అడగని వరం

అడగని వరం

 ‘‘అమ్మా! ఈ చీరలు రేపు షాపులో ఇచ్చేసి డబ్బులు తీసుకురా!’’ రత్తమ్మ తల్లితో చెప్పింది. ‘‘అలాగే! ఎంతకి ఇమ్మంటావ్? వాటిలో కొన్ని మంచి చీరలు వున్నాయ్. ఒకటో రెండో తీసి వుంచుకో, కట్టుకుందువుగాని. ఎన్ని చీరలు ఎంత మంచివి ఇచ్చినా, అన్నీ తన ఎదా పడేసుకుని, ఏడుస్తూ ఏగానీ చేతిలో పెడతాడు.’’ రత్తమ్మ తల్లి షాపువాడి మీద ఫిర్యాదు చేసింది.‘‘నాకేం వద్దులే అమ్మా! అతను ఎంతిస్తే అంతే తీసుకో! అవేమన్నా మనం డబ్బు పోసి కొన్నవి కాదు కదా! అయినా పసుపు బొట్టు పెట్టినవి ఎవరు మాత్రం కొంటారు? ఏదో మనలాంటి వాళ్లు తప్ప. అతను నచ్చజెప్పి అమ్ముకోవాలి కదా!’’ రత్తమ్మ తల్లికి నచ్చచెప్పింది.‘‘ఆ చీరల్లో చిలకపచ్చ చీర తీసి ఉంచుతాను.


 


  నీ ఒంటి రంగుకి ఆ చీర చాలా బాగుంటుంది’’ అంది రత్తమ్మ తల్లి. ఆమె తన బిడ్డ మంచి చీర కట్టుకోవాలని ఆరాటపడటంలో ‘‘ఎందుకమ్మా మంచి చీరలు? పొద్దుటి నుండి రాత్రిదాకా పొయ్యి దగ్గర పడివుండేదానికి, ఏ చీర కట్టుకుంటే ఏమిటి?’’ నిట్టూర్చింది రత్తమ్మ.‘‘నిజమే తల్లీ! నువ్వు చెప్పింది. ఏ చీర కట్టుకుంటే పోదు. సరేలే రేపు ఎవరింటిలో పనికి పోవాలి?’’ అడిగింది తల్లి.‘‘రేపు నేను శర్మగారింటికి వెళ్లాలి. రేపు ఆయన భార్య తిథి. నువ్వు కామేశ్వరరావుగారింటికి వెళ్లు. మళ్లీ తెల్లారకుండా లేవాలి’’ పక్క పరుచుకుంది రత్తమ్మ.


 


 ‘‘అమ్మాయ్! అడుగుతున్నానని అనుకోకు. ఆ కామేశ్వరరావు గారింట్లో పని ఎక్కువ. ఇచ్చేది తక్కువ. ఎంత లేదన్నా, భోజనానికి పాతిక మంది దాకా తేలుతారు. అడ్డెడు పప్పుగారెలు చేసినా మొదటి బంతికి రావు. ఆవిడ చాలా పీనాసిది. డబ్బులిస్తున్నా కదాని అడ్డెడు బియ్యం అరిసెలకి నానబోస్తుంది. చెయ్యలేనేమో అని భయంగా ఉంది. పోనీ, నువ్వు ఈసారికి వాళ్లింటికి వెళ్లు’’ అడిగింది కూతుర్ని.‘‘ఎలా అమ్మా! మరి శర్మగారింట్లో సుమంగళి వాయనం గదా! ఆయన మరీ మరీ చెప్పారు’’ సందిగ్ధంగా అంది రత్తమ్మ.‘‘నిజమే తల్లీ! ఆ శర్మగారైతే కాస్త కట్టుకునే లాంటి శుభ్రమైన చీర పెడతారు. మిగతావాళ్లు ఎవరు పెట్టినా, మూరకి పెద్దవి, బారకు చిన్నవి పెడతారు. అసలు అలాంటివి ఎందుకు పెడతారో వాళ్లకే తెలియదు’’ సణుక్కుంది తల్లి. ‘‘పోన్లే అమ్మా! వాళ్లకి కలిగింది పెడతారు. ఉత్తినే పెట్టినమ్మా, నీ మొగుడితో సమానంగా పెట్టు అందిట ఒకావిడ. అలాగుంది నువ్వు చెప్పేది’’ తల్లి మాటలను ఖండించింది రత్తమ్మ.


