తనకు చేరువ అయ్యేదెలా?

తనకు చేరువ అయ్యేదెలా? - Sakshi

జీవన గమనం
నా ఫ్రెండ్ నాతో రెండేళ్లు స్నేహం చేసి, ప్రేమించి సడన్‌గా మాయమైపోవడం జరి గింది. తన నంబర్ పని చేయట్లేదు. అడ్రస్ తెలీదు. చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
 - పేరు లేదు, హైదరాబాద్

 
మీరు అబ్బాయో అమ్మాయో చెప్ప లేదు. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఆ అమ్మాయి ‘నాకు పెళ్లి నిశ్చయమైంది. నీతో స్నేహం ఆపుచేయదలుచుకున్నాను’ అని చెప్తే ఏం చేస్తారు? ‘పెళ్లయిన తర్వాత కూడా మనం స్నేహితులుగా ఉండొచ్చు కదా’ అని కన్విన్స్ చేస్తారు. బహుశా ఆమెకది ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కొందరు శాడిస్ట్‌లు పెళ్లయిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేయొచ్చు. ఇన్ని గొడవలెం దుకని ఆమె నంబరు కూడా మార్చేసి ఉండొచ్చు. పాజిటివ్‌గా ఆలోచించండి. ‘మీకన్నా తన తల్లిదండ్రులు ఎక్కువని అనుకోవడం వలనో, మిమ్మల్ని వదిలేసి ఇంకొకర్ని చేసుకుంటే తన జీవితం ఇంకా బాగుంటుందనో’ మీ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసింది. మీ ప్రియురాలు తృప్తిగా ఉండటం కన్నా మీకేమి కావాలి?

లేదా మీరు అమ్మాయి అనుకుందాం. తన తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వలనో లేదా ఇంకా ఎక్కువ కట్నం వస్తుందనో మిమ్మల్ని ఆ అబ్బాయి వదిలేశాడు. అడ్రసు మార్చేశాడు. అలా ప్రేమలో లాభనష్టాలు బేరీజు వేసుకునే వాడు దూరమైనందుకు సంతోషించాలి గానీ, బాధ ఎందుకు? మంచి స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలెయ్యడు. మిమ్మల్ని వదిలేసినవాడు మంచి స్నేహి తుడు కాదు. అటువంటి ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసినందుకు మీరు అదృష్టవంతులని అనుకోండి. ఈ విధంగా సానుకూల ఆలోచనాధోరణితో ఆలోచించడం మొదలుపెడితే మనసు తేలిక పడుతుంది.
 
నమస్తే సర్... నేనో విద్యార్థిని. ఇంతకు ముందు బాగానే చదివేవాడిని. కానీ ఈ మధ్య కాన్సన్‌ట్రేషన్ కుదరడం లేదు. మరో మూడు నెలల్లో పరీక్షలు. కానీ చదువుదామని ఎంత ప్రయత్నించినా పుస్తకంపై మనసు నిలవడం లేదు. సినిమాలు, రాజకీయ వార్తలు అంటూ వేర్వేరు విషయాల మీదకు ధ్యాస మళ్లిపోతోంది. ఇలా అయితే కచ్చితంగా  ఫెయిలవుతాను. పరిష్కారం సూచించండి.
 - సంజీవ్‌కుమార్, ఊరు రాయలేదు

 
ఏకాగ్రత రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నో ఇంటరెస్ట్,  అదర్ ఇంటరెస్ట్. మొదటిది: చిన్నతనం నుంచీ అసలు చదువుమీదే ఇంటరెస్ట్ లేక పోవటం. ఇలాంటి వారిని మార్చటం కష్టం. కానీ ఒక ప్పుడు బాగా చదివేవాణ్ని అంటు న్నారు కాబట్టి, మీ సమస్యకి కారణం బహుశా రెండోదయి ఉంటుంది. అంటే... చదువు మీద ఉత్సాహం ఉన్నా సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్లు మొదలైనవాటిపై ఇటీవలి కాలంలో అంతకన్నా ఎక్కువ ఉత్సాహం పెరగటం.

