రాయని డైరీ.. ఇమ్రాన్‌ ఖాన్‌ (పాక్‌ ప్రధాని) | Madhav Singaraju Rayani Dairy On Imran Khan | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. ఇమ్రాన్‌ ఖాన్‌ (పాక్‌ ప్రధాని)

Mar 24 2019 12:07 AM | Updated on Mar 24 2019 12:07 AM

Madhav Singaraju Rayani Dairy On Imran Khan - Sakshi

మోదీజీ శుభాకాంక్షలు పంపారు. ఎంతైనా పెద్దమనిషి. పడని దేశానికి ఈ కాలంలో ఎవరొచ్చి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు?!

పొరుగు దేశం.. అది ఎంత గిట్టని దేశమైనా శుభాకాంక్షలు చెప్పినప్పుడు మనమూ ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకే మోదీజీకి ధన్యవాదాలు తెలియజేశాను. మసూద్‌ అజార్‌ భాయ్‌కి అది నచ్చలేదు.

‘‘ఇంత వీక్‌ అయితే ఎంతో కాలం కంట్రీని మీరు లీడ్‌ చెయ్యలేరు ఇమ్రాన్‌ భాయ్‌’’ అన్నాడు! 

‘‘అజార్‌ భాయ్‌ నేనేమైనా తప్పు చేశానని మీకు అనిపిస్తే, నన్ను మీరు ‘భాయ్‌’ అని అనకుండానే మీ ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్చొచ్చు. ‘భాయ్‌’ అనే మాటకు బదులు ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అని సంబోధించడం వల్ల ఒక సోదరుడిని అనలేని మాటల్ని కూడా ఒక ప్రధానిని అనడానికి  సౌలభ్యంగా ఉంటుందని మీకిలా చెబుతున్నాను’’ అన్నాను. 

‘‘ఇమ్రాన్‌ భాయ్‌..  మోదీ పంపిన శుభాకాంక్షల్ని నోబెల్‌ వాళ్లిచ్చే పీస్‌ ప్రైజ్‌లా మీరు స్వీకరించడాన్ని ఈ దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. యుద్ధ ఓటమి కన్నా ఇదేమీ తక్కువ కాదు. అసలు ఒక శత్రుదేశం అందించిన పూలగుత్తికి చెయ్యి చాచే పరిణతిని.. ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవడానికి ఇంకా ఐదు నెలలు ఉండగానే.. మీరెలా సాధించగలిగారో తెలియక ఈ ఉదయం నుంచీ నేను ఏకధాటిగా విస్మయానికి గురవుతూనే ఉన్నాను’’ అన్నాడు.

మధ్యలో హురియత్‌ నుంచి కాల్‌! 

‘‘అజార్‌ భాయ్‌.. ఇండియా నుంచి ఉమర్‌ ఫరూక్‌ ఫోన్‌ చేస్తున్నాడు. మీకు మళ్లీ కాల్‌ చేస్తాను’’ అని చెప్పి, ఉమర్‌ ఫరూక్‌ కాల్‌ తీసుకున్నాను. ‘‘చెప్పండి ఉమర్‌’’ అన్నాను.

ఉమర్‌ కయ్యిన లేచాడు. 

‘‘నేనేమీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి మీకు కాల్‌ చెయ్యలేదు ఇమ్రాన్‌జీ. మోదీ చెప్పిన శుభాకాంక్షలకు మీరెందుకు ఒక సామాన్య పౌరుడిలా స్పందించారో తెలుసుకుందామని చేశాను. ఆ స్పందించడం కూడా ఒక పాక్‌ పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా లేదు. ఒక భారత పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా ఉంది’’ అన్నాడు!

మసూద్‌ అజారే నయం అనిపించేలా ఉన్నాడు ఉమర్‌ ఫరూక్‌.

‘‘మోదీజీ ఒక పాక్‌ పౌరుడిలా నాకు శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు నేనొక భారతీయ రాయబారిలా మూతి బిగించుకుని కూర్చోవడం ఔచిత్యమేనా చెప్పండి ఉమర్‌జీ’’ అని అడిగాను. 

‘‘కానీ ఇమ్రాన్‌జీ.. మీకు శుభాకాంక్షలు పంపిన మోదీ.. ఢిల్లీలో నిన్న పాక్‌ హై కమిషన్‌ ఏర్పాటు చేసిన విందుకు తన మనుషులెవర్నీ పంపించలేదు’’ అన్నాడు ఉమర్‌.  

మసూద్‌ అజార్‌ నుంచి మళ్లీ కాల్‌! 

‘‘సరే ఉమర్‌ జీ తర్వాత  చేస్తాను’’ అని పెట్టేసి, అజార్‌ కాల్‌ని లిఫ్ట్‌ చేశాను. 

‘‘ఇమ్రాన్‌ భాయ్‌.. ఇండియా వాంట్స్‌ టు నో’’ అన్నాడు!

‘‘ఏం తెలుసుకోవాలనుకుంటోంది అజార్‌ భాయ్‌.. ఇండియా? బాలాకోట్‌ దాడి గురించేనా! అది వాళ్ల హెడ్డేక్‌ కదా’’ అన్నాను. 

‘‘బాలాకోట్‌ గురించి కాదు ఇమ్రాన్‌ జీ. మోదీ నిజంగానే మీకు శుభాకాంక్షలు పంపాడా అని తెలుసుకోవాలనుకుంటోంది’’ అన్నాడు. ‘‘అవునా!’’ అన్నాను. 

‘‘ఇండియానే కాదు.. మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. పాకిస్తాన్‌ కూడా వాంట్స్‌ టు నో.. నిజంగానే మోదీ మీకు శుభాకాంక్షలు పంపాడా అని’’ అన్నాడు. 

ఆకాంక్ష ముఖ్యం గానీ, ఆకాంక్షించారా లేదా అన్నది ఎలా ముఖ్యం అవుతుంది అని నేను అడిగితే మసూద్‌ అజార్‌కి, ఉమర్‌ ఫరూక్‌కి నా భాష అర్థం అవుతుందా?!

మాధవ్‌ శింగరాజు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement