స్వావలంబన అంటే ఇదేనా?

Coronavirus : Paparao Article On Economic Stimulus Package - Sakshi

విశ్లేషణ

నేటి కోవిడ్‌ సంక్షోభ కాలాన్ని, నరేంద్రమోదీ రెండు ప్రపంచ యుద్ధాల నాటి విధ్వంసంతో పోల్చారు. కానీ, నాడు ఆ వినాశనం నుంచి బయట పడేందుకు తమ తమ కరెన్సీలను విస్తారంగా ముద్రించి (‘ద్రవ్యలోటు’ భావనను పట్టించుకోకుండా) తద్వారా ప్రజల కొనుగోలు శక్తినీ, డిమాండ్‌నూ పెంచటం విషయంలో ప్రపంచ దేశాలు అనుసరించిన మార్గాన్ని అనుసరించడానికి మోదీ వెనుకాడుతున్నారు. నిజానికి, నేటి సంక్షోభ కాలంలో, ప్రపంచంలోని అనేక దేశాలు, భారీగా తమ తమ కరెన్సీల ముద్రణ ద్వారా  ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నిరంతరం ‘స్వదేశీ’ మంత్రాన్ని జపిస్తోన్న మన పాలకులు మాత్రం  విదేశీ రేటింగ్‌ సంస్థలకు వెరుస్తూ, షేర్‌ మార్కెట్లో విదేశీ మదుపుదారుల ప్రయోజనాలను కాపాడుతూ, అంతర్జాతీయరుణ సంస్థల షరతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. మనది ఒక సార్వభౌమాధికార దేశమని, మన కరెన్సీ రూపాయిపై, దాని ముద్రణపై పెత్తనం,అధికారం మనదేననే విషయాన్ని మరచిపోతున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మూల సిద్ధాంతమైన స్వదేశీని బూజుదులిపి స్వావలంబన రూపంలో బయటకు తీసింది. మే 5వ తేదీన మన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గారు దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించుకునే ఆలోచన చేస్తున్నామని, (దానికి అనుగుణంగా) విదేశాల నుంచి వచ్చే దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేసేందుకు సాంకేతికంగా ఆధునీకరించుకోవాలని భారత పారిశ్రామిక రంగానికి పిలుపును కూడా ఇచ్చారు. అలాగే, మే 12వ తేదీన 20 లక్షల కోట్ల ఉద్దీపన పేరిట ఒక విధాన, ఆర్థిక ‘‘పథకాన్ని’’ ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ కూడా స్వావలంబనను ఈ విధానం తాలూకు కేంద్ర బిందువుగా సెలవిచ్చారు. 

కానీ, ఈ స్వదేశీ విధానం దిశగా సాగే చిత్తశుద్ధి, సాహసం బీజేపీ నాయకత్వానికి ఉందా ? జవాబులు చూద్దాం. గతంలో వాజ్‌పేయి హయాం నుండి కూడా బీజేపీ మూల సిద్ధాంతాలుగా వున్న రెండు అంశాలు : 1. హిందూత్వ 2. స్వదేశీ. కాగా, ఇక్కడ మనం గమనించాల్సింది ఒక రాజకీయ పక్షంగా బీజేపీ తాలూకు సైద్ధాంతిక విజయం ప్రధానంగా  స్వదేశీ తాలూకు వాగ్దానాల పునాదిపైనే ప్రాథమికంగా ఆధారపడి ఉంది. అంటే స్వదేశీ రూపంలో దేశ ప్రజల కనీస ఆర్థిక అవసరాలను పరిపూర్తి చేసిన తర్వాతే ఆ స్థిరమైన పునాదిపై బీజేపీ తన నినాదమైన హిందూత్వను సంపూర్ణంగా విజయవంతం చేసుకోగలదు. 

తొలినుంచీ కార్పొరేట్‌ అనుకూలతే!
కాగా, 1996లో 13 రోజుల బీజేపీ ప్రభుత్వంలో అమెరికాకు చెందిన అవినీతి పుట్ట ఎన్‌రాన్‌ ప్రాజెక్టుకు వాజ్‌పేయి హయాంలో కౌంటర్‌ గ్యారంటీలు ఇవ్వడంతోనే బీజేపీ తాలూకు స్వదేశీకి మొదటి చావు దెబ్బ తగిలింది. అలాగే, నేటి ఎన్డీఏ 2 హయాంలో కూడా బీజేపీ పాలకులు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మించిన స్థాయిలో విదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. అనేక సందర్భాలలో దేశీయ ఎగుమతులను పెంచుకోవడం, ఉపాధి కల్పనల వంటి అంశాలకు విరుద్ధంగా అమెరికాతో అంటకాగడం, ఆ దేశ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడమే చేశారు. ఈ క్రమంలోనే అమెరికాతో మనకి ఉన్న వాణిజ్య సమతుల్యత (ఎగుమతి దిగుమతుల సమతుల్యత) అమెరికాకు అనుకూలంగా మారింది. ఆ దేశంతో మనకు వున్న వాణిజ్య మిగులు స్థాయి పడిపోయింది. అలాగే బిలియన్ల కొద్దీ డాలర్ల ఆయుధాల దిగుమతులు గత కొన్నేళ్లలో అమెరికా నుంచి జరిగాయి. అలానే రష్యా నుంచి మనం కొనుగోలు చేయదల్చిన ఎస్‌400 మిసైల్‌ రక్షణ వ్యవస్థకు అమెరికా మోకాలడ్డినా మనం మారు మాట్లాడలేని దుస్థితిలోకి పోతున్నట్లు కనబడుతోంది. ఇక, మన చిరకాల మిత్రదేశం ఇరాన్‌ నుంచి, చమురు  దిగుమతులను నిలిపివేయమని అమెరికా ఆదేశాలు జారీచేస్తే తలవంచి శిరసావహించాం. నిన్నగాక మొన్న,  భారత్‌ తమకు హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ఔషధాన్ని ఎగుమతి చేయకుంటే సహించేదిలేదని అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే ఔషధంపై విధించిన నిషేధాన్ని పక్కన పెట్టి మరీ మనం అమెరికాకు జోహుకుం చేశాం.

ఇక, చివరగా నేడు కరోనా విషాద కాలంలో ఆర్థికంగా చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు పూర్తిస్థాయిలో నిర్ణయాలు చేయలేకపోయాం. మీనమేషాలు లెక్కించి  మొదటి దఫా వాపు తప్ప బలంలేని 1.70 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పథకాన్ని ప్రకటించుకున్నాం. ఇక, చాలాకాలం వృధా చేశాక ప్రతిపక్షాలూ, ఏ రాజకీయాలులేని అభిజిత్‌ బెనర్జీ, రçఘురామ్‌ రాజన్‌ వంటి పలువురు ఆర్థికవేత్తలూ, కడకు స్టాండర్డ్‌ అండ్‌పూర్‌ వంటి పలు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలూ కూడా విమర్శలూ, సూచనలూ చేశాక, మే 12వ తేదీన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఒక ఉద్దీపనను ప్రకటించారు. 

కేంద్ర ఖజానాలో అదనంగా ఖర్చు 2 శాతమే
ఈ ప్యాకేజీ స్వరూపం సూక్ష్మంగా:  1. ఇప్పటికే అప్పులపాలై, ఆర్థిక పటుత్వాన్ని కోల్పోయిన–– సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకూ, రైతులకూ, ఇతర బాధిత వర్గాలకూ రుణాలు ఇస్తాం తీసుకోండి అని ప్రతిపాదించడం. 2. 2020–21 బడ్జెట్‌ను కాస్తంత రీప్లే చేయడం. 3. సులభతర వాణిజ్యం పేరిట వివిధ కీలకరంగాల్లో భారీ స్థాయి ప్రైవేటీకరణలు.. అది చాలదన్నట్లు రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునేందుకు ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిమితిని ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 5 శాతానికి పెంచే పేరిట ఈ వెసులుబాటును ఉపయోగించేందుకు రాష్ట్రాలు కూడా ప్రైవేటీకరణలు, యూజర్‌ చార్జీల మోతలూ మోగించాలని షరతు పెట్టడం. మొత్తంగా ఈ సోకాల్డ్‌ ప్యాకేజీలో కేంద్ర ఖజానా నుంచి అదనంగా ఖర్చుపెట్టింది కేవలం 2 శాతం లోపే. అంటే మాటలు కోటలు దాటినా, చేతలు గడపదాటడం లేదు. అంతిమంగా ఈ ప్యాకేజీలో లేనిదీ.. నేటి కోవిడ్‌ సంక్షోభ కాలంలో జనసామాన్యం అడుగుతున్న ఆ ఒక్కటే.. అదే హెలికాప్టర్‌ మనీ.. లేదా బాధిత వర్గాలకు వారి అకౌంట్లలోకి సరాసరి నగదును బదిలీ చేసి ఈ విపత్కాలంలో వారిని తక్షణం ఆదుకోవడం. 

