నిరుపమాన పాలనాదక్షుడు

Article On Neelam Sanjeeva Reddy By Eshwar Reddy - Sakshi

సందర్భం  

భారతదేశ హృదయాల్లో పరి పాలనాదక్షుడిగా మహోన్నత స్థానాన్ని పొందిన వారిలో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, రాజగోపాలాచారి, ఇందిరాగాంధీ, కామరాజ్‌ నాడార్‌ ముఖ్యులు. కాగా ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా, అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా అనేక పదవులు అలంకరించి తన పరిపాలనా చాకచక్యంతో ఆ పదవులకే వన్నె తెచ్చిన పరిపాలనాదక్షుడు నీలం సంజీవరెడ్డి. సామాన్య రైతుబిడ్డగా జన్మించి, దేశంలో అత్యున్నతమైన భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన నీలం 106వ జయంతి నేడు.

దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయలసీమలోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 మే 19న నీలం సంజీవరెడ్డి జన్మించారు. గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు అన్ని కీలకపదవులు అలంకరించారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా కొత్త సత్సంప్రదాయాలను సృష్టించిన మహా మనిషి. 1964లో కర్నూల్‌ జిల్లాలో బస్సు రూట్లను జాతీయం చేసే అంశంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అదే ఏడాది ఫిబ్రవరి 23న ఏపీ ముఖ్యమంత్రి పదవికి తనకు తానుగా రాజీనామా చేసి దేశంలోనే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1967 లోక్‌సభ ఎన్నికల అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు.

 ఏపీకి నీలం సంజీవరెడ్డి ఎంతో సేవ చేశారు. జిల్లా పరిషత్, పంచాయతీ సమితులు, విధాన పరిషత్‌ ఏర్పాటుకు కారకులయ్యారు. పంచాయితీ వ్యవస్థకు పరిపుష్టి చేకూర్చి జాతిపిత కలలు కన్న పంచాయితీ రాజ్‌ వ్యవస్థ పురోభివృద్దికి సోపానం వేశారు. ఆయన పరిపాలన విధానాలను నెహ్రూ సైతం ప్రశంసించారు. 1959లో ఏపీ పర్యటనకు వచ్చిన నెహ్రూ నీలం సంజీవరెడ్డి పరిపాలన విధానాలకు ఆకర్షితులయ్యారు. పంచాయితీ రాజ్‌ వ్యవస్థ పాలనలో దిట్టగా పేరుగాంచి, తద్వారా సాధించిన అనుభవం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటానికి దోహపడింది. 

నీలం సంజీవరెడ్డి పరిపాలనాదక్షుడే కాదు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. అనంతపురం, మద్రాస్‌లలో విద్యనభ్యసించిన సంజీవరెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో అనేకసార్లు జైలుకు వెళ్లారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని దీర్ఘకాలం అంటే 1942 నుంచి 1945 వరకు వేలూరు, అమరావతి జైళ్లలో నిర్బంధితులయ్యారు. 1946లో విడుదలైన తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మద్రాస్‌ రాష్ట్ర లెజిస్లేచర్‌ పార్టీకి కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 1949 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి మద్రాస్‌ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రాజా మంత్రివర్గంలో గృహనిర్మాణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1951–53 మధ్య ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

1953 అక్టోబర్‌ నుంచి టంగుటూరి ప్రకాశం, బెజ వాడ గోపాల్‌రెడ్డి మంత్రి వర్గాల్లో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. వారితో కలిసి పనిచేయడం వల్ల పరిపాలన రంగంలో అపారమైన అనుభవం గడించారు. ఫలి తంగా 1956 నవంబర్‌ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా నియమితులయ్యారు. తిరిగి 1962 మే నుంచి 1964 ఫిబ్రవరి వరకు సీఎంగా పనిచేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. 1956 నవంబర్‌ నుంచి 1959 డిసెంబర్‌ వరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 

నెహ్రూ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గాలలో నీలం సంజీవరెడ్డి పనిచేశారు. 1967 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1977లో జనతాపార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి జనతా పార్టీ తరఫున ఎన్నిక అయిన ఏకైక పార్లమెంట్‌ సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. అనంతరం అదే ఏడాది జూలైలో భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో మంత్రిగా, ఏపీ సీఎంగా, ఉపముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. తన హయాంలో అనేక భారీ పరిశ్రమలను స్థాపించారు. దేశానికి సేవలందించిన గొప్ప నాయకులలో ఒకడిగా తనదైన ముద్రవేశారు. అనేక క్లిష్టపరిస్థితుల్లో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దేశానికి నిరుపమాన సేవలందించిన నీలం సంజీవరెడ్డి 1996 జూన్‌ 1న తుది శ్వాసను విడిచారు.
(నేడు నీలం సంజీవరెడ్డి 106వ జయంతి సందర్భంగా)


డా. అగరాల ఈశ్వర రెడ్డి
వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top