 


 ‘‘అది కాదే! నిజంగా బతికున్న తమవాళ్లకి అలాంటి గుడ్డలు పెడితే కట్టుకుంటారా? సర్లే, పడుకో. ఎవ్వరినీ పన్నెత్తి ఒక్కమాట అననియ్యవు’’ సణుక్కుంటూనే దుప్పటి ముసుగేసింది రత్తమ్మ తల్లి లక్ష్మమ్మ.పడుకుంది కానీ రత్తమ్మకి కంటిమీద కునుకు రాలేదు. అమ్మ ఆ చీరలు షాపులో ఇచ్చేస్తే, దగ్గర దగ్గర ఏడెనిమిది వందలు వస్తాయి. ఆ డబ్బులు రామానికి పంపాలి. ఈసారి కుదరక డబ్బులు పంపడం ఆలస్యమైపోయింది. ఎంత అవస్థ పడుతున్నాడో బిడ్డ. తన బిడ్డ రామాన్ని తలచుకుని నిట్టూర్చింది. ఎలాగోలా ఈ ఏడాది గట్టెక్కితే, ఎందులోనైనా ఉద్యోగంలో చేరితే, అమ్మని ఈ పని నుంచి తప్పించి సుఖపెట్టాలి అనుకుంటూ నిద్రకుపక్రమించినా, కంటిమీద కునుకు రాకుండానే భళ్లున తెల్లారిపోయింది.


 


 రత్తమ్మ గతంలోకి వెళితే, రత్తమ్మ తల్లి లక్ష్మమ్మకి రత్తమ్మ ఒకతే సంతానం. ఇప్పుడు మనం రత్తమ్మ అని పిలుచుకుంటున్న రత్తమ్మ అసలు పేరు రత్నమాల. నిజంగా పేరుకు తగ్గట్లుగానే రత్నంలా మెరిసిపోతుండేది. ఒక్కగానొక్క కూతురైన రత్నమాలను లక్ష్మమ్మ, ఆమె భర్త రాజు అపురూపంగా చూసుకునేవారు. రాజుకి రాజ్యాలు లేకపోయినా, వంటల్లో కేటరింగు పనులు చేసి బాగానే సంపాదించాడు. భర్తకి పని ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రం లక్ష్మమ్మ సాయంగా వెళ్లేది కానీ, లేకపోతే రాజు తెచ్చేది సంసారం ఈదడానికి బాగానే సరిపోయేది. రత్నమాలను పెద్ద చదువులు చదివించాలని, అందుకుగాను డబ్బు చాలా అవసరమౌతుందని, ఇంటి దగ్గర ఉండే అప్పడాలు చెయ్యడం, పచ్చళ్లు పెట్టడం లాంటి పనులు చేసి, ఆ వచ్చిన డబ్బు బ్యాంక్‌లో దాచేది. 


 


ఎప్పుడన్నా రాజుకి డబ్బు అవసరం పడినా, తీసుకున్న డబ్బుకు పదో పరకో వేసి తిరిగి ఇచ్చేసేవాడు. ఒకవేళ అతను ఇవ్వకపోతే ఇంకెప్పుడూ ఇవ్వనని భర్తను బెదిరించి మరీ వసూలు చేసేది లక్ష్మమ్మ.శ్రద్ధగా చదువుకుని రత్నమాల పదవ తరగతి పాసయ్యింది. చదువులేని లక్ష్మమ్మ, రాజులు తమ కూతురు కలెక్టర్ పరీక్ష పాసైనంత హడావుడి చేశారు. రాజైతే వారం రోజుల పాటు గాల్లో తేలుతున్నట్లు నడిచాడు. ఆ తల్లిదండ్రుల సంబరం చూస్తున్న ఆ వీధి వాళ్లూ, ఆ ఇంట్లోనే ఉన్న మిగతా పోర్షన్లలో ఉన్నవాళ్లూ, అయ్యో! సంబరం’’ అంటూ మూతీ ముక్కూ తిప్పుకున్నారు.


