ప్రేమించడమే నేరమా?

Pagudakula Balaswamy Article On Valentine's Day Celebrations - Sakshi

వికృత కలాపం
ప్రపంచానికి సంస్కృతీ సంప్రదాయాలు, విలువలను నేర్పిన భారతదేశం నేడు కొన్ని వికృత చేష్టలకు బానిసగా మారుతోంది. ప్రపంచీకరణ ముసుగులో విదేశీ కల్తీ సంస్కృతికి వేదికగా మారుతోంది. కిస్‌ ఆఫ్‌ ది డే.. హగ్గింగ్‌ డే.. డార్లింగ్‌ నైట్‌.. హస్బెండ్‌ నైట్‌.. కాండిల్‌ లైట్‌.. వాలం టైన్స్‌ డే.. పేరెంట్స్‌ డే.. మదర్స్‌ డే.. ఫాదర్స్‌ డే.. చిల్డ్రన్స్‌ డే ఇలా రోజుకు  ఒక డే పేరుతో విదేశీ సంస్కృతినీ భారతీయతపై బలవంతంగా రుద్దుతున్నారు. అనేక సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గినా కూడా... మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలను వీడలేదు.

ఈ క్రమంలో నేడు విదేశీ భావజాలాన్ని భారతీయ జీవన శైలితో కలుషితం చేసేందుకు మల్టీ  నేషనల్‌ కంపెనీలు ధనార్జనే  ధ్యేయంగా పబ్బులు, మాల్స్, రిసార్ట్స్, స్టార్‌ హోటల్లో ఆఫర్లు ప్రకటించి దోపిడీకి గురి చేస్తున్నాయి. అందులో భాగంగానే రోజుకు ఒక్క డే పేరుతో యువతను పెడదోవ పట్టిస్తున్నారు పాశ్చాత్య కంపెనీల పెద్దలు. ఫలితంగా నవ యువత నిర్వీర్యమై పోతోంది. భవిష్యత్తు చీకటి కమ్ముతోంది.  దేశ ఔన్నత్యం దెబ్బతింటోంది. దీంతో వచ్చేతరం మన సంప్రదాయాలకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. అందుకే  బజరంగ్‌ దళ్‌ విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ధర్మాన్ని కాపాడేందుకు దేశ సంస్కృతిని రక్షిం చేందుకు తమకు తాము బాధ్యత తీసుకుంటున్నాయి.

ప్రేమ పేరుతో వికృత కార్యకలాపాలకు పాల్పడే యువతకు భారతీయ విలువలను తెలియజేసేందుకు కంకణం కట్టాయి. ప్రేమ అంటే ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే మాత్రమే కాదు అది వ్యామోహానికి సంబంధించిన రోజు కాబట్టి అలాంటి డే పేరుతో భారత పరువును బజారు పాలు చేయొద్దు అని వివరించేందుకు ముందుకు కదిలారు. ప్రేమంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు చూపించారని వివరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే లంక నుంచి వారధి కట్టి సీతమ్మను కాపాడుకున్న చరిత్ర శ్రీరామచంద్రుడు. అదే నిజమైన ప్రేమ. అలాంటి చరిత్రను మరుగున పడేసి పాశ్చాత్య వికృత చేష్టలకు దాసోహం కావడం సరికాదని తెలియజేసేందుకు హిందూ సంస్థలు కృషి చేయడం హర్షణీయం.

దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే భారతీయ విలువలను విశ్వానికి ఎత్తి చూపాలి తప్ప.. ప్రపంచం ముందు తలదించుకునేలా చేయరాదు. సంప్రదాయాలకు విఘాతం కలిగించే విడ్డూరమైన దినోత్సవాలు దూరంగా ఉండాలి. కోర్టులు కూడా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం భావ్యం కాదు. పెళ్ళయిన స్త్రీ తనకు నచ్చిన వ్యక్తితో లైంగికంగా కలిసి ఉండటం నేరం కాదు అని తీర్పు ఇవ్వడం ఎంత మాత్రం సరికాదు. ఇలాంటి తీర్పులను కూడా ప్రతిఘటించి విలువలను కాపాడేందుకు కొన్ని సంస్థలు ముందుకు రావడం అభినందనీయం.
-పగుడాకుల బాలస్వామి, విశ్వహిందూ పరిషత్‌ సహ ప్రచార ప్రముఖ్‌ 

