యథా దృష్టి తథా సృష్టి

Weekly Telugu Short Story In Sakshi Funday

ఈవారం కథ

చుట్టూ చెట్ల మధ్యలో వశిష్ట్రాశమంలా ‘విశాఖపట్నం మున్సిపల్‌ హై స్కూల్‌’ ప్రశాంతంగా ఉంది. అప్పటికే సగం మంది టీచర్లు, పిల్లలు దసరా సెలవులకని ఊర్లకెళ్ళిపోవడంతో చాలా సెక్షన్లు కలిపేశారు. అలా జనరల్, కాంపోజిట్‌ మ్యాథ్స్‌ సెక్షన్లు కలిపేసిన  ఓ క్లాస్‌లో మాస్టారు  ‘‘పిల్లలూ, లెఖ్ఖల్లో ఈ జనరల్, కాంపోజిట్‌  సిస్టం ఈ ఏటితో ఆఖరు. మీదే లాస్ట్‌ బ్యాచ్‌. అంచేత అందరూ ఎలాగోలా కష్టపడి గట్టెక్కేయండి. ఈ లాస్ట్‌ పీరియడ్‌లో  పాఠాలు లేవు కాబట్టి ఒక్కొక్కరూ లేచి పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పండి. ఒరేయ్‌ శివా, నువ్వు కాంపోజిట్‌లో క్లాస్‌ ఫస్ట్‌ కాబట్టి నీతో మొదలు పెడదాం. పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావో చెప్పు?’’  అన్నారు. 
వెంటనే శివ లేచి దండకట్టుకుని ‘‘సర్, నేను టెన్త్‌ తర్వాత పాలిటెక్నిక్‌ చదివి పెద్దయ్యాక రైల్వే డ్రైవర్‌ అవుదాం అనుకుంటున్నా’’  అన్నాడు.   
 ‘‘వెరీ గుడ్‌. అలా అనుకోడానికి  ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా?’’ అడిగారు టీచర్‌ కుతూహలంగా.  చెప్పొచ్చో చెప్పకూడదో  అన్నట్టు ఒక్క క్షణం ఆగి, మాస్టారు మరోసారి అడిగేసరికి  శివ చెప్పడం మొదలు పెట్టాడు...

‘‘సర్, మా వూర్లో ఒకే ఒక్క ట్రైన్‌ అదీ ఒక్క  నిమిషం మాత్రమే ఆగుతుంది. ఓ రోజు మా నాన్న ట్రైన్‌ కదిలిపోతున్న కంగారులో రిజర్వేషన్‌ లేకుండా ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌ మెంట్‌లో ఎక్కేసాడు. టి.సి వచ్చి బలవంతంగా మధ్య స్టేషన్‌లో దింపేసాడు. మళ్ళీ జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ ఎక్కేలోగా ట్రైన్‌ వెళ్లిపోవడంతో మా నాన్న ఆరోజు నలభై కిలోమీటర్లు నడిచాడట. జీవితంలో ఒక్కసారైనా ఆ ఫస్ట్‌ క్లాస్‌ పెట్టెలో దర్జాగా ప్రయాణం చెయ్యాలని మా నాన్న కోరిక. ఆ రైలు నేనే నడపాలని నా కోరిక. అందుకే నేను పెద్దయ్యాక రైల్వే డ్రైవర్‌ అవ్వాలనుకుంటున్నా’’  అన్నాడు ఎమోషనల్‌గా.
‘‘వెరీ గుడ్‌ . ఇప్పుడు జనరల్‌ మ్యాథ్స్‌  నించి. ఆ ఆఖరి బెంచిలో కూర్చుని కిటికీలోంచి దిక్కులు చూస్తున్నవాడెవడ్రా ..లేచి నించో ..నీ పేరేమిట్రా?’’ అడిగారు మాస్టారు.
 ‘‘సర్‌ నా పేరు వెంకటరమణ.’’  చెప్పాడా కుర్రాడు. 
 

‘‘ఆ రమణా! చెప్పరా  పెద్దయ్యాక నువ్వేమవుదాం అనుకుంటున్నావు?’’
అడిగింది తన మాస్టారు కాకపోవడంతో రమణ కొంచెం నిర్లక్ష్యంగా చెప్పాడు.
 ‘‘సర్, నాకు చదువు మీద అస్సలు ఇంటరెస్ట్‌ లేదు. ఎలాగోలా టెన్త్‌ అవగొట్టరా, ఎవరో ఒకర్ని పట్టుకుని  చిన్నో చితకో గవర్నమెంట్‌ ఉద్యోగం వేయిస్తాను ఆపైన నా వ్యాపారం చూసుకో చాలు అన్నాడు సర్‌ మా నాన్న. ఒక్క లెఖ్ఖల్లోనే కొంచెం వీక్‌ సర్‌ . అది కూడా పాస్‌ అయిపోతే నా చదువు అయిపోయినట్టే. జీవితం లో స్థిరపడిపోయినట్టే’’ అన్నాడు ఉత్సాహంగా.  
దానికి మాస్టారు ‘‘అదేమిట్రా..నీకంటూ ఏమీ లక్ష్యం లేదా ?’’ అడిగారు  ఆశ్చర్యంగా. దానికి రమణ ‘‘సర్, ఇందాకలా శివ వాళ్ళ నాన్న కోసం రైల్వే డ్రైవర్‌ అవుతానంటే వెరీగుడ్‌ అన్నారు. నేను కూడా మా నాన్న కోరిక ప్రకారం టెన్త్‌ పాస్‌ అయితే చదువు ఆపేస్తానంటే తప్పంటున్నారు. ఇదెక్కడి న్యాయం సర్‌ ?’’  అనగానే క్లాస్‌ మొత్తం గొల్లుమన్నారు.  
మాస్టారు వెంటనే ‘‘సరే, సరే, అలాగే కానీ, నీకు లెఖ్ఖల్లో ఏమైనా అనుమానాలుంటే  శివ  దగ్గర నేర్చుకో’’  అంటూ ఉండగా బెల్లు  మ్రోగింది. పిల్లలంతా ఇళ్ళకెళ్ళిపోయారు.   
∙∙ 
చుట్టూ నోట్లకట్టలు, మధ్యలో మనీ ప్లాంట్‌లా  లగ్జరీ  అపార్ట్‌మెంట్‌ల మధ్యలో ఓ చిన్న పార్క్‌తో ఆ ఏరియా పోష్‌ గా ఉంది. సెల్లార్‌లో పాలరంగులో ఉన్న ఇన్నోవా కారుని పనసతొన రంగు పెట్రోల్‌ క్లాత్‌ నీళ్ళల్లో తడిపి నీట్‌గా తుడుస్తున్నాడు శివ. చిరిగిన కాలరు, అరిగిన చెప్పులు, మాసిన గెడ్డం,  నైరాశ్యపు కళ్ళు, నవ్వుకు నోచుకోని పెదాలు, వెరసి కష్టాలకి కస్టోడియన్లా ఉన్నాడతను. తడిగుడ్డ పక్కన పెట్టి పొడిగుడ్డ తీస్తుండగా అతని ఫోన్‌ మోగింది. తన ఫోన్‌ ఎప్పుడు రింగ్‌ అయినా అతను ఉలిక్కిపడతాడు. ఎందుకంటే అతనికొచ్చే ప్రతీ కాల్‌ అతని ఖాళీ జేబుని ఎత్తిచూపేవే. ఫోనెత్తితే స్కూల్‌ నించి టెన్త్‌  చదువుతున్న కొడుకు  ‘‘ఫీజు కట్టలేదని క్లాస్‌ బయట ఎండలో నిలబెట్టారు నాన్నా, నువ్వు అర్జెంటుగా రా’’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తున్నాడు. అలవాటైన ఆపదే అవడంతో ఓ సారి నిట్టూర్చి, ‘‘నీకు తెలుసు కదరా, పోయిన్నెల నా కంటాపరేషన్‌  వల్ల కట్టలేకపోయాం. వాళ్ళకి  చెప్పు నాన్నా, రెండు మూడు రోజుల్లో కట్టేస్తామని’’ అన్నాడు శివ. 
 ‘‘ఎంత చెప్పినా వినట్లేదు నాన్నా. ఇప్పటికే నాలుగు టర్ములు పెండింగ్‌ ఉన్నాయట. కనీసం రెండైనా కట్టకపోతే వీల్లేదంటున్నారు’’ అన్నాడు కొడుకు. ఈలోపు అవతల్నించి ఫోన్‌ లాక్కుని ఎవరో చెపుతున్నారు....