ఈవిధంగా  తమ దగ్గర డబ్బు లేదంటూ, నిరంతరంగా ద్రవ్య లోటును దాటలేమని సెలవిచ్చే మన పాలకులు  దేశ సార్వభౌమాధికారానికీ, స్వతంత్ర నిర్ణయాధికారాలకూ తిలోదకాలు ఇస్తున్నారు. రేటింగ్‌ సంస్థలను సంతృప్తిపరుస్తూ, షేర్‌ మార్కెట్‌ సూచీలనే దేశ పురోగతికి కొలబద్దలుగా చూసుకుంటూ, విదేశీ ఋణదాతల షరతులకు తల ఒగ్గుతున్న నేటి ప్రభుత్వ నేతల తాలూకు ‘స్వదేశీ’ నినాదం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అంతే నిజం! బహుశా ఈ కారణం చేతనే నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఆర్థిక వేత్త అభిజిత్‌ బెనర్జీ భారత ప్రభుత్వం నేటి కోవిడ్‌ సంక్షోభ కాలంలో ద్రవ్య లోటును పట్టించుకోకుండా భారీగా కరెన్సీని ముద్రించి అయినా, దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునే సాహసాన్ని చేయాలన్నారు. కాగా, తన ఆదాయం కంటే, ఖర్చులు ఎక్కువ పెట్టి, ద్రవ్యలోటును పెంచుకుంటే (మరిన్ని కరెన్సీ నోట్ల ముద్రణ వంటి మార్గాల ద్వారా) దాని వలన ద్రవ్యోల్బణం పెరిగి అది రూపాయి విలువ పతనానికి దారి తీస్తుందనేదే మన ప్రభుత్వం తాలూకు ఆందోళనగా వుంది. నిజానికి, ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలా, రూపాయి దిగజారుడు గురించిన ఆందోళన అది దేశ ప్రజలకు చెరుపు చేస్తుందని కాదు. దీని వెనుకన ఉన్నది  దేశీయ షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపుదారుల ప్రయోజనాలు మాత్రమే. అంటే ఈ మదుపుదారులు మన షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులను రూపాయి కరెన్సీలోనే పెట్టగలరు. కాబట్టి, ఇక్కడ రూపాయి విలువ తగ్గితే ఈ మదుపుదారుల పెట్టుబడులూ, లాభాల విలువ కూడా తగ్గిపోతుంది. అదీ కథ.

ప్రపంచ దేశాలను ఈ విషయంలో అనుసరించరా?
నేటి కోవిడ్‌ సంక్షోభ కాలాన్ని, నరేంద్రమోదీ రెండు ప్రపంచ యుద్ధాల నాటి విధ్వంసంతో పోల్చారు. కానీ, నాడు ఆ వినాశనం నుంచి బయట పడేందుకు తమ తమ కరెన్సీలను విస్తారంగా ముద్రించి (‘ద్రవ్యలోటు’ భావనను పట్టించుకోకుండా) తద్వారా ప్రజల కొనుగోలు శక్తినీ, డిమాండ్‌నూ పెంచడం విషయంలో ప్రపంచ దేశాలు అనుసరించిన మార్గాన్ని అనుసరించడానికి మోదీ వెనుకాడుతున్నారు. నిజానికి, నేటి సంక్షోభ కాలంలో, ప్రపంచంలోని అనేక దేశాలు, భారీగా తమ తమ కరెన్సీల ముద్రణ ద్వారా  ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. చివరకు, ఆర్థికంగా మనను పోలిన టర్కీ, ఇండోనేసియా దేశాలు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. 

కానీ, నిరంతరం  ‘స్వదేశీ’ మంత్రాన్ని జపిస్తోన్న మన పాలకులు మాత్రం  విదేశీ రేటింగ్‌ సంస్థలకు వెరుస్తూ, షేర్‌ మార్కెట్లో విదేశీ మదుపుదారుల ప్రయోజనాలను కాపాడుతూ, అంతర్జాతీయ ఋణ సంస్థల షరతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. మనది ఒక సార్వభౌమాధికార దేశమని, మన కరెన్సీ రూపాయిపై, దాని ముద్రణపై పెత్తనం, అధికారం మనదేననే విషయాన్ని మరచిపోతున్నారు.

వ్యాసకర్త : డి. పాపారావు ,ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్‌ : 98661 79615 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top