రంతిదేవుడి దానగుణం

రంతిదేవుడి దానగుణం


రంతిదేవుడు మహాదాతలలో ఒకరిగా కీర్తిపొందిన మహారాజు. విష్ణుభక్తుడైన రంతిదేవుడు దానధర్మాలు సాగించేవాడు. దురదృష్టవశాత్తు రాజ్యంలో దారుణమైన కరువు తాండవించడంతో రంతిదేవుడు తన సమస్త సంపదలనూ దాన ధర్మాల్లో పోగొట్టుకున్నాడు. తనకంటూ ఏమీ లేని దుస్థితిలో చిక్కుకున్నా అతడు తన దానక్రతువును ఏమాత్రం విడనాడలేదు. సంపదలన్నీ హరించుకుపోయిన తర్వాత రంతిదేవుడు తన భార్యా బిడ్డలతో అడవుల పాలయ్యాడు.



అడవుల్లో ఉంటున్న రంతిదేవుడు, అతడి కుటుంబ సభ్యులు ఒకసారి వరుసగా నలభై ఎనిమిదిరోజుల పాటు తిండితిప్పలు దొరక్క ఆకలితో అలమటించాల్సి వచ్చింది. అన్ని రోజుల పస్తుల తర్వాత రంతిదేవుడికి ఆహారం, మంచినీరు లభించాయి. కుటుంబ సభ్యులతో కలసి తినడానికి ఉపక్రమించాడు. సరిగా అదే సమయానికి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడకు వచ్చాడు. బ్రాహ్మణుడు తనతో పాటు బక్కచిక్కిన తన కుక్కనూ తీసుకొచ్చాడు. రోజుల తరబడి తిండిలేక తాను, తన కుక్క ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి, తినడానికి ఏమైనా ఉంటే ఇప్పించమని కోరాడు. రంతిదేవుడు కాదనకుండా తనకు లభించిన ఆహారంలో కొంత ఆ బ్రాహ్మణుడికి, కుక్కకు పెట్టాడు. బ్రాహ్మణుడు భోంచేసి వెళ్లాక రంతిదేవుడు తన భార్యాబిడ్డలతో కలసి భోజనానికి కూర్చున్న సమయానికి ఒక శూద్రుడు వచ్చి ఆకలితో ఉన్నానంటూ ఆహారం అడిగాడు.



 అతడికి మిగిలిన ఆహారాన్ని ఇచ్చేశాడు. ఇక రంతిదేవుడి కుటుంబానికి మిగిలినవల్లా మంచినీళ్లే. కనీసం మంచినీళ్లయినా తాగి కడుపు నింపుకుందామని అనుకునేలోగానే ఒక దళితుడు వచ్చి ఎదురుగా నిలిచాడు. దప్పికతో గొంతు ఎండిపోతోంది. దాహం తీర్చమని అడిగాడు. కాదనకుండా మంచినీటిని అతడికి ఇచ్చేశాడు. రంతిదేవుడి త్యాగనిరతికి సంతసించిన త్రిమూర్తులు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ‘రంతిదేవా! బ్రాహ్మణ, శూద్ర, దళిత రూపాల్లో నీ వద్దకు వచ్చినది మేమే. నీ దానగుణాన్ని పరీక్షించడానికే అలా వచ్చాం. మా పరీక్షలో నువ్వు నెగ్గావు. ఇక నీ రాజ్యంలో కరవు తొలగిపోతుంది. నీ ప్రజలంతా సుఖశాంతులతో అలరారుతారు’ అని వరాలు కురిపించి అదృశ్యమయ్యారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top