‘‘ఏవయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి. ఏదో  ఐదేళ్లనించి ఇక్కడే చదివిస్తున్నారు కదా అని ఓపిక పడుతూ ఉంటే, మరీ నైన్త్‌ క్లాస్‌లో రెండు టరమ్స్‌ టెన్త్‌ లో రెండు టరమ్స్‌ డ్యూ ఉన్నాయి. ఈరోజు ఫీజు కట్టి మీ పిల్లాడ్ని తీసుకెళ్లండి’’ అంటూ విసురుగా ఫోన్‌ పెట్టేసాడు.   
ఇంతలో లిఫ్ట్‌లో వెంకట్‌ దిగాడు. గ్రే కలర్‌ సఫారీ సూట్, గోల్డ్‌ ఫ్రేమ్‌ కళ్లద్దాలు, వేళ్ళకి తలా నాలుగేసి బంగారం, వెండి, ఉంగరాలు, ఎడమ చేతికి గోల్డ్‌ వాచ్, కుడి చేతికి  బ్రేస్‌ లెట్‌–వెరసి పార్వతి దేవి సున్నిపిండితో వినాయకుణ్ణి తయారుచేసినట్టు లక్ష్మీదేవి స్వయానా సిరిసంపదలతో  చేసిన  ముద్దుబిడ్డలా ఉన్నాడు. గబ గబా అతని చేతిలో సూట్‌ కేస్‌ అందుకుని, కారు డోర్‌ తెరిచి పట్టుకుని, అతను ఎక్కాక, సూట్‌ కేసు ఫ్రంట్‌ సీట్‌లో పెట్టి, కార్‌ స్టార్ట్‌ చేసాడు శివ.  కారులో ఉండగా వెంకట్‌ కొడుకు ఫోన్‌ చేసాడు. లేటెస్ట్‌ వెర్షన్‌  ఐ ఫోన్‌ ఎత్తి ‘‘చెప్పు నాన్నా ..’’ అన్నాడు మురిపెంగా.

 ‘‘డాడ్, ఈరోజు ఫ్రెండ్‌ షిప్‌ డే కదా, ఈవెనింగ్‌ స్కూల్‌ తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ ఉంది. గూగుల్‌ పే లో ఫైవ్‌ కె ట్రాన్స్‌ఫర్‌ చెయ్యండి  ప్లీజ్‌’’ అన్నాడు అవతల్నించి కొడుకు.  
‘‘ఓకే  నాన్నా ఇప్పుడే చేస్తా. బై’’  అంటూ ఫోన్‌  పెడుతూనే  కొడుక్కి పదివేలు పంపించి అవతల్నించి– ‘‘థాంక్యూ డాడ్‌’’ మెసేజ్‌ చూసి ఎందుకో చెమర్చిన కళ్ళు తుడుచుకుని  శివ వైపు చూసి ‘‘ ఏరా శివా నీ కళ్ళల్లోంచి నీరెందుకు కారుతోంది, ఈ మధ్యేగా కంటాపరేషన్‌ అని సెలవు కూడా తీసుకున్నావు ?’’ అడిగాడు అనుమానంగా.  
‘‘అబ్బే అదేం లేదు సర్, కంట్లో ఏదో  పడిందంతే. ఆపరేషన్‌ చేయించాను సర్‌.’’  అన్నాడు శివ కళ్ళు తుడుచుకుంటూ.  
∙∙ 
అది లోకల్‌ గవర్నమెంట్‌ ఆఫీస్‌.  వెంకటరమణ  అందులో రికార్డు అసిస్టెంట్‌.  అదే ఊళ్ళో పుట్టి పెరగటం వల్ల అతనికి కొంచెం పలుకుబడి ఎక్కువ. ఆ ఆఫీస్‌కి సంబంధించిన పి.ఆర్, ప్రోటోకాల్‌  అంతా తనే చూస్తాడు. అందుకే అతనికి డెస్క్‌ పని ఏదీ అప్పజెప్పరు. రోజులో ఎక్కువ సమయం బయటే ఉంటాడు.  పన్లో పనిగా అతనికున్న ఫైనాన్స్‌ వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది. ఆఫీస్‌కి చేరగానే, వెంకట్‌ లోపలికి వెళ్లి అటెండన్స్‌ రిజిస్టర్‌లో సంతకం పెట్టి, బాస్‌కి ఓ నమస్కారం పెట్టి, మళ్ళీ బయటకొచ్చి కారెక్కి కలెక్షన్‌కి బయలుదేరాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లి భోంచేసి ఓ గంట పడుకున్నాడు. ఇంతలో శివ తన క్యారేజ్‌  కారులోనే కూర్చుని తినేసి, మళ్ళీ డ్యూటీకి రెడీ అయ్యాడు.

మూడయ్యాక వెంకట్‌ లేచి, మొహం కడుక్కుని,  టీ తాగి, మళ్ళీ ఆఫీస్‌ కెళ్ళి సంతకం పెట్టి ముందురోజే  చేసేసిన  పనులు తాలూకు వివరాలు, పెండింగ్‌ పనుల ప్రోగ్రెస్‌  బాస్‌కి తెలియజేసి, ఐదవగానే  గుడ్‌ నైట్‌ చెప్పి బయటపడి, మళ్ళీ కలెక్షన్‌ పని చూసుకుని, దార్లో ఆఫీస్‌ పనులు రెండు మూడు ఫోన్‌లోనే పూర్తిచేసి, ఏడయ్యాక  క్లబ్‌కి వెళ్ళాడు. తొమ్మిదివరకు పేకాడి, పదివేలు పోగొట్టుకుని, మరో గంటలో మూడో పెగ్గు కూడా ముగించి, మళ్ళీ కారెక్కి, ఇంటిదగ్గర దిగేటప్పుడు శివకి ఓ వందిచ్చి, ‘‘రేప్పొద్దున్నే అన్నవరం వెళ్ళాలి, అయిదుకల్లా వచ్చేయ్‌’’ అని చెప్పి కారు దిగబోయి తూలాడు. వెంకట్‌ని, లక్షన్నర వరకూ కాష్‌ ఉన్న సూట్‌ కేస్‌ని  ఇంటి వరకూ తీసుకొచ్చి, అతని భార్యకి భద్రంగా అప్పజెప్పి, ఇంటికెళ్లి చల్లారిపోయిన అన్నం తిని, అప్పటికే ఏడ్చి ఏడ్చి పడుకున్న కొడుకుని నిద్దట్లోనే ముద్దాడి, వంటింటి చప్పుళ్ల ద్వారా భార్య తెలిపే నిరసనల్ని ఎప్పట్లాగే భరించి, ఏ రెండుకో పడుకున్నాడు శివ.
∙∙ 
ఆ మర్నాడు ఉదయాన్నే అయిదుగంటలకల్లా కారు తాళం తీసుకుని శుభ్రం చేసి, ముందురోజే కొన్న పూలదండ కార్లో ఉన్న దేవుడిబొమ్మకి  పెట్టి రెడీగా ఉన్నాడు శివ. ఆరుంపావుకి పట్టుపంచె, తెల్లటి చొక్కాలో వెంకట్, పట్టుచీరలో అతని భార్య పద్మజ దిగారు. ఇద్దరూ సర్దుకుని కూర్చున్నాక, జెంటిల్‌గా డోర్‌ మూసి, వచ్చి కూర్చుని సీటుబెల్ట్‌ పెట్టుకుని కారు స్టార్ట్‌ చేసాడు శివ. 
కారు పోర్ట్‌ రోడ్‌ మీదుగా గాజువాక దాటింది. వెంకట్‌ పేపర్‌ చదువుతున్నాడు. రాత్రి బాగా లేటవడంతో కళ్ళు మూతలుపడుతున్నాయి.
‘‘ఏం శివా? మీ అబ్బాయి స్కూల్‌ ఫీజు కట్టలేదని చెప్పింది మీ ఆవిడ. కట్టేవా?’’ అడిగింది పద్మజ. శివ భార్య పద్మజకి జాకెట్లు కుడుతూ ఉంటుంది.
 ‘‘ఇంకా లేదమ్మా. ఓ పదిరోజుల్లో ఏర్పాటవుతుంది. అంతవరకు ఇంటిదగ్గరే చదువుకుంటున్నాడు’’  అన్నాడు శివ రోడ్డు  కేసి చూస్తూ.  

‘‘అంతంత ఫీజులు కట్టలేనప్పుడు హాయిగా గవర్నమెంట్‌ స్కూల్‌లో జాయిన్‌ చేయొచ్చుగా. ఇక్కడ మాత్రం ఏమంత గొప్పగా చెప్పేస్తున్నారు. పంతానికి తప్ప’’ అన్నాడు వెంకట్‌ పేపర్‌ చదువుతూ.  
శివ చేతులు స్టీరింగ్‌కి గట్టిగా బిగుసుకున్నాయి. అదిచూసి పద్మజ వెంకట్‌ని ఇంకాపమన్నట్టు చేత్తో తట్టింది.  వెంకట్‌ పేపర్‌ మూసేసి, ‘‘ఇప్పుడు నేనేమంత తప్పుమాట అన్నాను. ఎవరికి ఎంత రాసుంటే అంతే.  రేప్పొద్దున్న మన కొడుకు ఫారిన్‌లో చదువుతానంటే మనదగ్గర డబ్బుంటే చదివిస్తాం. లేదంటే ఇక్కడే చదువుకోరా అంటాం’’ అన్నాడు స్థిరంగా.
అంతే, గాలెక్కువైన బెలూన్‌ పేలినట్టు, పులుపు తగిలిన పాలు విరిగినట్టు, శివ స్టీరింగ్‌ గట్టిగా పట్టుకుని డ్రైవ్‌ చేస్తూనే మొదటిసారి సమాధానం చెప్పాడు:
 

