అజ్ఞాతవాసం: ‘నేహా’లంతా ఏమయ్యారో! | Where are Neha Oberoi, Neha bamb and Neha julka actresses? | Sakshi
Sakshi News home page

అజ్ఞాతవాసం: ‘నేహా’లంతా ఏమయ్యారో!

Apr 27 2014 1:08 AM | Updated on Sep 2 2017 6:33 AM

అజ్ఞాతవాసం: ‘నేహా’లంతా ఏమయ్యారో!

అజ్ఞాతవాసం: ‘నేహా’లంతా ఏమయ్యారో!

ఆ ముగ్గురి పేరూ ఒక్కటే. ముగ్గురికీ యువ హీరోల పక్కన మంచి అవకాశాలే వచ్చాయి. ముగ్గురూ కెరీర్‌లో దూసుకుపోతారని అందరూ అనుకున్నారు. తామకు ఎక్కడికో వెళ్లిపోతామని వాళ్లూ అనుకున్నారు.

ఆ ముగ్గురి పేరూ ఒక్కటే. ముగ్గురికీ యువ హీరోల పక్కన మంచి అవకాశాలే వచ్చాయి. ముగ్గురూ కెరీర్‌లో దూసుకుపోతారని అందరూ అనుకున్నారు. తామకు ఎక్కడికో వెళ్లిపోతామని వాళ్లూ అనుకున్నారు.  కానీ కన్నుమూసి తెరిచేలోగా అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడా ముగ్గురూ మన దగ్గర లేరు. మన ముందుకు రావడమూ లేదు.  అసలు అవకాశాలు రావడమే కష్టం అనుకునే పరిశ్రమలో, అవకాశాలు వచ్చి కూడా ఎదగలేకపోయిన ఆ ముగ్గురూ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?  
 
 నేహా ఒబెరాయ్
 ‘అతి మెత్తని మనసును గిల్లి... నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ’ అంటూ పవన్ కళ్యాణ్‌ని చూసి పాటేసుకుంది ఈ చిన్నది ‘బాలు’ సినిమాలో. మొదటి అవకాశమే పవన్ కళ్యాణ్‌తో అంటే ముందు ముందు ఎన్ని చాన్సులు కొట్టేస్తుందో అనుకున్నారంతా. కానీ ఆ సినిమా తరువాత నేహా తెలుగులో కనిపించిందే లేదు.
 
 ముంబైలో పుట్టిన నేహా... బాలీవుడ్ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కూతురు. మోడలింగ్  మీద మనసు పారేసుకుని, యాడ్ రంగంలో దూసుకెళ్లాలని కలలు కంటున్న సమ యంలో ‘బాలు’ (2005) చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించే అవకాశం దొరికింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. సంవత్సరానికొకటి చొప్పున బ్రహ్మాస్త్ర, దస్ కహానియా, ఉడ్‌స్టాక్ విల్లా చిత్రాలు చేశాక, ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షాని పెళ్లాడింది. కాస్త గ్యాప్ తర్వాత ‘ఆస్‌మాన్’ చిత్రంలో నటించింది. అంతే... నాటి నుంచి నేటి వరకూ మళ్లీ తెరమీద మెరిసింది లేదు. మెరిసే సూచలూ కనిపించడం లేదు. ప్రస్తుతం నోయిడాలోని ‘ఏషియన్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్  టెలివిజన్’లో సభ్యురాలిగా ఉందని సమాచారం.  
 
 నేహా బామ్బ్
 2003లో నితిన్ ‘దిల్’ని కొల్లగొట్టిన ఈ సుందరాంగి... అంతకుముందే ‘ఇష్క్ హోగయా మైనూ’ అనే సినిమాలో నటించింది. కానీ పెద్దగా పేరు రాలేదు. అంతలో వీవీ వినాయక్ పిలిచి ‘దిల్’లో చోటిచ్చాడు. ఆ సినిమా హిట్ కావడంతో ఆ వెంటనే అతడే ఒక సైన్యం, దోస్త్ సినిమాలు చేసింది. అయితే... అక్కడితో హీరోయిన్‌గా ఆమె కెరీర్‌కి బ్రేక్ పడిపోయింది. రెండేళ్ల పాటు మాయమైపోయింది. తర్వాత మళ్లీ ‘బొమ్మరిల్లు’లో ప్రత్యక్షమయ్యింది. ‘నాన్నగారు చెప్పారండీ’ అంటూ అమాయకంగా కనిపించే గెస్ట్ రోల్‌లో మెప్పించింది.
 
  కానీ అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేకపోయింది. బాలీవుడ్ వెళ్లి ‘పంజాబీ కుడీ’ చేసినా, తిరిగి టాలీవుడ్‌కి వచ్చి ‘దుబాయ్ శీను’లో మరోసారి అతిథిలా కనిపించినా ఫలితం లేకపోయింది. ఇక వెండితెర మీద వెలగలేనని అర్థమైపోయిందో ఏమో... బుల్లితెర వైపు పయనం సాగించింది. వరుసగా ఓ నాలుగు సీరియల్స్ చేసింది. రిషిరాజ్ ఝవేరీ అన్న వ్యక్తిని పెళ్లాడిన నేహ... బుల్లితెర మీద కూడా పెద్దగా కనిపించడం లేదు. మరి ఏం చేస్తోందో ఏమో!
 
 నేహా జుల్కా
 నవ్వినప్పుడు బుగ్గన పడే సొట్టలు, చిన్నవిగా అయిపోయే కళ్లు నేహా జుల్కా ప్రత్యేకతలు. హుషారుగా, ఎగసిపడే అలలా ఉండే ఆమె కెరీర్ పరవళ్లు తొక్కే నదిలా వేగంగా సాగిపోతుందనుకున్నారంతా. అనుకున్నట్టుగానే ఒక్క సంవత్సరంలో మూడు సినిమాలు చేసింది. కానీ అవకాశాలు వచ్చినంత వేగంగా అదృష్టం కలసి రాలేదు. అందుకే వెనకబడిపోయింది. మరుసటేడుకి కనుమరుగైపోయింది.
 
 2007లో ‘ఒక్కడున్నాడు’లో గోపీచంద్ సరసన నటించింది నేహా, గౌతమి పాత్రను బాగానే పండించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడం ఆమెను నిరుత్సాహపర్చింది. తర్వాత ‘వియ్యాలవారి కయ్యాలు’లో ఉదయ్ కిరణ్‌తో చేసింది. ఆ సినిమా కూడా పరాజయాన్నే చవిచూసింది. దాంతో తెలుగులో నేహా ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పడింది. వెంటనే బాలీవుడ్‌కి వెళ్లిపోయి ‘కైసే కహే’లో నటించింది. అక్కడా దురదృష్టమే వెంటాడింది. కనీసం సీరియల్స్‌లోనయినా వెలుగుదామని ప్రయత్నించింది కానీ అక్కడా నిరాశే మిగిలింది. 2010 తరువాత అసలు కనిపించడమే మానేసింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement