అమిత్‌ షా (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ

BJP President Amit Shah Unwritten Diary - Sakshi

మాధవ్‌ శింగరాజు

కర్ణాటకలో పేర్లన్నీ కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి! కన్‌ఫ్యూజన్‌లో మొన్న సిద్ధరామయ్య అనబోయి, ఎడ్యూరప్ప అన్నాను. రాహుల్‌గాంధీ నవ్వాడు. సిద్ధరామయ్య పగలబడి నవ్వాడు. కరప్షన్‌లో ఎవరైనా సర్వే చేయిస్తే ఎడ్యూరప్ప గవర్నమెంట్‌కు ‘నంబర్‌ వన్‌’ అవార్డు వస్తుందని అన్నాను. ప్రెస్‌మీట్‌ అది. ప్రెస్‌ వాళ్లకు, కాంగ్రెస్‌ ప్రెసిడెంటుకు కావల్సింది ఇలాంటివే!

‘‘సార్, ఎడ్యూరప్ప కాదు, సిద్ధరామయ్య! ఎడ్యూరప్ప మన పార్టీ. సిద్ధరామయ్య కాంగ్రెస్‌ పార్టీ. ఎడ్యూరప్ప ఒకప్పటి మన సీఎం. సిద్ధరామయ్య ఇప్పటి కాంగ్రెస్‌ సీఎం’’ అన్నాడు ప్రహ్లాద్‌ జోషీ. 
అతడేం చెప్పాడో నాకు అర్థం కాలేదు. 
‘‘ఇంకోసారి చెప్పు’’ అన్నాను. చెప్పాడు.
‘‘ఆ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు?’’ అన్నాను, ప్రెస్‌మీట్‌ అయ్యాక బయటికి వచ్చేస్తూ. 
‘‘ఏ ముక్క సార్‌?’’ అన్నాడు. 
‘‘అదేనయ్యా.. ఎడ్యూరయ్యకి, సిద్ధరామప్పకీ మధ్య నా టంగ్‌ స్లిప్‌ అయ్యే ప్రమాదం ఉందని ముందే ఎందుకు చెప్పలేదు?’’ అన్నాను.  
‘‘నేను ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు సార్, మీరలా అనేస్తారని’’ అన్నాడు ప్రహ్లాద్‌. అని, మళ్లీ ‘సర్‌’ అన్నాడు.
‘‘ఏంటయ్యా’’ అన్నాను. 
‘‘మీ టంగ్‌ మళ్లీ స్లిప్‌ అయింది సర్‌. ఎడ్యూరప్పలోని అప్పని సిద్ధరామయ్యకి, సిద్ధరామయ్యలోని అయ్యని ఎడ్యూరప్పకీ పెట్టేశారు సర్‌’’ అన్నాడు!
అతడు మాట్లాడిన దాంట్లో ‘సర్‌’ అన్న మాటొక్కటే నాకు అర్థమైంది.
‘‘అర్థమయ్యేలా చెప్పు ప్రహ్లాద్‌’’ అన్నాను. 
‘‘అయ్యని అప్పకి, అప్పని అయ్యకీ పెట్టేశార్సార్‌’’ అన్నాడు. 
‘‘భలే ఉన్నాయయ్యా మీ పేర్లు.. అర్థమై చావకుండా..’’ అన్నాను. 
‘‘అర్థమై చచ్చినా కూడా భలే ఉంటాయి సర్, మా పేర్లు’’ అన్నాడు. 
ప్రహ్లాద్‌ హర్ట్‌ అయ్యాడని అర్థమైంది. 
టాపిక్‌ మార్చాను. ‘‘అదేంటీ.. కామరాజ్‌ నగరా? చామరాజ్‌నగారా? ఇందాక మనం వెళ్లొచ్చాం.. భలే ఉందయ్యా పేరు..’’ అన్నాను.
‘‘మీరేదంటే అదే కరెక్ట్‌ సర్‌’’ అన్నాడు! 
అతడింకా హర్టయ్యే ఉన్నాడు. 
‘‘గొప్ప గొప్ప వాళ్లున్నారయ్యా మీ దగ్గర. కుప్పలి వెంకటప్ప పుట్టప్ప ఎంత గొప్ప కవి! మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంత గొప్ప ఇంజనీరు’’ అన్నాను. 
ప్రహ్లాద్‌ జోషీలో స్పందన లేదు. తీవ్రంగా హర్ట్‌ అయినట్లున్నాడు. ఎంతైనా ఎంపీ. మూడుసార్లు ఎంపీగా గెలిచినవాడు. ఆ మాత్రం లోకల్‌ ఫీలింగ్, లాంగ్వేజ్‌ ఫీలింగ్‌ ఉంటాయి.
‘‘అన్నిటికన్నా నీ పేరు బాగుందయ్యా ప్రహ్లాద్‌.. కన్‌ఫ్యూజన్‌ ఏం లేకుండా’’ అన్నాను, మనిషిని మామూలు మూడ్‌లోకి తెచ్చేద్దామని. 
‘‘థ్యాంక్యూ సర్‌. కానీ నా పేరు ప్రహ్లాద్‌ కాదు సర్‌. ప్రల్హాద్‌ సర్‌’’ అన్నాడు!!
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top