‘‘సర్, నిజమే ప్రైవేట్‌ స్కూల్‌ లో అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ మీబోటోళ్ళు అక్కడే  జేర్పించి, మీ పిల్లలు రాజాలా తిరుగుతూ ఉంటే అది చూసి అక్కడ చదివితేనే బాగా వృద్ధిలోకొస్తారేమో అని ఆశతో మేము కూడా తినో తినకో అక్కడ చదివించడానికి తాపత్రయం పడుతున్నాము’’ అన్నాడు.  దాంతో ఖంగుతిన్న వెంకట్, ‘‘మాకేం అవసరం? అయినా మేమేమీ ఎవరి సొమ్మూ అన్యాయంగా పడేసుకోలేదు.  కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. పైగా కొంతమందికి ఉద్యోగాలిచ్చే అన్నం పెడుతున్నాం’’అన్నాడు ‘కొంతమంది‘ అన్న పదం నొక్కి పలుకుతూ. 
దానికి శివ  ‘‘అయ్యా, వెంకటరమణ గారు, వంద వ్యాపకాల్లో మీరు గతం మర్చిపోవచ్చు. కానీ నాకున్న వంద సమస్యలకీ డబ్బే కారణమైనప్పుడల్లా నాకు గుర్తొస్తూనే ఉంటుంది. నా చిన్నప్పుడు నేను క్లాస్‌ ఫస్ట్‌.  రైల్వేలో డ్రైవర్‌ అవ్వాలన్నది నా కల. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ కూడా నేనే టాపర్‌.  సెకండ్‌ ఇయర్‌లో ఉండగా మా నాన్న మందెక్కువయ్యో, వయసైపోయో చావలేదు. దోమ కుట్టి సెరిబ్రల్‌ మలేరియా వచ్చి, సరైన సమయంలో వైద్యం అందక, ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యానికి డబ్బు లేక చచ్చిపోయాడు.

నా కుటుంబ భారాన్ని మొయ్యడానికి నేను చదువు మానేసి ఇలా కారు డ్రైవర్‌గా చేరవలసి వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే దోమలు మా ఇంట్లోనే ఎందుకుంటాయి? అప్పటివరకు లెఖ్ఖల్లో నూటికి ఇరవైకి మించని మీకు పదో తరగతి ఫైనల్‌ పరీక్షలో ముప్పై మార్కులు ఎలా వచ్చాయి? మాస్టారు చెప్పారని నేను రోజూ స్కూల్‌ అయిపోయాక ఓ గంట కూర్చుని మీకు అర్ధం అయ్యేలా చెబితేనే కదా.  ఆ సంవత్సరం  ఐదు మార్కులు మోడరేషన్‌ ఇవ్వటం వల్ల కదా మీరు టెన్త్‌  పాసై గవర్నమెంట్‌ ఉద్యోగంలో చేరేరు. అదే ఉద్యోగం టెన్త్‌ డెబ్బై ఐదు శాతం మార్కులతో పాస్‌ అయిన నాకొచ్చిండుంటే మీ వ్యాపారంతో మీరు, మీ అంత కాకపోయినా, ఏదో  నేను, నా కుటుంబం కూడా హాయిగా గడిపేవాళ్ళం కదా?’’ అంటూ ఉండగా...వెంకట్‌ మధ్యలో  ‘‘అందుకే కదా, నీకు పిలిచి ఉద్యోగం ఇచ్చింది. ఊరంతా డ్రైవర్లకి నెలకి ఎనిమిది వేలకంటే ఎక్కువ ఇవ్వట్లేదు. నేను మాత్రం నీకు పదివేలిస్తున్నా. పైగా రోజూ ఎంతో కొంత బేటా ఇస్తున్నా. నా ఆస్తిలో వాటా రాసి ఇవ్వలేను, నీ అప్పులు, నీ బాధలు తీరుస్తూ పోలేను కదా.’’ అన్నాడు.  
 శివ మౌనంగా ఉండిపోయాడు. దాంతో వెంకట్‌ ఇంకొంచెం కఠినంగా  ‘‘ఎవరో అన్నట్టు నీ ఆకలి మాత్రమే తీరి అవసరాలు తీరకపోతేనే కదా నువ్వు రేపు పన్లోకోస్తావు. ఇందులో  నా మీద పడి ఏడవటానికేముంది?’’  అన్నాడు. 
దానికి శివ  ‘‘అయ్యా, ఒకడి  కంచానికి మించినదేదైనా పక్కవాణ్ణి పస్తుంచేదే’’ అని కూడా అన్నారు. 
‘‘అది మీకు తెలియదా?’’  అన్నాడు అంతే ఆవేశంగా.   
కారు స్టీల్‌ ప్లాంట్‌ లోంచి వీళ్ళ ఆర్గుమెంట్‌లా కాకుండా సాఫీగా పోతోంది. ప్రగతీ–పచ్చదనం సవతుల్లా కాకుండా అక్కాచెల్లెళ్లలా సఖ్యతగా కూడా ఉండొచ్చని స్టీల్‌ ప్లాంట్‌లో అటూ ఇటూ దట్టంగా పరుచుకున్న చెట్లు నిరూపిస్తున్నాయి.  

