వాస్తవం అబద్ధం... నమ్మకమే నిజం!
‘‘ఒరేయ్... మనం నమ్మకాలను మాత్రమే నమ్మాలిరా. వాస్తవాలను అస్సలు నమ్మకూడదు’’ అన్నాడు మా రాంబాబుగాడు.
‘‘ఒరేయ్... మనం నమ్మకాలను మాత్రమే నమ్మాలిరా. వాస్తవాలను అస్సలు నమ్మకూడదు’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘అదేంట్రా నువ్వు విచిత్రంగా మాట్లాడతావు? కళ్లెదురుగా వాస్తవాలు కనిపిస్తున్నా నమ్మకూడదంటే ఎలా’’ అడిగాను నేను. ‘‘చిన్నప్పుడు నువ్వు స్కూలు పుస్తకాల మధ్యన నెమలీక పెట్టి... వాటికి బిస్కెట్టులను ఆహారంగా వేశావా లేదా?’’ అడిగాడు.
‘‘వేశాను’’ అన్నాను.
‘‘అవి రోజు రోజుకూ పెరుగుతున్నాయని నమ్మావా లేదా?’’
‘‘నమ్మాను. కానీ...’’ అంటో ఏదో సర్దుకొని మాట్లాడబోయాను.
‘‘నేను చెప్పడం పూర్తి కానివ్వు... అప్పుడు నమ్మావు కదా. అలాగే ఆ టైమ్‌లో రెండు అగ్గిపెట్టెల్లోని లోపల డొప్పలు తీసుకొని వాటికి మధ్య దారం కట్టావా, లేదా? ఆ డొప్పలను ఫోన్‌లాగా ఉపయోగించి మాట్లాడావా, లేదా? అది వినిపిస్తుందని నమ్మావా. ఒకవేళ నమ్మలేదనుకో. ఎదుటివాడు కాస్త గొంతు పెంచి వాడు డెరైక్ట్‌గా వినిపించినప్పుడు అది దారం ద్వారానే వినిపిస్తుందని నమ్మావు కదా, ఎప్పటికప్పుడు కొత్త అబద్ధం మన ముందుకు వస్తూ ఉంటుంది. దాన్నే నమ్ముతూ ఉంటాం’’ అడిగాడు.
‘‘నమ్మితే?... అదంతా చిన్నతనం. అప్పుడు నమ్మాను.’’ అంటూ బదులిచ్చా.
‘‘ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయ్యావా?’’ అడిగాడు.
‘‘అవును... అది వాస్తవం’’ అన్నాను నేను.
‘‘పిచ్చివాడా... కాస్త పెద్దయాక అంతకు ముందు ఉన్న స్థితి చిన్నతనం అవుతుంది. పెరిగే వయసుతో పోలిస్తే... రాబోతున్న కాలంలో ఎదిగే ఈడుతో పోలిస్తే ఎప్పటికప్పుడు చిన్నతనం ఉండనే ఉంటుంది. అలా వయసు, కాలం, క్యాలెండర్ ఉన్నంత కాలం అంతకంటే పెద్ద వయసు వారితో పోలిస్తే చిన్నవారే అవుతారు. ఎప్పటికీ పెద్దవారు కాలేరు ’’ అన్నాడు వాడు.
‘‘అదేమిట్రా... ఇప్పుడు నాకు నాలుగు పదులు నిండాయి. నేనింకా బుజ్జి కూచాయినే అంటే ఎవరైనా నమ్ముతారా? నేనింకా బుజ్జిపాపాయినే అని నేను నమ్మినా సరే... అంత మాత్రాన నా నమ్మకం నిజమవుతుందా?’’ అడిగా. ‘‘నా నమ్మకం కాదురా. అదే నిజం. మీ అమ్మ నిన్ను ఏమని పిలుస్తుంది? ‘ఒరే... చిన్నోడా’ అంటుంది కదా’’ అని గుర్తుచేశాడు. ‘‘అవును... మా పెద్దన్నయ్యను పెద్దోడా అంటుంది కాబట్టే నన్ను చిన్నోడా అంటుంది’’ సమర్థించుకున్నట్లుగా బదులిచ్చా.
‘‘కానీ నువ్వు పుట్టే వరకూ వాడూ చిన్నోడే రా. ఆ తర్వాత పెద్దాడయ్యాడు. అలా పెద్దయ్యాక విలువ పోగొట్టుకుంటాడు. అదీ వాస్తవం. కానీ విలువ పోగొట్టుకుంటాడనేది ఎవరూ నమ్మకపోవడం వాస్తవం’’ అన్నాడు వాడు.‘‘ఏమిటీ... పెద్దయితే విలువ పోగొట్టుకుంటాడా? వ్యాల్యూ తగ్గుతుందా? నువ్వు చెబుతున్నదంతా వింటున్నానని ఏది పడితే అది వాగకు. నేను నమ్మను’’ ‘‘నువ్వు నమ్మేదే వాస్తవం అనుకుంటావని చెప్పడానికి ఇదో ఉదాహరణ. నీకు నమ్మకం కుదరడానికి ఒక విషయం చెబుతాను విను. తాజా ఉదాహరణతో చెబుతున్నా కాబట్టి ఇకనైనా తెలుసుకో. ఇప్పుడూ... బ్యాంకు నుంచి కొత్త రెండు వేల నోటూ, పాత వంద రూపాయల కాగితం ఒకే టైమ్‌లో తీసుకున్నావు కదా. సైజులో వంద నోటే పెద్దది. రెండు వేల రూపాయల కాగితం చిన్నది. దేనికి విలువిస్తున్నావు. వాస్తవంలో వందనోటే పెద్దదైనా... దాని తర్వాత పుట్టిన రెండువేలకే ఎక్కువ విలువిస్తున్నావు కదా. అలాగే... చిన్నదనానికే వ్యాల్యూ ఎక్కువ. నువ్వు పెద్దాడివయ్యావంటే నమ్మకు’’అన్నాడు వాడు.
‘‘నువ్వు ఇంత నమ్మకంగా చెబుతున్నా... నాకెందుకో నమ్మాలనిపించడం లేదురా’’ అన్నాను నేను.
‘‘అయితే ఇంకో ఉదాహరణ... నా దగ్గర వాస్తవానికి ఒక్క పైసా లేదు. నీ దగ్గర కూడా ఇప్పుడు చేతిలో నగదు అనేదే లేదు. కానీ నీకు బ్యాంకులో డబ్బులున్నాయనుకో. వాస్తవానికి ఇప్పుడు మనిద్దరి పరిస్థితి ఒక్కటే. అయినా కానీ నా కంటే నువ్వు ఆస్తిపరుడివని నీ నమ్మకం. అలా నమ్మకం మాత్రమే నిజం. కానీ అది మాత్రం వాస్తవం కాదు. అందుకే నమ్మే వారికి తమ నమ్మకాలు ఎప్పుడూ నిజాలనిపిస్తాయి. నమ్మని వారికి ఎదుటివారివి మాత్రమే మూఢనమ్మకాలు అనిపిస్తాయి. తమ నమ్మకాలకు మాత్రం సెంటిమెంట్ అనే ముద్దు పేరు ఉంటుందిరా’’ అన్నాడు వాడు. ‘‘అవును రా. నిజమే. నాకూ సెంటిమెంట్స్ ఉంటాయి రా. తప్పని తెలిసినా నేనూ సెంటిమెంట్స్‌ను నమ్ముతాను రా’’ ‘‘ఇప్పుడు తెలిసిందా. నమ్మేదే నిజమనీ... వాస్తవమైనా నమ్మనంతవరకూ అదే అవాస్తమేననీ’’ అన్నాడు వాడు ఘాటుగా.
- యాసీన్