 


 అలా ఎందుకంటే, అసలు ఆ వీధినే వంటాళ్ల వీధి అంటారు. అక్కడ ఉండేది అందరూ వంటలు చేసేవారే. బాగా ధనమున్న, బోల్డు ఇళ్ల స్థలాలున్న ఒక ధనవంతుడు ఒక స్థలంలో వరసగా బంగళా పెంకులు పైకప్పుగా వేసి, ఒక గది, వసారా, వంటిల్లు చొప్పున ఒక యాభై పోర్షన్లుగా కట్టించాడు. వంటలు చేసి పొట్టలు పోషించుకునేవాళ్లంతా బ్రాహ్మణ కుటుంబీకులు. పేద బక్క బ్రాహ్మణులు. యజమాని వచ్చేసరికి వున్నా లేకున్నా ఠంచనుగా అద్దె చెల్లిస్తారు. ఇల్లు ఖాళీ చెయ్యరన్న భయం లేదు. పైగా ఊరికి మధ్యగా ఉండటం వల్ల ఎప్పుడూ నాగా లేకుండా ఏదో ఒక పని ఉంటుంది. 


 


ఇది ఈ వంటవాళ్లకి లాభమైతే, తమ ఇంట్లో గానీ తమ బంధువుల ఇళ్లల్లో ఏ పెళ్లో పేరంటమో వస్తే, కాకుల్లా వాలిపోయి ఒళ్లొంచి పనిచేసి, ఇచ్చిన డబ్బేదో పుచ్చుకుని విశ్వాసంగా పడివుంటారని ఆ ఇంటి ఆ ఇంటి ఓనరు నమ్మకం. అందుకనే అన్నివిధాలుగా ఆలోచించి, పల్లెలో పడిపోతున్న తన ఇంటిని పడగొట్టించి, ఆ కంప, పెంకులు, ఇటుకలు, వాసాలు తెప్పించి వీరందరికి ఆవాసాలు ఏర్పాటు చేశాడు. అడపా దడపా వారికి ఏ పెళ్లిళ్లల్లోనో పని ఇప్పించి, కమీషను కూడా తీసుకుంటాడు. ఎందుకైనా మంచిదని, ఇల్లు ఇచ్చేటప్పుడే వాళ్లచేత ఖాళీ పేపరు మీద సంతకం కూడా చేయించి పుచ్చుకుంటాడు. మున్సిపాలిటీ వాళ్లకి మాత్రం తాము అద్దె ఇస్తున్నట్లు వీరు చెప్పగూడదు. అదీ కండిషన్.


 


 అలా ఆ యాభై కుటుంబాలవారూ  ఆ పట్టణంలోనూ, ఆ చుట్టు పక్కల ఊళ్లలోనూ ఎవరికి వంటవాళ్లు అవసరపడినా అందుబాటులో ఉంటారు. ఇలా వారందరూ కలిగినది తిని, కష్ట సుఖాలు పంచుకుంటూ కాలం గడుపుతున్నారు. ఆ పోర్షన్లలో ఎవరి కష్టం కలిగినా, తమ కష్టంలా భావించి, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అలాగే ఎవరింట్లోనైనా పెళ్లో పేరంటమో జరిగితే, అడగకపోయినా అందరూ తలో సలహా ఇచ్చి, తలో చెయ్యి వేసి సహాయం చేస్తారు. అలాగని అసూయ ద్వేషాలు లేవని కాదు. తమ పనిలో కన్నా పది రూపాయలు ఎక్కువ పని దొరికినా, తమ ఇంట్లో వస్తువు కన్నా కాస్త ఎక్కువ ఖరీదైన వస్తువు కొనుక్కున్నా, ముక్కూ మూతీ తిప్పుకుంటారు. ఆ వస్తువు కొనుక్కున్న ఆనందం పోయేలా ఎవరో ఒకరు ఏదో పుల్ల విరుపు మాట మాట్లాడతారు. అప్పుడు కాస్త బాధ అనిపించినా, మాట్లాడకుండా ఊరుకుంటే, అన్నవాళ్లూ, పడ్డవాళ్లూ కూడా మరచిపోతారు. ఏ ఒక్కరో ఆ గొడవ కొన్నాళ్లు సాగదీసినా మళ్లీ మామూలుగా కలిసిపోతారు. అలా ఉంటున్నారు కనుకనే, అందరూ ఒక్క చూరు కింద ఇన్నాళ్లుగా ఉండగలుగుతున్నారు.


