ఓటమి ఛాయల్లో చంద్ర భ్రమణం

ABK Prasad Article On Chandrababu Naidu Stunts - Sakshi

రెండో మాట

ఎన్నికల యుద్ధం ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా పెక్కు ప్రాంతాల్లో తమ ఓటమిని ముందుగానే ఊహించుకున్న తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటర్లను చెల్లాచెదరు చేయాలని విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు ఈవీఎంలు, వీవీప్యాట్లపై సరికొత్త దాడి మొదలెట్టారు. రాష్ట్ర ఓటర్ల ముందు తన పప్పులుడకలేదని అర్థం కావడంతో ఢిల్లీ పంచల్లో పడి ఎన్నికల కమిషన్‌పై ‘జాతీయ’ స్థాయి యుద్ధం మొదలెట్టేశారు. ఎన్నికల ఫలితాలు తేలాక బాబుకు అలయెన్స్‌ ఎంతమేరకు దన్నుగా ఉంటుందో వేచి చూడాల్సిందే. 

‘ఆశీర్వదించండి–– నన్ను నమ్మండి..  జగన్‌ని నమ్ముకుంటే జైలే.. వీరతిలకం దిద్దినన్ను ఆశీర్వదించండి.. మీ రుణం తీర్చుకుంటాను.. రాత్రింబవళ్లు పనిచేస్తా.. నేను ఓడినా నాకు భార్య, కొడుకు, మనవడూ ఉన్నారు.. రాష్ట్రం అట్టుడికి పోయేలా వారంరోజుల పాటు ఆందోళన చేయాలి పార్టీ శ్రేణులు..’ – ఎన్నికల సభల్లో టీడీపీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉవాచ

దేశంలో ఏ రాష్ట్రంలోకన్నా అత్యంత ఉత్కంఠ రేపుతూ ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రధాన ప్రతిపక్షం మధ్య జనరల్‌ ఎన్నికల్లో లోక్‌సభ–అసెంబ్లీ స్థానాలకు సంకుల సమరం సాగింది. కానీ అంతటితో ఎన్నికల యుద్ధం ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా పెక్కు ప్రాంతాల్లో తమ ఓటమిని ముందుగానే ఊహించుకున్న పాలకవర్గ ‘తెలుగుదేశం’ అధిపతి సహనం కోల్పోయారు. ఏపీలో ఎన్నడూ ఎరుగనంత స్థాయిలో ప్రజలు తమ ఓటుహక్కును రాష్ట్ర వ్యాప్తంగా క్యూలు కట్టి మరీ వినియోగించుకోవడానికి తరలి వచ్చారు. వీరిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇతర చిన్నా చితకా పక్షాలకు చెందిన ఓటర్లతోపాటు అధికారపక్షమైన టీడీపీ ఓటర్లు కూడా ఉన్నారు. కానీ విచిత్రమేమిటంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన బహుళ సంఖ్యాకులైన ఓటర్లను చెల్లాచెదరు చేయాలని తీవ్రంగా ప్రయత్నించి కూడా బాబు విఫలమయ్యారు. దీంతో జనం నోళ్లలో, మనస్సుల్లో ముందస్తుగానే ఖాయపడిపోయిన తన ఓటమిని మింగలేక, కక్కలేక దాడులకు పాల్పడ్డాడు! అసమర్థ దుర్జనత్వం అంటే ఇదే మరి. 

ఒక తప్పును సమర్థించుకోవడానికి మరిన్ని తప్పులు చేయడం ఆ పిమ్మట మొగసాలకెక్కి మొత్తుకోవడం ఉన్మాదావస్థలో ఉన్న నియంతలకు, ప్రజా వ్యతిరేక పాలనాశక్తులకు సర్వ సాధారణమని ప్రపంచ చరిత్ర చెబుతోంది. ముస్సోలనీ, హిట్లర్, టోజోలు అదే పని చేశారు. అయితే అసమర్థులు కూడా ఆఖరిక్షణాల్లో దుర్జనులుగా మార వచ్చు గానీ, వాళ్లకు తాను భావించిన శత్రువును నేరుగా ఎదుర్కొనే ధైర్యసాహసాలు తక్కువ. జర్మన్‌ పార్లమెంట్‌ (రీచ్‌ స్టాగ్‌)కు అర్థరాత్రిపూట నిప్పంటించి కూలగొట్టి, నాడు తన ప్రధాన శత్రువైన  జర్మన్‌ కమ్యూనిస్టు పార్టీపైన ఆ దుర్మార్గ చర్యను నెట్టి, ఆ పార్టీని నిషేధించి, కమ్యూనిస్టులను జైళ్లపాలు చేశాడు హిట్లర్‌. కానీ అలాంటి సాహసానికి మన ‘ఉన్మాది’ అయిన పాలకుడు ఒడిగట్టగల దమ్మూ, చేవా ఉన్నవాడు కాదని మనం భావించలేం. ఎందుకంటే చంద్రబాబు తుళ్లూరు ప్రాంతంలో మూడుపంటలు పండే రైతుల భూముల్లోని పండ్లతోటల ను అర్ధరాత్రి తగులబెట్టించి ఆ పాపాన్ని వైఎస్సార్‌ సీపీపై నెట్టజూశాడు.

అందుకనే ఏపీలో పోలింగ్‌ ముగిసినప్పటికీ ఇంకా నెలరోజుల తర్వాత గానీ ‘జాతక ఫలాలు’ తేలవు కాబట్టి బాబు ‘ఓటమి గుబులు’ను గుప్పెటలో పెట్టుకుని.. ప్రధాన ప్రతిపక్షం ఎలాంటి కవ్వింపులకు దిగకపోయినా ఓటింగ్‌ ప్రశాంతంగా జరగడానికి సర్వత్రా సహకరించినా, పలుచోట్ల అధికారపక్షం అసహనంతో తెగబడి, ఓటర్లకు, ఓటింగ్‌ నిర్వాహకులకు దౌర్జన్య కాండతో, దాడులతో ఆటంకా లు కలిగించింది. అటూ ఇటూ కూడా కొంతమంది చనిపోవడానికి కారణమైంది. తానేదో ‘జాతీయపార్టీ’ నాయకుడైనట్లు ఫోజు పెట్టి అఖిల భారత స్థాయిలో ఉన్న రాజకీయ పక్షాల నాయకులతో ‘అలయెన్స్‌’ పేరిట చేతులు కలిపిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపత్తిని ధ్వంసం చేయడానికి పూనుకోవడమే కాకుండా, ఉమ్మడి రాష్ట్రం కృత్రిమ విభజన తర్వాత రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి ద్వారా రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడంలో అన్నివిధాలుగా విఫలమయ్యారు. 

గతంలో ఎన్డీయేలో చేరడమే కాకుండా, గుజరాత్‌లో ఊచకోతలకు కారకుడు నరేంద్రమోదీ అని అప్పట్లోనే ప్రకటించాడు చంద్రబాబు. కానీ ఆ తర్వాత అదే మోదీతో చేతులు కలపడం కోసం ప్లేటు ఫిరాయించి ఆలింగనం చేసుకున్న అవకాశవాద పాలకుడు బాబు. తెలు గుదేశం వ్యవస్థాపకుడు కాంగ్రెస్‌ అష్టావక్ర దుర్మార్గాలకు సమాధానంగా దేశం పార్టీని స్థాపించి చరిత్రలో తొమ్మిది నెలల్లోనే పార్టీని విజయసాధన వైపు నడిపించిన ఎన్టీఆర్‌ కాళ్లక్రింది కుర్చీని లాగి చీకట్లో ఆయన స్థానంలో కూర్చుని రాష్ట్రాన్ని అధోగతిలోకి నెడుతూ వచ్చిన వ్యక్తి బాబు. 

