వృద్ధి కేంద్రంగా క్రియాశీల బడ్జెట్‌

IYR Krishna Rao Article On Nirmala Sitharaman Central Budget - Sakshi

విశ్లేషణ

నిర్మలా సీతారామన్‌ గతవారం లోక్‌సభలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను ఆచరణ సాధ్యమైన క్రియాశీలక బడ్జెట్‌గానే చెప్పాలి. సంకీర్ణ పక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రాజీమార్గంలో పాలన సాగించాల్సిన అవసరం లేకపోవడంతో 2019 బడ్జెట్‌లో సహజంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు దొరికినట్లయింది. ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచడం అనే సాధారణ నమూనాకు భిన్నంగా స్థిర అభివృద్ధి విధానంపై కేంద్రం దృష్టి పెట్టింది. వృద్ధి రేటును పెంచుతూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవటం కూడా ముఖ్యం. అందుకే ప్రజాప్రయోజనాలకు పట్టం కడుతూనే ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్‌ రూపకల్పన చేశారు.

భారతీయ జనతాపార్టీ 2019 ఎన్నికలలో ఇతర పార్టీల మీద ఆధార పడవలసిన అవసరం లేకుండా పూర్తి మెజారిటీని సాధించింది. సంకీర్ణ ప్రభుత్వాలలో మిగిలిన పార్టీలతో కలసి వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ రాజీ మార్గంలో పరిపాలన సాగించాల్సిన అవసరం ఈరోజు బీజేపీకి లేదు. వెనువెంటనే  ఎన్నికలు కూడా ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2019 బడ్జెట్‌. సహజంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పరిస్థితులు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆచరణ సాధ్యమైన క్రియాశీలకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్లోని ప్రధానమైన అంశం ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం. ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రధాన అంశంగా పేర్కొంటూ ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో 3.3% ఉండేటట్టుగా రూపొందిం చారు. ఆర్థిక క్రమశిక్షణకు ఆర్థికరంగ స్థిరత్వానికి ఆర్థిక శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతం కన్నా తక్కువ ఉండటం శ్రేయస్కరం. ఆ దిశగా అడుగులు వేస్తూనే ప్రస్తుత సంవత్సరానికి 3.3% ఉండేలాగా బడ్జెట్‌ను రూపొందించారు. గత సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో వృద్ధిరేటు మందగించింది కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్‌ వృద్ధి రేటుకు ఊతమిచ్చేలాగా ఉండాలని అందుకోసం వ్యయం పెంచాల్సిన ఆవశ్యకతను పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని కొందరు ఆర్థికవేత్తలు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కుదుపు కుదిపేలాగా బడ్జెట్‌ ఉండాలని ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచటం ద్వారా ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని వీరి అభిప్రాయం. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన చేయకుండా ఆర్థిక మంత్రి విజ్ఞతతో కూడిన స్థిర అభివృద్ధి విధానానికి ప్రాధాన్యమిచ్చారు.

వృద్ధి రేటు ఎంత ముఖ్యమో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవటం అంతకన్నా ముఖ్యం. ఈ ప్రభుత్వం గత ఐదేళ్ల ప్రధాన విజయాల్లో ఒకటి.. ధరలను అదుపులోకి తీసుకొని రావటం. వృద్ధి రేటు ప్రాధాన్యమిచ్చే విధానాన్ని అనుసరించి ప్రభుత్వం వ్యయాన్ని పెంచుకుంటూ పోతే ద్రవ్యోల్బణం నియంత్రణ లేకుండా పెరిగే అవకాశం ఉంది. దీనితో మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక క్రమశిక్షణకే ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్‌ రూపకల్పన చేశారు.

