చిదంబరం కేసు.. రెండ్రోజుల సంబరమేనా?

Article About Chidambaram Arrest By CBI For INX Media Case  - Sakshi

శక్తివంతమైన నేతలు వివిధ కేసుల్లో అరెస్టు కావడం, ఆ సమయంలో ప్రజలు ఏదో అద్భుతం జరిగిపోతుందని సంబరపడడం మామూలే. అయితే అలాంటి కేసులన్నీ తాత్కాలికంగా చప్పున వెలిగి తర్వాత ఆనవాలు లేకుండా ఆరిపోవడం జరుగుతున్న చరిత్ర. టూ జీ కుంభకోణమైనా, మరొకటైనా చివరకు జరిగింది మాత్రం ఇదే. యూపీఏ పాలనలో శక్తివంతమైన మంత్రి చిదంబరం తాజా అరెస్టు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు 307 కోట్లరూపాయల నల్ల ధన ప్రవాహం, ఆ డబ్బు ఆయన కుమారుడికే చేరి నట్టు ఒక అవినీతి కేసు. అలాగే ఎయిర్‌ సెల్‌ మాక్స్‌ ఒప్పందాల్లో అడ్డగోలు లబ్ధి చేకూర్చినట్టు తద్వారా ఆయన చేతివాటంపై మరో కేసు.

ఈ అవినీతి కేసుల్లో సీబీఐ,ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. గతంలో ఇవే కేసుల్లో ఓ ఇరవై సార్లు ఆయనకు అరెస్టు కాకుండా బెయిల్‌ దొరికింది కానీ ఈసారి అలా జరగలేదు. ఈ ఉదంతాన్ని కాంగ్రెస్‌ కక్షసాధింపు అంటుండగా, బీజేపీ తన ప్రమేయం లేదు, ఇది దర్యాప్తు సంస్థల ద్వారా చట్టం తన పని తాను చేసుకుపోవడం మాత్రమే అంటుంది. అయితే ఒక సామాన్యుడిగా ఒక శక్తిమంతుడు అవినీతి కేసులో అరెస్టు కావడాన్ని హర్షించవచ్చు గానీ, అది తాత్కాలికమే. తర్వాత  సదరు కేసు అవకాశం బట్టీ నత్త నడక, అవసరం బట్టీ పరుగు నడక పడుతుంది. ఎప్పుడూ స్థిరం గా ఒకే వేగం అన్నది ప్రముఖుల కేసుల్లో ఉండే ప్రసక్తే లేదు. చివరి ఫలితం అన్నది అయితే సాక్ష్యాలు చాలక కొట్టివేయడమో, లేదా దశాబ్దాల తర్వాత దోషిగా నిలబెట్టడమో జరుగుతుంది. అప్పటికి ఆ ప్రముఖుడు ఫలితమేదైనా ఒకే లా తీసుకునే మానసిక స్థితిలో ఉంటాడు. సమాజం ఎటూ మరి చి పోతుంది. ఈ ధోరణి మారాలి. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వం అన్ని కేసుల్నీ సమ దృష్టితో చూడాలి. కొన్ని ఇష్టం, కొన్ని కష్టంలా ఉండకూడదు. అంతవరకూ అవి నీతిని కట్టడి చెయ్యడం సాధ్యం కాదు. తాత్కాలిక సంబరాలు తప్ప, అంతిమ విజయాలు లేని అవినీతిపై పోరాటాలివి.

డా.డి.వి.జి.శంకరరావు, మాజీఎంపీ,
పార్వతీపురం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top