కాసేపు మౌనం తర్వాత శివ నెమ్మదిగా అన్నాడు. ‘‘అరిటాకు చిరగడానికి ముల్లే అవసరం లేదు. చుట్టూ ఉన్న గాలి చాలు. అలాగే మేం కిందా మీదా ఐపోడానికి కొండంత  కష్టాలే రానఖ్ఖర్లేదు. నెలకొకరికి జ్వరం, మూణ్ణెల్లకో పండగ, ఏటా పెరిగే స్కూల్‌ ఫీజులు చాలు. మాలాంటివాళ్ళకి పదిరూపాయలకి తక్కువ వడ్డీకి ఎక్కడా అప్పు పుట్టదు. బ్యాంకుల్లో అడుగుదామంటే తాకట్టు పెట్టడానికి మా దగ్గర మెట్టెలు, మట్టుగిన్నెల కంటే విలువైనవేవీ ఉండవు. ఎవరికైనా వడ్డీ లేకుండా అప్పిస్తే అది సాయం. రూపాయి వడ్డీకి అప్పిస్తే అది న్యాయం. అదే పదిరూపాయల వడ్డీ కిస్తే అది....గాయం. అది ఎప్పటికీ మానదు, మమ్మల్ని మనఃశాంతిగా బతకనివ్వదు.  

‘‘మీకు గుర్తుందో లేదో. మా మావయ్యకి రెండెకరాల పొలం ఉండేది. వచ్చిన పంటతో తన కుటుంబం గడిచిపోయేది. మేనల్లుడు–అల్లుడు అన్న అభిమానంతో ఏదో మాకూ ఇంత పంటబియ్యం ఇచ్చేవాడు.    కరువొచ్చో, కట్నం చాల్లేదని రెండో కూతురు తిరిగొచ్చో, ఆ పొలాన్ని మీకు అమ్మేశాడు. మీరు దాన్ని ఓ ఏడాదిలో మూడు రెట్లకి ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి అమ్మేసారు. వాళ్ళు సెంట్లు లెక్కన కొన్న పంట భూమిని గజాల్లెఖ్ఖన లే అవుట్‌ వేసి అమ్మేసారు. ఇది జరిగి పదిహేనేళ్ళయ్యింది. ఇప్పటికీ ఆ లేఅవుట్‌ తుప్పలు, పొదలతో అలాగే ఉంది. మా మావగారిప్పుడు అందులో నెలకి ఆరువేల జీతానికి వాచ్‌మాన్‌గా పనిచేస్తున్నాడు. వ్యవసాయం చేస్తే ఏడాదికి రెండెకరాలమీద డెబ్భైరెండు వేలెక్కడొస్తోంది? ఇప్పుడే నయం కదా! అంటే మేమేం చెప్పాలి?’’
‘‘సర్, వందనోటు మీద అందరికీ ఒకటే ప్రామిస్‌ ఉంటుంది. కానీ దాని విలువ ఉన్నవాడికి పది, లేనివాడికి పెన్నిధి. నిన్నటి రోజు  అదే పదివేలు లేక నా కొడుకు ఎండలో కాళ్ళు కాలిపోతూ క్లాస్‌ బయట నించున్నాడు. మీ కొడుకు పార్టీ చేసుకున్నాడు. నేను రోజుకి పద్దెనిమిది గంటలు మీ సేవలోనే ఉంటున్నాను కానీ నా కొడుకుని కనీసం పద్దెనిమిదేళ్ళు వచ్చేవరకైనా చదివించలేకపోతున్నాను. మనిషన్న ప్రతీవాడూ మంచిరోజులు వస్తాయని ఆశపడతాడు. నా విషయంలో మాత్రం అవి కనీసం ఎండలో రోడ్డుమీద దూరంగా కనిపించే మరీచికలా కూడా కనబడ్డం లేదు. ఇందులో నా తప్పెంత ?’’ అన్నాడు శివ ఆవేశంగా.