ద్రవ్యలోటును నియంత్రించటం ఎంత ముఖ్యమో ద్రవ్యలోటులో భాగంగా రెవెన్యూ లోటును తగ్గించుకోవడం కూడా అంతే ప్రధానమైన విషయం. ఈ బడ్జెట్లో మొత్తం ద్రవ్యలోటు 7 లక్షల కోట్లు కాగా మూలధన వ్యయం ఖర్చుపెట్టడానికి కేటాయించిన మొత్తం 3లక్షల 38 వేల కోట్లు మాత్రమే. మిగిలిన అప్పులు రెవెన్యూ లోటు భర్తీకే సరిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే రెవెన్యూ అకౌంట్లోని పన్నులు పన్నేతర రాబడి అయినా పెరగాలి లేదా రెవెన్యూ అకౌంట్లోని ఖర్చులైనా తగ్గాలి. కొన్ని శ్లాబులలో ప్రత్యక్ష పన్ను రేటు పెంచటం, పెట్రోలు పెట్రోల్‌ ఉత్పత్తులపై పెంపు ఈ రకంగా అధిక ఆదాయ వనరులను సేకరించటానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు.

ఇక రెవెన్యూ వ్యయం పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెవెన్యూ ఖర్చులో సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార సబ్సిడీ కిందనే లక్షా 80 వేలకోట్ల దాకా ఖర్చు అవుతోంది. దాదాపు 80  వేల కోట్ల దాకా ఎరువుల సబ్సిడీ కింద ఖర్చు అవుతోంది. దాదాపు బడ్జెట్లో 9 శాతం వరకు ఈ రెండు అకౌంట్లలో రాయితీల కిందనే ఖర్చు అవుతోంది. లబ్ధిదారులకు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఈ రాయితీ చేరే విధంగా ప్రత్యక్ష ద్రవ్య బదిలీ విధానాన్ని అమలు చేయగలిగితే ఈ సబ్సిడీల వలన లబ్ధిదారులకు నిజమైన మేలు చేకూరుతుంది. ఈ సబ్సిడీలను అమలు చేసే విధానంలో ఉన్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. రాయితీ నేరుగా చిన్న సన్నకారు రైతులకు అందిస్తారు కాబట్టి  ఎరువుల ధరలను మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించవచ్చు. ప్రభుత్వానికి సబ్సిడీలో కొంత మిగులు, రైతులకు ద్రవ్య రూపంలో ప్రత్యక్ష బట్వాడా జరుగుతున్నది కాబట్టి లాభం ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే బడ్జెట్‌లో ఎక్కువ భాగం సబ్సిడీల రూపంలోనే పోవటం వల్ల మూలధన వ్యయానికి నిధుల కొరత ఏర్పడుతున్నది. జాతీయోత్పత్తిలో అధిక వృద్ధి రేటు సాధించాలంటే మూలధన వ్యయం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం అమలు చేస్తున్న ఇంకొక పెద్ద పథకం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కింద రూ. 60 వేల కోట్లు కేటాయించారు. గ్రామ ప్రాంతాలలో అవసరం ఉన్న సామాజిక ఆస్తుల నిర్మాణానికి ఈ పథకం కింద ప్రాజెక్టులను చేపడుతున్నారు. అక్కడ ఉన్న ప్రాజెక్టులు పరిమితం కాబట్టి అవి పూర్తి కాగానే ఈ పథకం కింద దుర్వినియోగం, అవినీతి ఎక్కువ జరుగుతోంది. ఈ పథకం వల్లనే వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడుతున్నది అనే అభియోగం ఒకటున్నది. ఈ స్కీమును కూడా గ్రామీణ పేదలకు అదనపు ఆదాయం కల్పించే విధంగా మార్చి ప్రత్యక్ష నగదు బట్వాడా ద్వారా ఏ ఏ కుటుంబాలు ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్‌ అయి ఉన్నాయో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చు.

అప్పుడు గ్రామీణ పేదల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలకు కూలీలు దొరకడం లేదనే సమస్య కూడా వుండదు. ఈ విధంగా సబ్సిడీల విషయంలోనూ కొన్ని అధిక వ్యయంతో కూడిన ప్రభుత్వ పథకాలను పూర్తిగా విశ్లేషించి అవినీతికి దుర్వినియోగానికి తావు లేకుండా లబ్ధిదారులకు ప్రత్యక్షంగా లబ్ధి పొందే విధంగాను, ప్రభుత్వానికి సబ్సిడీలు తగ్గే విధంగానూ క్రియాశీలకంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం చేసే ఈ భారీ వ్యయం వల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి కొంత వెసులుబాటు వచ్చి అధిక మొత్తం మూలధన వ్యయం చేయటానికి వీలుంటుంది.

