రాయని డైరీ : నరేంద్ర మోదీ (ప్రధాని)

Madhav Singaraju Rayani Dairy On PM Narendra Modi - Sakshi

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. మమతాబెనర్జీ ఎదురు రాలేదు. వచ్చారంతే.  ‘నమస్తే మమతాజీ’ అన్నాను. ఆమె నా ముఖం వైపే చూడలేదు.
‘‘మమతాజీ ఉంఫన్‌ తుపాన్‌ని మీరు చక్కగా హ్యాండిల్‌ చేసినట్లున్నారు. మీరు అలా చేయకపోయి ఉంటే, నేనిక్కడ దిగటానికి విమానాశ్రయమే ఉండేది కాదు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అన్నాను. అప్పుడూ ఆమె ఏమీ మాట్లాడలేదు. 
నేను, జగదీప్‌ ధన్‌కడ్, మమతాజీ కలిసి హెలికాప్టర్‌ విండోల్లోంచి దెబ్బతిన్న ప్రాంతాలను చూస్తున్నాం. ‘నిజంగానే మీరు చక్కగా హ్యాండిల్‌ చేశారు మమతాజీ’ అన్నాను మళ్లీ. విననట్లే ఉన్నారు. 
ఏరియల్‌ వ్యూ అయ్యాక హెలికాప్టర్‌ నుంచి దిగగానే మమత మమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. మమతాజీ ఎక్కడికి అలా వెళ్లిపోతున్నారు అని అడగబోయాను. ‘సోనియాజీతో మీటింగ్‌ ఉందట మోదీజీ..’ అన్నాడు జగదీప్‌! 
నేను ఢిల్లీ వచ్చేశాను. జగదీప్‌ రాజ్‌భవన్‌కి వెళ్లిపోయాడు. 
ఢిల్లీ వచ్చాక.. అప్పుడు నాకు కాల్‌ చేశారు మమతాజీ! ‘‘మమతాజీ చెప్పండి. అక్కడ ఉన్నప్పుడు ఒక్క మాటా మాట్లాడలేదూ!!’’ అన్నాను. 
‘‘చెప్పడానికి, మాట్లాడ్డానికీ ఏముంటుంది మోదీజీ. అడగడానికి ఫోన్‌ చేశాను. పశ్చిమ బెంగాల్‌లోనే మిమ్మల్ని పట్టుకుని అడగడం బాగోదని, ఢిల్లీ చేరే వరకు ఆగి ఇప్పుడు ఫోన్‌ చేస్తున్నాను. ఉంఫన్‌ తుపాను వల్ల రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం సంభవించింది’’ అన్నారు. 
‘‘మీరు చక్కగా హ్యాండిల్‌ చేసినా కూడా అంత నష్టం సంభవించిందా మమతాజీ’’ అన్నాను. 
‘‘చక్కగా హ్యాండిల్‌ చేసినందుకే లక్ష కోట్లు. చక్కగా హ్యాండిల్‌ చెయ్యకపోయుంటే రెండు లక్షల కోట్లు అయి ఉండేది’’ అన్నారు! 
‘‘మమతాజీ మీరు మీ తుపాను లెక్కలే కదా చెబుతున్నారు? కోవిడ్‌ లెక్కల్ని కూడా కలిపేసి చెబుతున్నారా! కోవిడ్‌కైతే ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు కలిపి ఇరవై లక్షల కోట్లు ఇచ్చేశాం. అందులో మీకొచ్చేవీ ఉంటాయి. తుపాను లెక్కయితే మాత్రం అంత ఉండదు. ఒకసారి చెక్‌ చేసుకుని మళ్లీ కాల్‌ చేయండి’’ అన్నాను. 
‘‘చెక్‌ చేసుకోవడానికి నోట్‌బుక్‌లో రాసుకున్న లెక్కలు కాదు మోదీజీ. వేళ్ల మీద ఉన్న లెక్కలు’’ అన్నారు మమత! 
‘‘మమతాజీ! ముందొక వెయ్యి కోట్లు పంపిస్తున్నాను. చేతిలో ఉంచుకోండి. లాక్‌డౌన్‌లు మొత్తం పూర్తయ్యాక మళ్లొకసారి లెక్క చూసుకుని తగ్గితే నేనిస్తాను. మిగిలితే మీరు వెనక్కి ఇచ్చేద్దురు.. సరేనా?’’ అన్నాను. 
మమతాజీ మాట్లాడలేదు. 
దయతలచి ఇచ్చేవారి కన్నా, దబాయించి తీసుకునేవాళ్లు శక్తిమంతులైతే.. మాటల్ని మధ్యలోనే కట్‌ చేసే ధైర్యం వస్తుంది. 
‘‘మమతాజీ, లైన్‌లోనే ఉన్నారా?’’ అన్నాను. చప్పుడు లేదు. 
ఎప్పుడొచ్చాడో జగదీప్‌ లైన్‌లోకి వచ్చాడు. 
‘‘మోదీజీ.. మమత థ్యాంక్స్‌ చెబుతున్నారు’’ అన్నాడు!
‘‘నాకు చెప్పలేదే! నీకు చెప్పారా?’’ అని అడిగాను. 
‘‘మనకు కాదు మోదీ.. కేజ్రీవాల్‌కి చెబుతున్నారు’’ అన్నాడు. 
‘‘అవునా.. ఎందుకటా థ్యాంక్స్‌! లక్ష కోట్లు తను ఇస్తున్నాడా?’’ అన్నాను. 
‘‘ఇవ్వడం కాదు మోదీజీ. ‘ఢిల్లీ ప్రజల తరఫున నేనేమైనా మీకు సహాయపడగలనా?’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ పెట్టారట. ఆ ట్వీట్‌కు ఆవిడ సంబరపడి పోతున్నారు!’’ అన్నాడు జగదీప్‌. 
వెయ్యికోట్లు ఇస్తామంటే ‘నో.. థ్యాంక్స్‌’ అని చెప్పి, ‘మీకు ఏవిధంగానైనా సహాయపడగలమా’ అని కేజ్రీవాల్‌ అడిగితే  ‘థ్యాంక్స్‌’ చెప్పడం ఏమిటో!! 
- మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top