర్‌ విధానంలో తీవ్రంగా ప్రశ్నించదగిన అంశం ఏదంటే, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు, వాటి నేతలను భారత చట్టాలనుంచి మినహాయించి మూక నిర్బంధంలోకి తీసుకోవాలని నిర్ణయించుకోవడమే. ఒక్కమాటలో చెప్పాలంటే కశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియకు కేంద్రం పూర్తిగా తలుపులు మూసేశారు. సీపీఎం నేత నుంచి నేషనల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కేడర్లను, నాయకులను ఒక్కుమ్మడిగా నిర్బంధించడాన్ని ఈ అంశమే స్పష్టపరుస్తుంది. కశ్మీర్‌లో దేశపతాకాన్ని సమున్నతంగా నిలిపిన పార్టీలు రాజకీయ భూమికలో పాలు పంచుకోలేని స్థితిలో కశ్మీర్‌లోయ ప్రజలకు రాజకీయ నాయకత్వాన్ని అందించే కర్తవ్యాన్ని చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే కానీ మరొకరికి సాధ్యమా?

కశ్మీర్‌ లోయను దేశ అంతర్గత వలసగా ట్రీట్‌ చేయకుండా కేంద్రం సయమనం వహిస్తే తప్ప ఇది సాధ్యంకాదు. కేంద్ర రాష్ట్రాలు రెండింట్లోనూ చట్టసభల ప్రాతినిధ్యం దేశ పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఇది మన ప్రజాస్వామ్య సౌధానికి గీటురాయి. భవిష్యత్తులో కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యేవారు ఈ మూడూ ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వారుగానే ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆ మార్గంలో ప్రస్తుతం ఆలోచిస్తోందా?


మనోజ్‌ జోషి 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top