రైతు స్వేదంతో రాజకీయ సేద్యం

Devinder Sharma Guest Columns On Indian Agriculture Crisis - Sakshi

విశ్లేషణ

గత సంవత్సరం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంత రైతులు బీజేపీ ప్రభుత్వాన్ని ఓటమి అంచుల్లోకి తీసుకుపోవడం, ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను రైతులు సాగనంపడం, రైతుబంధు పథకంతో తమను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వానికి రైతులు ఘనవిజయం కట్టబెట్టడం చూస్తుంటే.. ఓటింగ్‌ సమయంలో రైతులు నిర్ణయాధికారాన్ని శక్తిమంతంగా ప్రకటించే స్థితికి చేరుకున్నారని భావించక తప్పదు. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్‌ 11 తర్వాత భారత రాజకీయాల్లో వ్యవసాయం కేంద్ర బిందువై కూర్చుంది. కానీ ఇది వ్యవసాయ పునరుజ్జీవనానికి తోడ్పడుతుందా అన్నదే ప్రశ్న. ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా వెల్లడైంది. గత సంవత్సరం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు మత ఆగ్రహాన్ని చక్కగా ప్రదర్శించారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో పాలక బీజేపీని ఓటమి అంచులదాకా తీసుకురావడం అనేది ఆ ప్రాంతంలో తీవ్రమైన వ్యవసాయ దుస్థితిని స్పష్టంగా చాటి చెప్పంది. గ్రామీణ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం, వీధుల్లోకి వచ్చిన రైతుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలు వ్యవసాయం ప్రధానంగా ఉండే హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో పాలక ప్రభుత్వాలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన పరాజయం ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగానే చిత్రిం చింది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్‌ పార్టీ తనకు అధికారమిస్తే వ్యవసాయ రుణాల మాఫీని, వరిపంటకు అధిక గిట్టుబాటు ధరలను కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష నగదు ప్రోత్సాహం కలిగించిన అపార ప్రజాదరణతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అద్వితీయ విజయం సాధించారు. దేశంలోనే ప్రప్రథమంగా అమలైన ఈ వినూత్న పథకం ద్వారా తెలంగాణలోని భూ యజమానులు సంవత్సరానికి ఎకరా భూమికిగాను రూ. 8,000ను వ్యవసాయ దిగుబడి ఖర్చులను ప్రభుత్వం నుంచి సహాయకంగా పొందారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లోని 58 లక్షలమంది రైతులకు అందించి రికార్డు సృష్టించింది. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018–19 బడ్జెట్‌లో రూ. 12,000 కోట్లమేరకు కేటాయించింది. ఈ పథకం కింద రైతుకు అందించే నగదును రూ. 10,000కు పెంచుతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. వెంటనే జార్ఖండ్‌ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎకరా భూమికి రైతుకు రూ. 5,000లను అందించే పథకాన్ని ప్రకటించి తెలంగాణ బాటలో నడిచింది. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయ రుణాల మాఫీపై ఎన్నికల ప్రచార సమయంలో చేసిన హామీని అమలు చేస్తూ సంతకాలు పెట్టడంలో ప్రదర్శించిన వేగాన్ని పరిశీలించినట్లయితే, వ్యవసాయానికి సంబంధించినంతవరకు ఈ రాజకీయ అత్యావశ్యకతను కాంగ్రెస్‌ పార్టీ గుర్తించిందని స్పష్టంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కోరైతుకు గరి ష్టంగా 2 లక్షల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. దీనికయ్యే ఖర్చు దాదాపు రూ.35,000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో వ్యవసాయ రుణాల మాఫీకోసం వరుసగా  రూ. 18,000  కోట్లు, రూ. 6,100 కోట్లను ఖజానా నుంచి వెచ్చించనున్నాయి. ఈ రుణమాఫీలు పూర్తిగా అమలయితే 83 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది. 

రైతుల రుణమాఫీ వల్ల జమాఖర్చుల పట్టీలు (బ్యాలెన్స్‌ షీట్స్‌) అస్తవ్యస్థమవుతాయని, పైగా ఇది చెడు సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు, ప్రణాళికా కర్తలు మొత్తుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రుణమాఫీలపై తిరుగులేని విధంగా ప్రకటన చేశారు. ‘రైతులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. ఈ దేశం మీది. మీ రుణాలను మొత్తంగా మాఫీ చేయవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయి. వ్యవసాయ రుణ మాఫీలను చేసేంతవరకు ప్రధానిని మేం నిద్రపోనీయం. ఒకవేళ మోదీ ఈ పనిచేయనట్లయితే, నూటికి నూరు శాతం కాంగ్రెస్‌ అందుకు పూనుకుంటుందని మాట ఇస్తున్నా.