వృద్ధి రేటు పెంచడానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల కన్నా ప్రైవేట్‌ పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రుణాలను ఇబ్బంది లేకుండా చేయటం కోసం రెండు ప్రత్యేక స్కీములను ప్రవేశపెట్టారు. ఈ రోజు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ప్రధాన సమస్యగా వాటి నిరర్ధక ఆస్తులు తయారైనాయి. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో 70 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం కోసంగా కేటాయించడం జరిగింది.

అదేవిధంగా ప్రైవేటు రంగానికి గృహ నిర్మాణానికి రుణాలు అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఈరోజు ద్రవ్య అందుబాటు సమస్య (లిక్విడిటీ)తో సతమతమవుతున్న ఎన్బిఎఫ్‌సి సంస్థలకు కూడా వనరులు లభించే విధంగా మరో స్కీమును బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కావలసిన వనరుల సమీకరణకు విదేశాలలో బాండ్లను జారీ చేయటానికి ప్రతిపాదించారు. దీనివలన దేశీయ రుణ మార్కెట్‌ మీద ఒత్తిడి తగ్గి తద్వారా వడ్డీ రేట్లు కూడా తగ్గి సులభంగా ప్రైవేట్‌ రంగానికి రుణాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కార్పొరేట్‌ టాక్స్‌ అంశంలో కూడా కంపెనీలకు వెసులుబాటు కల్పించడం ఆయా కంపెనీలు పెట్టుబడులు పెంచడానికి అవకాశం కల్పిస్తాయి. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి కొన్ని చర్యలను బడ్జెట్‌లో పొందుపరిచారు. మౌలికం కాని, లాభసాటి కాని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా అదనపు వనరులను సమీకరించే యత్నాన్ని ఈ బడ్జెట్‌లో కూడా కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వం మూడు ప్రధాన అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు అమెరికా విధిస్తున్న ఆంక్షల మూలంగా ఎన్నో పరిశ్రమలు చైనా దేశం నుంచి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇవి భారతదేశంలో బహుళజాతి కంపెనీలను ఏర్పరిచే విధంగా కేంద్రీకృత దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశం ఈనాడు ఉపాధి కల్పన లేని వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా తయారైంది. పెద్ద ఎత్తున యాంత్రీకరణ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోట్ల ప్రయోగం వలన ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అధిక మూలధన వినియోగం, తక్కువ ఉపాధి కల్పన ప్రధానమైన ఆర్థిక నమూనాగా ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది. ఈ విధానం జనాభా అధికంగా గల భారత చైనా లాంటి దేశాలకు మంచి పరిణామం కాదు. ఈ సమస్య ఎట్లా అధిగమించాలి అనే దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

ఇక రెండవ ప్రధాన అంశం దేశంలో ప్రాంతీయ ఆర్థిక అసమానతలు. దక్షిణ, పశ్చిమ భారతం ఆర్థిక పురోగతిలో ముందంజలో ఉంది. తూర్పు, ఉత్తర భారతం బాగా వెనుకబడి ఉన్నది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై అధిక వ్యయం ద్వారా ప్రైవేట్‌ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తూర్పు ఉత్తర భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం ప్రభుత్వ వ్యయంతోను, ప్రోత్సాహాలతోనే జరిగే అంశం కాదు. ఆయా రాష్ట్రాలలో పరిపాలన సామర్ధ్యంలో, విధానాలలో మౌలికమైన మార్పు రావటం ఎంతైనా అవసరం. అప్పుడే పెట్టుబడులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది.

వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్‌ :  iyrk45@gmail.com
ఐవైఆర్‌ కృష్ణారావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top