తాను గతంలో ఈసడించుకున్న బీజేపీతో అవసరార్థమై జతకట్టినంతమాత్రాన, యూపీఏతో కొన్నాళ్లు సరసమాడినంత మాత్రాన తనది జాతీయపార్టీ అని ప్రకటించుకునే సాహసానికి బాబు దిగాడు. ఆచరణలో ఆ పంచలలో, ఈ పంచలలో చేరి పరిగలేరుకుని బతికే పార్టీగా టీడీపీని మార్చి ఇప్పుడు దాన్నొక జీవచ్ఛవంగా నిలబెట్టాడు. అదేమంటే జాతీయస్థాయిలో అలయెన్స్‌ పేరిట, దానినీ ముంచడానికి సిద్ధమయ్యాడు. అందుకోసం బాబు ప్రస్తుతం ఆడుతున్న నాటకం–– ‘కన్ను కైకలూరులో, కాపురం డోకిపర్రులో’ అన్న సామెతలాగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ రేపటి పతనాన్ని చూసుకోలేక రాష్ట్రంలో నవ్వులపాలై, ఢిల్లీకి పాకి అలయెన్స్‌ పేరిట ముఖం చాటుచేసుకోవలసి వచ్చింది.

ఈ సరికొత్త విషాదాంత నాటకంలో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్‌ మెషిన్లు పనిచేయలేదన్న సాకుతో వీవీప్యాట్‌లలో ఓటర్ల ఓటు నమోదైందీ లేనిదీ నిర్థారించుకోవడానికి ఆ వీవీప్యాట్స్‌లో నమోదైన వోటర్లకు చెందిన 50 శాతం చీటీలను తనిఖీ చేయాలని సుప్రీంకోర్టును అలయెన్స్‌ అర్థించాలని బాబు కోరడంతో కూటమి తన పంచన చేరినందుకు రాయితీగా అందుకు ఒప్పుకుంది. కానీ ఈవీఎంలు, వీవీప్యాట్‌లు వాడుకుని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ తదితర చోట్ల గుట్టుగా గెలిచిన కాంగ్రెస్‌ కానీ,  అంత గుట్టుగానూ ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో జక్కాయి బుక్కాయితో చేతులు కలిపి అత్తెసరుతో అధికారంలోకి వచ్చిన బాబు కానీ వాడుకున్నదీ అవే ఈవీఎంలు అయినప్పుడు అప్పుడురాని అనుమానం ఇప్పుడెందుకు వచ్చిందో వారే సూటిగా చెప్పాలి. ‘కన్ను చూసినదాన్ని నమ్మితే చెవి విన్నదాన్ని నమ్ముతుంద’ట! ఇప్పుడు టీడీపీ అధినేతను నమ్ముకుని మునిగిపోతూ, ‘దేశం’ ఉనికిని కూడా ముంచేయబోతున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి గానీ, సుప్రీంకుగానీ దింపుడు కళ్లం దశలో బాబు సహా నేషనల్‌ అలయెన్స్‌ గొంతెమ్మ కోర్కెలు ఈ విషయంలో నెరవేరవు. ఈ ఎన్నికల సమయంలో బాబు ముఠా కొన్ని ఉంపుడు పత్రికలూ ఆడిన మరో ఉపనాటకం–– రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నదని ఎన్నికల ఆఖరి దశలో ప్రకటించిన ప్రధాన జాతీయ సర్వేల వార్తలను వక్రీకరించి ఉల్టా ప్రకటనలు ప్రచురించడం. కానీ వాటిని ఆ సర్వే కంపెనీల అధిపతులే ఖండించి తక్షణచర్యల కోసం జాతీయ ప్రెస్‌ కౌన్సిల్‌కు నివేదించగా, కౌన్సిల్‌ నోటీసు జారీ చేయవలసి వచ్చింది. చివరకు ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర స్థాయి చీఫ్‌ గదిలోకి దూరి మరీ దూషించే స్థాయికి చంద్రబాబు దిగజారడం అనేది తనకూ, సొంతపార్టీలోని తనలాంటి ఆలోచనాపరులకూ గుండెదిటవు కోల్పోతున్న స్థితికి సంకేతాలే. ఈ ఎన్నికల్లో మరో విచిత్ర పరిణామం.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గతంలో కంటే సైద్ధాంతికపరంగా మరింత దిగజారిపోయి, వారు ఎవరిని ఏ సమయంలో సమర్థిస్తున్నారో గుర్తించలేకపోవడం.