ఇంకో మూడు నెలల్లో పరీక్షలు అంటున్నారు కాబట్టి, ఈ మూడు నెలలూ కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. స్నేహితులతో మాట్లాడే కాలాన్ని రోజుకి అరగంటకి కుదించండి. టీవీ, సినిమా మిగతా ఆసక్తికరమైన, ఉపయోగం లేని విషయాల్ని పూర్తిగా దూరం పెట్టండి. తెల్లవారుజామున లేచి చదవటం ఒక మంచి పద్ధతి. మూడు నెలలపాటు ఇలా చేస్తే మీకు చదువు కోవటంలో ఉండే నిజమైన ఆనందం అర్థమవుతుంది.
 
నేను ఎంబీయే పూర్తిచేసి మూడేళ్లపాటు ఉద్యోగం చేశాను. పెళ్లయ్యాక మానేశాను. ప్రతిక్షణం మావారితోనే గడపాలనుకున్నాను. కానీ ఎందుకో తను నన్ను దగ్గరకు రానివ్వడు. పైగా ప్రతి విషయం వాళ్ల అమ్మతో షేర్ చేసు కుంటాడు. నేనేదైనా మాట్లాడినా, ‘అలా కాదు ఇలా’ అని చెప్పినా వెంటనే వెళ్లి వాళ్ల అమ్మకు చెప్పేస్తాడు. అయినా ఏదో ఒక రకంగా చేరువ కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాతో తనకి ఏదైనా సమస్య ఉందేమో చెప్పమన్నా చెప్పడు. ఈ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పెళ్లికి ముందు ఎంతో హుషారుగా, ధైర్యంగా ఉండేదాన్ని. చాలా దిగులుగా ఉంటోంది. బతకాలనే అనిపించడం లేదు. నేనీ సమస్య నుంచి ఎలా బయటపడాలి?
 - పావని, ఊరు రాయలేదు

 
ఇటువంటి సమస్యలతో కౌన్సిలర్ దగ్గరికి వచ్చేవారు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువవుతున్నారు. ఇది దురదృష్ట కరమైన విషయం. అమ్మకూచితనం కానీ, వివాహత్పూర్వ ప్రేమ వ్యవహారం కానీ, జీవితంలో ప్రేమ కన్నా వృత్తి ముఖ్యమనే ఆలోచనా విధానం కానీ కొంతమంది పురుషులని ఈ రకంగా మారుస్తోంది. మీరు చెప్పినదాన్ని బట్టి ఆయన కౌన్సిలర్ దగ్గరకు రావటానికీ ఒప్పుకోరు. ఆయన మనసులో ఏముందో తెలుసు కుంటే తప్ప ఈ సమస్యకి పరి ష్కారం చెప్పడం కష్టం.

ఆయనకి తన అమ్మగారంటే ప్రేమాభిమానాలు ఎక్కు వని రాశారు కాబట్టి అట్నుంచి ప్రయత్నించి చూడండి. ఆమె ద్వారా విషయాన్ని రాబ ట్టండి. మీకూ ఆమెకూ సంబంధాలు సరిగా లేని పక్షంలో ఆయన మీకు దూరంగా ఉండటానికి అది కూడా కారణమై ఉండొచ్చు. మీకు దగ్గర్లో ఉన్న కౌన్సిలర్‌ని సంప్రదించి, ఇంకా వివరంగా చెప్తే తప్ప ఇలాంటి సమస్యలకి పరిష్కారం కష్టం.                         
 
- యండమూరి వీరేంద్రనాథ్

మీకూ ఒక ప్రశ్న ఉందా? అయితే మాకు రాయండి. యండమూరి మీకు సమాధానం ఇస్తారు. మా చిరునామా: జీవన గమనం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top