 


 అలాంటి వాతావరణంలో పెరిగింది కనుకనే అందరి కష్ట సుఖాలు తెలుసు. అందుకనే బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేసి, తల్లినీ తండ్రినీ ఈ వంట పని మాన్పించి, సుఖపెట్టాలని రత్నమాల ఉద్దేశం. అందుకనే కష్టపడి చదివి పది పాసయ్యింది. మంచి కాలేజీలో ఇంటర్‌లో చేరడానికి అప్లికేషన్ ఫారాలు తెచ్చుకుంది. కాలేజీలో చేరింది. మనుషులు అనుకున్నవి అన్నీ జరగనిస్తే ఇక దేముడి గొప్పతనం ఏముంది? రత్నమాల ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగానే రత్నమాల తండ్రి రాజు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దిన వారాలకీ, దానికీ చాలా డబ్బు ఖర్చయిపోయింది. రోడ్డు ప్రమాదం కనుక ఆ ప్రమాదం జరిపిన వారి దగ్గర నుంచి డబ్బు రాబట్టవచ్చు అన్న సలహా విని లాయర్ను పట్టుకుంటే, లాయరు ఖర్చులకి, కోర్టులకి తిరగడానికీ రత్నమాల చదువుకోసం దాచినది చాలామటుకు హారతి కర్పూరంలా హరించుకుపోయింది. కోర్టువారు ఇప్పించిన సొమ్ముకి, ఖర్చు అయిన సొమ్ముకీ పొంతన లేకుండా పోయింది. ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకునే లక్ష్మమ్మ, రాజు పని చేసే టీమ్‌లో చేరింది. 


 


 బంధువులు, ఇరుగు పొరుగువారు ఆ మాత్రం డబ్బు ఉన్నప్పుడే పిల్ల పెళ్లి చేసి బరువు దింపుకొమ్మని సలహా ఇచ్చారు. వారి వారి ఇళ్లల్లో ఉన్న పెళ్లికాని మగపిల్లలను తీసుకొచ్చి రత్నమాలను చూపించేవారు. వాళ్లలో చాలామంది తండ్రి వెనకాలో, అన్న వెనకాలో వంట పనిలోకి వెళ్లేవారే.లక్ష్మమ్మకి మాత్రం తన అల్లుడు వంటవాడు కావటం ఇష్టం లేదు. ఆ విషయం చెప్పినప్పుడు మళ్లా ఇరుగు పొరుగు మూతి తిప్పుకున్నారు. ఈవిడిచ్చే కట్నానికి కలెక్టరల్లుడు వస్తాడు అని చెవులు కొరుక్కునేవారు.తండ్రి పోయిన దిగులుతో పరీక్షలు మానేసిన రత్నమాల కాలేజీ చదువును కూడా అశ్రద్ధ చేసింది. భర్త హఠాత్తు మరణంతో లక్ష్మమ్మ పిల్ల చదువు విషయం కూడా పట్టించుకోలేదు. పైగా తనకి కూడా ఏదైనా అయితే తన బిడ్డ ఒంటరిదైపోతుందని, కనుక పెళ్లిచేసి అత్తారింటికి పంపాలని నిశ్చయించుకుంది.అలా అందరి ద్వారా వచ్చే సంబంధాలలో ఐటీఐ పాసయ్యి, ఏదో గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న వాడికి రత్నమాలనిచ్చి పెళ్లి చేసింది.


 


 ఆశలు, ఆశయాలు వదిలేసిన రత్నమాల భర్త చెయ్యి పుచ్చుకుని అత్తింట కాలుపెట్టింది. కొడుకు రాము పుట్టేదాకా సంసారం బాగానే నడిచింది. ఉన్నదాంట్లోనే తాను సుఖపడి, భర్తను సుఖపెట్టింది రత్నమాల. అయితే ఆ సుఖాలు చాలవని భర్త వేరే సుఖాలకి అలవాటుపడ్డాడు. ఆ వేరే సుఖాలకి గవర్నమెంటు వారిచ్చే జీతం సరిపోక, అప్పులు చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ అప్పులు తీర్చటానికి బల్ల కింద చేతులు పెట్టిన సందర్భంగా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ఇల్లు గడవని పరిస్థితిలో, రెండేళ్ల కొడుకుని, భర్తను తీసుకుని తల్లి లక్ష్మమ్మ పంచను చేరింది.మళ్లీ ఇరుగు పొరుగు చెవులు కొరుక్కున్నారు. తాము చెప్పిన సంబంధాలు కాకుండా గవర్నమెంటు ఉద్యోగం అంటూ విర్రవీగింది. బాగా అయ్యింది అనుకున్నారు.