‘‘నా తప్పు కూడా లేదు కదా శివా?’’ ఈసారి కొంచెం సాంతంగా అడిగాడు వెంకట్‌. 
కారు గోకివాడ –కొత్తూరు మధ్యలో ఉన్న బ్రిడ్జి చేరుకుంది. వర్షాలు బాగా పడ్డం వల్ల క్రింద ఏరు  వాదనవల్ల ఎరుపెక్కిన వాళ్ళ మొహల్లా  ఎర్రగా పారుతోంది. చుట్టూ పంట పొలాలు ఏదో ఆపాలన్నట్టు అడ్డంగా తలలూపుతున్నాయి.
శివ ఒక్కసారి ఊపిరి గట్టిగా తీసుకున్నాడు. 
‘‘సర్, తలరాత వల్లో, తెలివితేటలవల్లో తారతమ్యాలు తప్పవనిపిస్తే, అది ‘బాగున్నవాడు–బాగానే ఉన్నవాడు’ లా ఉండాలి కానీ ‘బాగా ఉన్నవాడు–బాధల్లో ఉన్నవాడు’లా ఉంటే సమాజం సమతుల్యతకే ప్రమాదం’’ అంటూ పద్మజ  కేసి తిరిగి ‘‘క్షమించండమ్మా’’ అని, తన డోర్‌ కొద్దిగా తెరిచి ఒక్కసారిగా కారు స్టీరింగ్‌ పూర్తిగా ఎడమవైపుకు తిప్పేసాడు. అంతే, కారు బ్రిడ్జికున్న పాత రైలింగ్‌ని గుద్దుకుని అదే వేగంతో గాల్లోకి లేచి నలభై అడుగుల ఎత్తునుండి చెరువులో పడింది. ముందుగా వెంకట్‌ తల కారు సీలింగ్‌కి గుద్దుకుని మెడ విరిగింది. ఆ తర్వాత గాల్లో ఉండగానే ఆ హఠాత్పరిణామానికి గుండె వేగం పెరిగింది. శివ అప్పటికే  కారు డోర్‌ తీసుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరి పారిపోయాడు. వెంకట్‌కు ఊపిరి అందటం కష్టంగా ఉంది.  
∙∙ 
‘‘ఏవండీ..లేవండి..అన్నవరం వచ్చేసింది. ఏమిటా మొద్దు నిద్ర ..ఏవండీ మిమ్మల్నే ....’’ వెంకట్‌ని తట్టి లేపుతోంది పద్మజ. ఉలిక్కిపడి లేచాడు వెంకట్‌.  జుట్టంతా చెదిరిపోయింది. కార్లో ఏ.సి ఉన్నా వళ్ళంతా  చెమటతో తడిసిపోయింది. మెడ పట్టేసింది. నోట్లోంచి కారిన చొంగ కర్చీఫ్‌తో తుడుచుకుని, బాటిల్‌లో నీళ్ళు  ఒంపి మొహం కడుక్కున్నాడు, దువ్వెన తీసి తల దువ్వుకున్నాడు. చెప్పులు కార్లోనే వదిలేసి ఇద్దరూ నెమ్మదిగా మెట్లెక్కి గుళ్ళోకెళ్లారు. శివ కొంచెం దూరంగా వాళ్ళని అనుసరించాడు. వెంకట్‌ గుళ్ళో ఉన్నంత సేపూ ఏమీ మాట్లాడలేదు.  దర్శనం అయి, బయటికొచ్చాక ఇద్దరూ గట్టు మీద కూర్చుని గోధుమనూక  ప్రసాదం తింటున్నారు. దూరంగా  శివ కారు దగ్గర నించున్నాడు. వెంకట్‌ భార్యనడిగాడు.
 ‘‘పద్మా, కార్లో శివ ఏదైనా మాట్లాడాడా?’’

దానికి పద్మజ  నవ్వి ‘‘శివ ఎప్పుడైనా మాట్లాడ్డం చూసారా? అతని గురించి మీకు తెలీదా? అయినా గుడికెళ్తూ  మరీ అంత  మొద్దు నిద్రేమిటండీ. కారు బయలుదేరగానే పడుకుని, లేపేవరకూ లేవకపోవడం మీకే చెల్లింది’’ అంటూ విసుక్కుంది. తనకొచ్చిన కలగురించి భార్యకి చెప్పాడు వెంకట్‌. 
 ‘‘దేవుడి గుడికెళ్తూ ఉంటే ఇలాంటి కల ఎందుకొచ్చింది. మనకొచ్చే ప్రతీ కల వెనుక ఓ అర్ధం ఉంటుందంటారు. నా కలకర్ధమేంటి?’’ తనలో తను గొణుక్కుంటున్నాడు. 
 పద్మజ అతని చేతిమీద చెయ్యేసి, ‘‘ఏమండీ, చంద్రుడిలో కుందేలూ ఉండదు, మచ్చా ఉండదు. మనం మనసులో ఏదనుకుని  చూస్తే అదే కనబడుతుంది. ‘యథా దృష్టి –తథా సృష్టి’ అంటే ఇదే. మీకొచ్చిన కలని బట్టి మీరేదో అంతర్మథనానికి గురవుతున్నారనిపిస్తోంది. మీలో మెటీరియలిస్ట్‌ అతన్ని దూరం పెట్టమంటోంది. మీ మనసు మాత్రం అతని తరపున  మీతో యుద్ధం చేస్తోంది. సొరంగం నుంచి సమాజానికి  ఎదిగిన క్రమం మనిషిని ఇనప్పెట్టెలా కాపాడాలి తప్ప ఇన్సెక్యూరిటీ ఇవ్వకూడదు. అతనికి సాయం చెయ్యాలినీ ఉంది. అతను చెయ్యి చాచి అడగటం లేదని అహం అడ్డొస్తోంది. మీకు చెయ్యాలనిపిస్తే మనస్ఫూర్తిగా సాయం చెయ్యండి. లేదా, అతని గురించి పట్టించుకోకండి. అంతే కానీ ఇలా అదే ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకండి’’ అంది నవ్వుతూ. 