ఓటర్ల సంఖ్య పెరగడం. పెరిగిన ఓటర్‌ ప్రజాబాహుళ్యం ఓటింగ్‌ కేంద్రాల వద్ద భారీస్థాయిలో బారులు తీరి ఉండటం, ఓటింగ్‌ సరళి నింపాదిగా కొనసాగి పెక్కు చోట్ల దాదాపు 10–11 గంటలదాకా ఓటర్లు ఓపికతో ఓటును వినియోగించుకోవడం, ఎన్నికల అధికారులు ఓరిమితో శిక్షణాయుతంగా నిర్వహించడం ప్రశంసనీయం. అధికారపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలు అనే తేడాలేకుండా ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని కూడా మర్చిపోరాదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అయిదేళ్లుగా చేసిన అష్టావక్ర పనులూ, నియంతగా వ్యవహరించిన శైలి, సంక్షేమ పథకాల అమలులో పాటించిన కుల, మత, వర్గ, వర్ణ వివక్షలు చంద్రబాబు పతన దిశకు ప్రత్యేక లక్షణాలుగా నిలిచిపోతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓడిన మరుక్షణం చంద్రబాబును ఈ కృత్రిమ అలయెన్స్‌ అలాగే అక్కున చేర్చుకుంటుందని భావించడం మరోభ్రమ. 

చంద్రబాబు నాయకత్వాన్ని ఇప్పటికైనా మార్చుకోని టీడీపీకి ఇకనుంచి క్షయమే కానీ వృద్ధి అసలు ఉండదు. పైగా ఉనికినే కోల్పోతుంది కూడా. అవసర సమయాల్లో పార్టీ చుక్కాని పట్టేవాడిని ఆ నావను ఎటువైపు నడిపిస్తున్నాడో తెలుసుకుని ప్రశ్నించే హక్కును కోల్పోయిన టీడీపీ చోటామోటా నాయకుల శక్తియుక్తులు ఇప్పటికే ఉడిగిపోయాయి. శాసనసభను ప్రతిపక్షం బహిష్కరించి, ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజాబాహుళ్యాన్ని విస్తృతంగా చైతన్యవంతం చేయాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రధాన ప్రతిపక్షనేతకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తూ, రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కిన చంద్రబాబుకీ, స్పీకర్‌ కోడెలకూ తెలుసు. వెనుకటికొక మదించిన పాలకుడు రాజ్యాన్ని సున్నానికి తీసుకుంటానన్నాడట. గొప్ప త్యాగపురుషుడు మరి. పాలకుడికి హంసనడకలు రాకపోయినా ఉన్న కాకి నడకలూ మరిచిపోయాడట. అందుకే మన ఆధునిక కవి ఒకరు యుద్ధం ఇద్దరు పేదల మధ్య జరిగేది కాదన్న విషయం  పరస్పరం మోహరించే రాజకీయ వీరంగసాంగులకు ఇంకా బోధపడలేదని స్పష్టం చేస్తూ ఇలా అన్నారు.
 
‘‘ఆధునిక భారత గగన మందిరాలలో / మూలుగుతున్న చెలమచెలిమల (పేదోళ్ల) అలల ఘోష / ఇంకా పార్లమెంటు శిలాస్తంభాలకు/ వినిపించడం లేదు’’! అందుకే వినిపించే ఆ విప్లవాన్ని అంబేడ్కర్‌ ముందుగానే ఊహించారు సుమా!


-ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు(abkprasad2006@yahoo.co.in)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top