ప్రకృతి సహజం
నేడు ప్రేమికుల దినం. ఆహ్లాదం కంటే వివాదానికి తెర తీస్తున్న కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రేమికుల రోజు ముందు పీఠిలో ఉంటోంది. ప్రేమ జంటలు రోడ్లపైకి రావద్దని,  ప్రేమికులదినం ఒక వికృత కార్యకలాపాల సంస్కృతి అనీ, మన సంస్కృతి పరువును బజారుపాలు చేసే చర్య అని అంటున్నారు. భారతీయ విలువలను ధ్వంసం చేస్తున్న రోజుగా ప్రేమికుల దినాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు పెళ్లి కాని యువతీయువకులు ప్రేమజంటలై బయట తిరిగితే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామంటున్నారు. వాలంటైన్స్‌ డే నిర్వహించే పబ్‌లు, రిసార్టులు, హోటళ్లు, మాల్స్‌పై దాడులకు కూడా వెనుకాడబోమని బజరంగ్‌ దళ్, వీహెచ్‌పీ వంటి హిందూ మత సంస్థల నేతలు హెచ్చరిస్తున్నారు. యువతీయువకులు బహిరంగ స్థలాల్లో తిరిగితే వారికి బలవంతంగా తాళి కట్టించి ఊరేగించే తరహా

సంస్కృతిలో ఏ ఆచార సంప్రదాయాలు దాగి ఉన్నాయో ఎవరు చెప్పాలి? 
ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచే సంస్కృతి విదేశీయమైనది, మన సంస్కృతికి భిన్నమైంది అనే దృక్పథం ప్రజాస్వామికమైనదేనా? తన ఇష్టాఇష్టాలను, అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరచడం ఆధునిక నాగరికత మనిషికి అందించిన అతి గొప్ప అవకాశం.  సంస్కృతిని మడికట్టు ఆచారంగా, మార్చడానికి వీలులేని జడపదార్థంగా భావిస్తే అలాంటి సంస్కృతి చరిత్రలో అంతర్ధానం కాక తప్పదు. సంస్కృతిని నిత్యం మార్పు చెందుతూ, కొత్తను స్వీకరిస్తూ, పరిణామం చెందుతూ ఉండే జీవన విధానంగా గుర్తించినప్పడు ఒకరికి ఇవ్వడం, ఒకరినుంచి తీసుకోవడం ప్రకృతి నియమంలాగా సాగిపోతూనే ఉంటుంది. గుండుసూది నుంచి విమానాల వరకు ప్రతిదీ విదేశాలనుంచి అరువు తెచ్చుకుంటూ, పబ్బం గడుపుకుంటూ, మరోవైపున మా సంస్కృతి చెక్కుచెదరదనీ, వెయ్యేళ్ల క్రితం ఎలా ఉండేవారిమో ఇప్పుడూ అలాగే బతుకుతాం అంటే ఇలాంటి సంస్కృతి చరిత్రలో నిలబడేది కాదు. 

నా అభిప్రాయాలకు, నేను విశ్వసిస్తున్న ఆలోచనలకు భిన్నమైన ప్రతి దాన్నీ వ్యతిరేకిస్తాననీ, బలవంతంగానైనా సరే నిలిపివేసే చర్యలు చేపడతానని భావించడమే హిట్లర్‌ నాజీ సిద్ధాంతాలు ఆధునిక రూపంలో దేశంలో చెలామణీ అవుతున్నాయనడానికి నిదర్శనం. యాసిడ్‌ దాడులు, వరకట్నహత్యలు, గృహ చిత్ర హింసలు, ఫ్యూడల్‌ అహంకారాలు రాజ్యమేలుతున్న దేశంలో ప్రేమను స్వచ్ఛంగా వ్యక్తపరిచే ఏ అలవాట్లనైనా, ఆచారాలనైనా ఆహ్వానిం చాలి. ‘మా జాతికి ప్రేమించడం నేర్పినందుకు కృతజ్ఞతలు’ అంటూ ఒక చిన్న దేశం ఒక మహాకవి ప్లాబో నెరూడాకు నీరాజనాలు పలికింది. అందుకే ప్రేమించడాన్ని, ప్రేమను పంచి పెట్టడాన్ని నేర్చుకుందాం.
-ప్రత్యూష, ప్రేమ్‌నగర్, హైదరాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top