వెంకట్‌ మౌనంగా కూర్చున్నాడు. కొండమీదనించి చూస్తే పంపానది పరిపూర్ణతకి పర్యాయపదంలా ఉంది.   ప్రపంచంలో ఏ రెండు వాచీలు ఒక టైం చూపని సాంకేతికతని సౌర గడియారం పరిహసిస్తోంది.
రిటర్న్‌లో కారెక్కి శివ కేసి చూసాడు వెంకట్‌. అతను అభావంగా డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరయ్యింది. పక్షులన్నీ గూటికెళ్లే హడావిడిలో ఉన్నాయి. పద్మజ కార్లోంచి బ్యాగ్‌  తీసి ఓ రెండు ప్రసాదం పొట్లాలు శివకిచ్చి థాంక్స్‌ చెప్పి లిఫ్ట్‌లో పైకెళ్లిపోయింది. శివ వెంకట్‌ ఆదేశాల కోసం నిలబడ్డాడు. 
వెంకట్‌ జేబులోంచి వంద తీసి మళ్ళీ లోపల పెట్టి, పర్స్‌ లోంచి అయిదొందలు తీసిచ్చి ‘‘శివా రేపట్నుంచి నువ్వు రానవసరం లేదు’’ అన్నాడు. ఎప్పటిలాగానే శివ అభావంగా తాళాలు అప్పజెప్పి గుడ్‌ నైట్‌ చెప్పి వెళ్ళిపోయాడు. 
∙∙ 
‘‘రా శివా రా రా. ఏంటి ఉదయాన్నే వచ్చావు’’  తలుపు తీస్తూ అడిగాడు వెంకట్‌.  
చేతిలో ఉన్న స్వీట్‌ ప్యాకెట్‌ డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టి నించున్నాడు శివ. ఇంతలో వంటింట్లోంచి పద్మజ వచ్చింది. వెంకట్‌ సోఫాలో కూర్చుని శివని కూర్చోమని సైగ చేసాడు. ఎదురుగా ఉన్న సోఫాలో బాగా ముందుకు కూర్చుని, నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు శివ. 
‘‘సర్,  ఆరోజు మీరు రేపట్నుంచి రావొద్దు అన్నప్పుడు ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు.  ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. కానీ ఆ మర్నాడు నన్ను బ్యాంకుకి తీసుకెళ్ళి, షూరిటీ ఇచ్చి నా చేత టాక్సీ కొనిపించి నన్ను, నా కుటుంబాన్నీ నిలబెట్టారు. మీదయవల్ల, నా భార్య బిడ్డల అదృష్టం వల్ల, ఆ అప్పు తీరిపోయి ఇప్పుడు మొత్తం మూడు టాక్సీలు తిప్పుతున్నాను. మరో ఇద్దరు డ్రైవర్లకు  ఏదో నావంతు సాయం చెయ్యగలుగుతున్నాను. ఇదంతా మీ పుణ్యమే సర్‌’’ అన్నాడు వినయంగా.

‘‘నాదేముంది శివా, నువ్వు నాకు తెలుసు అన్న ఓ చిన్న సంతకం అంతే. కష్టమంతా నీదే.  అబ్బాయి ఏం చేస్తున్నాడు?’’   
‘‘వాడు ప్రస్తుతం ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు సర్‌.  ఎప్పుడు అవసరమైనా కాల్‌ చెయ్యండి. నేను కానీ మా అబ్బాయి కానీ ఎవరో ఒకరు వస్తాము. ఉంటాను సర్, ఉంటానమ్మా..’’  అంటూ లేచి వెళ్ళబోయాడు శివ. ఇంతలో బెడ్‌ రూమ్‌ లోంచి ఫోన్‌ మాట్లాడుతూ హాల్లోకొచ్చిన వెంకట్‌ కొడుకు ఫోన్లో ఎవరికో ‘‘హ్యాపీ ఫ్రెండ్‌ షిప్‌ డే రా ..’’ అంటూ శివని ‘హాయ్‌ అంకుల్‌’ అని పలకరించి బాల్కనీ లోకి వెళ్ళిపోయాడు. 
వెంకటరమణ, శివ కూడా ఒకరికొకరు ‘హ్యాపీ ఫ్రెండ్‌ షిప్‌ డే’ చెప్పుకుని, పద్మజ  తెచ్చిన కాఫీ తాగుతూ, కాసేపు బాల్యంలోకి వెళ్లిపోయారు. - ఉమా మహేష్‌ ఆచాళ్ళ 
  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top