 


 లక్ష్మమ్మ ఇప్పుడు తన పొట్ట కోసమే కాకుండా మరో ముగ్గురి పొట్టల కోసం కూడా కష్టపడవలసి వస్తోంది. ఉద్యోగం పోగొట్టుకుని కూర్చుని తినడానికి అలవాటుపడ్డ అల్లుడుకి అత్తతో వంటపనికి వెళ్లడం నామర్ధాగా ఉంది. ఇరుగు పొరుగు మగవాళ్లతో వెళ్లినా, పని చేతగాక, అసలు చెయ్యడం రాక, ఇష్టం కూడా లేక పని మధ్యలో ఏదో వంక చెప్పి వచ్చేసేవాడు. సాయం కోసం తీసుకెళ్లినవాళ్లు చెడ తిట్లు తిట్టి మళ్లీ పనికి పిలిచేవారు కాదు.


 ఖాళీగా ఉన్నవాడి బుర్రను పురుగులు దొలుస్తాయి కదా! అత్తా వంటలు చేయడం నావల్ల కాదు కానీ, ఏదైనా చిన్న షాపు పెట్టుకుంటానంటే, తను దాచుకున్న డబ్బు బ్యాంక్ నుంచి తీసి షాపు పెట్టించింది లక్ష్మమ్మ. వ్యాపారం చెయ్యడం రాలేదు కానీ చెడు స్నేహాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈసారి ఇల్లుతో పాటు ఒళ్లు కూడా పాడుచేసుకున్న అల్లుణ్ని చూసి గుండెలు బాదుకుని ఏడ్చింది లక్ష్మమ్మ. ఇల్లు గడవని పరిస్థితిలో రత్నమాల కూడా తల్లితో పాటు వంట పనులకు బయలుదేరింది.


 


 నెమ్మదిగా పనిలో సులువు బలువులు తెలుసుకుంది. నెమ్మదిగా ఉండి, ఒబ్బిడిగా పనిచేస్తూ, లక్ష్మీదేవిలా కళగా ఉండే రత్నమాలకి ఒక్కరోజు కూడా నాగా లేకుండా పని దొరికేది. చాలామంది రత్నమాల పని నచ్చినవారు లక్ష్మమ్మని వద్దని రత్నమాలనే పనికి పిలిచేవారు. అలా వెళ్లిన పనిలో ఎవరైనా పునిస్త్రీగా పోయినవారి ఆబ్దికమొస్తే ఆవిడ పేరు చెప్పి, చీరా రవికా పెట్టేవారు. అలాగే పండగలప్పుడు అమ్మవారి పేరు చెప్పి కూడా చీరా రవికా పెట్టేవారు. ఆమె కష్ట సుఖాలు తెలుసుకుని ముందుగా మాట్లాడుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు చేతిలో పెట్టేవారు. సంసారం మళ్లీ గాడిలో పడుతున్నదనుకుంటున్న సమయంలో, చేసిన పాపం వదిలిపెట్టదన్నట్లు రత్నమాల భర్త ఆరోగ్యం అడుగంటింది. 


 


 తాను ఇంత చేసినా పన్నెత్తి ఒక్కమాట అనని భార్య మీద ప్రేమ కలిగింది. కన్నబిడ్డ మీద మమకారం కలిగింది. కానీ దేవుడికి కనికారం లేదని, తన జీవితం కడ దశకు వచ్చిందని తెలుసుకున్న రత్నమాల భర్త ఒక ఉత్తరం రాసి పెట్టి భార్యని, బిడ్డను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మళ్లీ ఇరుగు పొరుగు చెవులు కొరుక్కున్నారు. వెళ్లిపోయిన రత్నమాల భర్తకోసం ఊరూ వాడా వెతికారు. తిరిగి తిరిగి కనిపించని ఆమె భర్తని తిట్టుకుంటూ, రత్నమాల దురదృష్టాన్ని తలచుకుని వగస్తూ ఊరకుండిపోయారు.నిద్ర రాక పడుకున్న రత్తమ్మ ఒకప్పటి రత్నమాల ఉత్తరం అన్న మాట గుర్తురాగానే, ఎప్పుడో పదిహేను, ఇరవై ఏళ్లనాడు భర్త రాసిన ఉత్తరాన్ని పెట్టె అడుగు నుండి బయటకు తీసింది. కాగితం పాతబడినా అక్షరాలు పాతబడలేదు. ఇన్నేళ్లలో ఆ ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదివిందో ఆమెకి గుర్తులేదు కానీ, అందులో మాటలన్నీ ఆమెకి గుర్తే. ఆ మాటలేమిటి అంటే...