‘రాహుల్‌ గాంధీ వాదనలో కాస్త హేతువు ఉంది మరి. 2014 ఏప్రిల్‌ నుంచి 2018 ఏప్రిల్‌ మధ్యకాలంలో మన దేశ కార్పొరేట్‌ రంగం నుంచి రాబట్టలేని రూ. 3.16 లక్షల కోట్ల మొండి బకాయిలను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం రద్దు చేస్తున్నా ఘనత వహించిన మన ఆర్థికవేత్తలూ లేక బ్యాంకర్లు కిమ్మనడం లేదు. గావుకేకలు పెట్టడం లేదు. ఆర్తనాదాలు చేయడం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించగా చాలాచోట్ల గ్రామీణ ప్రజలు నాతో ఇదే విషయమై వాదులాటకు దిగారు. కార్పొరేట్‌ కంపెనీల భారీ రుణాలను ఉన్నపళాన రద్దు చేస్తున్నప్పుడు రైతుల రుణాలను ఎందుకు రద్దు చేయరు అనేది వారి ప్రశ్న. నిజానికి వారి ఆగ్రహం కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ పైకి మళ్లింది. ఎందుకంటే కార్పొరేట్‌ రుణాలను రద్దు చేయడం ఆర్థిక ప్రగతికి దారితీస్తుందని ఆయన రికార్డుపూర్వకంగా ప్రకటించారు. మరోవైపున ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక రైతు రుణ మాఫీని ప్రకటించినప్పుడు, అది జాతీయ బ్యాలెన్స్‌ షీట్లను దెబ్బతీస్తుందని, నైతికపరంగా అది అపాయకారి అని నాటి ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు.

అయినప్పటికీ, హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఓటర్లు ఇచ్చిన స్పష్టమైన తీర్పు వ్యవసాయాన్ని భారత రాజకీయరంగం కేంద్రపీఠంలోకి తీసుకొచ్చింది. రాజకీయ ఎజెండాలో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం లభించింది. దీని సందేశం చాలా స్పష్టంగానూ, బిగ్గరగానూ వినిపించింది. బహుశా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికల తీర్పు వ్యవసాయ సమాజంలో కొట్టొచ్చినట్లుగా ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించినట్లు సంకేతాలు వెలువరించింది. మతం, కులం, సిద్ధాంతాలు ప్రాతిపదికన రాజకీయ పార్టీల విభజన విధానాలకు దాటి ఆలోచిస్తున్న రైతాంగం, ఇప్పుడు తమ సామూహిక ఓటింగ్‌ శక్తిని వాస్తవంగా గ్రహిస్తున్నారు. ప్రభుత్వాలను అమాంతంగా పడదోయగల శక్తి తమకుందని ఇటీవలి ఎన్నికలు వారికి స్పష్టంగా బోధపర్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలను కూడా ఈ ప్రధానాంశం తప్పనిసరిగా ప్రభావం చూవవచ్చు.

జనాభాలో దాదాపు 50 శాతం మంది అటు ప్రత్యక్షంగానో, ఇటు పరోక్షంగానో వ్యవసాయరంగంలో మునిగివున్న దేశంలో, ఎట్టకేలకు రైతులు తమను తాము మరింత ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకునే స్థితికి చేరుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు ఘనీభవించిపోయాయి. ఇటీవలే ఓఈసీడీ జరిపిన అధ్యయనం ప్రకారం, భారత్‌లో గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులు యధాతథంగా ఉండిపోయాయని తెలుస్తోంది. అంతకుముందు యూఎన్‌సీడీఏడీ (అంక్టాడ్‌) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, అంతర్జాతీయంగానే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణం కారణంగా 1995 నుంచి 2005 వరకు స్తబ్దతలో ఉండిపోయాయని తేలింది. ఇక ఇటీవల నీతి అయోగ్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2011–12 నుంచి 2015–16 మధ్య అయిదేళ్ల కాలంలో వ్యవసాయోత్పత్తి వేగంగా పెరిగినప్పటికీ వ్యవసాయంలో వాస్తవాదాయం అర్థ శాతం కంటే అంటే 0.44 శాతం కంటే తక్కువగా ఉందని తెలిసింది.

మన దేశంలో రైతులు నిజంగానే పంటలు పండించడం అనే శిక్షకు గురైనట్లుంది. కొన్ని మినహాయింపులను దాటి చూస్తే, ప్రతి సంవత్సరం వారు పండిస్తున్న పంటల దిగుబడి ఖర్చుకు తక్కువ రాబడినే నిత్యం పొందుతూ వస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి దేశ ఆర్థిక భారం మొత్తాన్ని అనాయాసంగా రైతులపై మోపుతున్నారు. రైతు తన జీవిత పర్యంతం అప్పులతోటే పుట్టడం, అప్పులతోటే బతుకీడ్చటం నిజంగా నరకప్రాయమైనది. బతకాలంటే అప్పు చేయక తప్పని పరిస్థితి. మరోవైపున ఆ తీసుకున్న అప్పు పర్వతభారంలాగా పెరిగిపోతూ ఉంటుంది. రైతు జీవితం పొడవునా అలుముకున్న ఆర్థిక దుస్థితి ఇదేమరి. దేశంలోని 17 రాష్ట్రాల్లో లేక దాదాపుగా సగం దేశంలో వ్యవసాయ కుటుంబం సగటు ఆదాయం సంవత్సరానికి కేవలం రూ.20,000 మాత్రమే అని ఎకనమిక్‌ సర్వే 2016 ప్రకటించడం దేశాన్ని నివ్వెరపర్చింది. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయ ఆవరణంలో ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది. ఈ రాజకీయ మూలమలుపు వ్యవసాయదారులను నూతన పునరుజ్జీవన దిశగా నడిపిస్తుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.


వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top