 


 ప్రియమైన రత్నమాలకి,


 ప్రియమైన అని రాస్తున్నాను గానీ, నిన్ను ప్రియముగా ఎన్నడూ చూడలేకపోయాను. నా జీవితాన్ని నిన్ను ప్రియముగా ఎన్నడూ చూడలేకపోయాను. నా జీవితాన్ని పాడుచేసుకోవడమే కాదు ఏదో హక్కు ఉన్నట్లు నీ జీవితం, బాబు జీవితం కూడా పాడుచేశాను. నా జీవితంలో ఆఖరి దశకి చేరుకున్నానని నాకు తెలుసు. లక్ష్మీదేవిలా కళగా ఉండే నీ ముఖానికి రూపాయ కాసంత బొట్టే అందం. నేను కనుక ఇక్కడే ఉండి చనిపోతే, నీకు ఆ భాగ్యం లేకుండా పోతుంది. పైగా ఈనాడు పునిస్త్రీగా నీకు లభించే అవకాశాలన్నీ పోగొట్టినవాడినౌతాను. పైగా ఈ సమాజంలో భర్త లేని స్త్రీని చిన్న చూపు చూస్తారు. భర్త వుండీ, అతని వల్ల ఉపయోగం లేకపోయినా, గౌరవించి, ఆదరిస్తారని నాకు అర్థమయ్యింది. కనుక నిన్ను ఈ సమాజం ఎప్పటికీ పునిస్త్రీగా గుర్తించే సహాయం ఒక్కటి మాత్రం నేను నీకు చేయగలుగుతున్నాను. ఎందుకంటే, హిందూ సమాజంలో మనిషికి కర్మకాండలు జరగకపోతే అతడు ఎక్కడో అక్కడ బతికి ఉన్నట్లే భావిస్తారు. బాబుని ప్రయోజకుడిగా చేయమని కూడా అడగడానికి అర్హత లేనివాడిని నేను. నేను నిన్ను కోరేది ఒక్కటే. నీ జీవితం కడదాకా, పునిస్త్రీగా జీవించి ఉండాలని కోరుకుంటూ, నీ అనుకుంటున్న


 ‘నీ భర్త’.


 


 రత్తమ్మ ఉత్తరాన్ని కళ్లకద్దుకోలేదు గానీ, గుండెల మీదున్న మంగళ చిహ్నమైన సూత్రాలను కళ్లకద్దుకుని, పదిలంగా జాకెట్లో దాచుకుంది. ఈసారి పక్కమీద వాలగానే నిద్రలోకి జారిపోయింది రత్తమ్మ. ఉదయం లేస్తూనే ‘‘అమ్మా! నేను ఈ రోజు శర్మగారింటికి వెళతాను. ఈ రోజు ఆయన భార్య ఆబ్దికం గదా! ఆయనైతే మరీ అలికీది అయిన చీరగాకుండా, కాస్త శుభ్రమైనదే పెడతారు. నువ్వు కామేశ్వరరావుగారింటి నుండి రాగానే, షాపులో చీరలిచ్చి, డబ్బులు తెస్తే, పిల్లాడికి పంపాలి. నేను రాగానే వాడికి పంపుతాను. ఇంకా వాడు మనకి కలిసి రావడానికి ఈ ఏడాది, పై ఏడాదీ కూడా కష్టపడాలేమో!’’ అద్దంలో మొఖం చూసుకుంటూ, అందమైన తన నుదుటిపై రూపాయి కాసంత బొట్టును దిద్దుకుంటూ భర్తను మనసులో తలచుకుంది, కృతజ్ఞతగా. రత్తమ్మ మొఖాన ఉదయించే సూర్యునిలా ఉన్న కుంకుమ బొట్టుని చూసి, ఇరుగు పొరుగు మూతి ముక్కు తిప్పుతూ ఉంటారు తప్ప వాళ్లెవరూ ఏమీ అనలేని పరిస్థితి మరి.


 


 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top