పంచ భూతాధికారి అపానంపై ఆధిపత్యం

Saipatham Interval 30 - Sakshi

ఎప్పుడైనా దురదృష్టవశాత్తూ మనం ఓ వ్యాధికి గురైతే తగిన వైద్యుడెక్కడుంటాడా? ఉన్నాడా? అని గమనించి ఆయన దగ్గరకెళ్లి, వ్యాధి నయమయ్యాక.. ఆ వైద్యుని చలవ వల్ల స్వస్థతని పొందగలిగాననుకుంటూ ఉంటాం. అంతే తప్ప వ్యాధి రావడానికున్న కారణమేమిటి? దాన్ని నయం చేయడమనేది ఏ ఔషధం వల్ల, ఏ ఔషధం ఎలా పని చేసినందువల్ల రోగం అదుపులోకి వచ్చి నయమైందనే తీరుగా ఏ కొద్దిమందో తప్ప ఎక్కువమంది అలాంటి ఆలోచననే చేయరు. మీట నొక్కితే దీపం వెలిగి ప్రకాశం వచ్చింది. అలాగే మీట నొక్కితే దీపం ఆరిపోయింది. అనుకోవడమే తప్ప మీటకీ దీపానికీ ఉన్న సంబంధం, ఆ రెండింటి మధ్య జరిగిన యంత్రసంబంధమైన వ్యవహారం ఎవరికీ అవసరం లేదు దాదాపుగా.

ఇదే తీరుగా సాయి వల్ల వ్యాధి నయమైందనుకోవడమే తప్ప ఎలా నయమైందనే తీరు ఆలోచన ఎందరికో లేదు. ఉండదు. అయితే సాయి మాత్రం పంచవిధ వాయువుల మీద అధికారాన్ని కేవలం తన మంత్ర జపసాధన వల్ల మాత్రమే పొందగలిగాడు. ఆ నేపథ్యంలో ప్రాణ–అపానమనే వాయువుల మీద సాయికున్న ఆధిపత్యాన్ని చూసుకోగలిగాం. ఇప్పుడు అపానమనే వాయువు మీద సాయికున్న అధిపత్యాన్నీ.. భక్తులకి కలిగిన అనుభవాల ద్వారా గమనించుకుందాం!

అల్లా అచ్ఛా కరేగా!
‘ఆళంది’ అనే ప్రదేశం నుంచి ఒక స్వామి సాయిదర్శనం కోసమే వచ్చాడు. సాయిదర్శనం కోసం నిరీక్షించాడు. కొంతసేపటికి సాయి రానే వచ్చాడు. అక్కడున్న భక్తులందరికీ లోపల ఓ చిన్న భయం, ఆందోళనా ఉన్నాయి. సహజంగా సాయి ఎవరైనా తన దగ్గరికి దర్శనానికొస్తే అతని పూర్వజీవితాన్ని క్షణాల్లో గ్రహించేసి సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడయితేనో... అధర్మార్జనపరుడై ఉంటేనో... లేక పూజలూ పురస్కారాలూ వంటివన్నీ వ్యర్థమనే భావనతో ఉంటూ అలాంటి మహనీయుల్ని నిందించేవాడయ్యుండి ఉంటేనో... క్షణాల్లో తనలో ఉన్న అసహనాన్ని కోపరూపంలో వ్యక్తీకరిస్తూ, నోటికొచ్చినట్లు తిట్టేస్తూ ఉంటాడు. 

ఆ తిట్లని తింటూ ఆ సాయి తనని తన తప్పు కారణంగా తిడుతున్నాడనే భావంతో గనుక ఆ తప్పుని అంగీకరిస్తూ, మౌనంగా తిట్లను భరిస్తూ, అంతా అయ్యాక కూడా సాయిపాదాలనే పట్టుకున్నట్లయితే వాళ్లకి సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ కారణంగా కొత్తగా దర్శనానికొచ్చే భక్తుల గురించి తోటిభక్తులకి ఓ స్వల్ప ఆందోళన ఉంటూ ఉండేది. అయితే ఎవరికీ కూడా ఆ వచ్చిన భక్తుడు ఒకవేళ సంప్రదాయ వ్యతిరేకి అయి సాయి తిట్లని తిన్నా కూడా అతని పట్ల తక్కువదనం, వేళాకోళం చేసే బుద్ధి ఉండేదే కాదు. పైగా ఆ భక్తుడు నిరాశకీ, నిస్పృహకీ గురైతే ఓదార్చి సాయి అనుగ్రహానికి ఎలా పాత్రులయ్యే వీలుందో బోధించి చెప్తూ ఉండేవారు కూడా. ఈ నేపథ్యంలో ఆ స్వామి ఈ సాయి దర్శనానికి రాగానే సాయి అతడ్ని ప్రసన్న ముఖంతో చూశాడు. 

ఆశీర్వదించి ఇక వెళ్లవచ్చునన్నట్లుగా సాయి చూడగానే స్వామి సాయితో తన బాధని మొర పెట్టుకున్నాడు. ‘దేవా! నాకు చెవిపోటు ఉంటూ ఉండేది. ఏదో సామాన్యమైనదే అయ్యుంటుందని కొన్నాళ్లు పట్టించుకోలేదు. క్రమంగా తీవ్రం కాసాగింది. ఆ చెవిపోటు కారణంగా నిద్ర పట్టేది కాదు. రాత్రింబవళ్లూ ఒకటే మెలకువ. ఈ బాధ కారణంగా ఎవరి మాటల్నీ వినాలనిపించేది కాదు. ఎవరైనా అతిముఖ్యమైన మాటని మాట్లాడదలిచినా మాట్లాడాలని ఉండేది కాదు సరికదా నోటికొచ్చినట్లు తిట్టేస్తూండేవాడిని. నా దుర్భర పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు మారు మాట్లాడకుండా వెళ్లిపోతూ ఉండేవాళ్లు.

 అలా కానివాళ్లు నా గురించి ఉన్నవీ లేనివీ చెప్తూ వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉండేవారు. ఎప్పడూ నా చెవిని పట్టుకుని ఓ చేయి ఆ నొప్పిని ఓదార్చడానికి అంకితమైపోయింది. ఇదిగో ఇప్పుడూ కూడా గమనిస్తూ ఉన్నారుగా! దీనికి నివారణని తమరే చెయ్యాలి’ అంటూ అకస్మాత్తుగా పాదాలమీద పడి కన్నీరు పెట్టాడు.సాయి ఒక్కసారి శూన్యంలోకి చూశాడు. అంటే ఇతని చెవిపోటుకి కారణం ‘నిజంగా వ్యాధియా? పూర్వజన్మలో చేసిన పాపమా? లేక ఈ జన్మలో చేసిన ‘మహా’ పాపమా? అని. ‘పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే’ అని ధర్మశాస్త్రం.

 పూర్వజన్మలో ఎవరికో ఒకరిపట్ల ఇబ్బందిని కలిగిస్తూ వాళ్లకి తీవ్రమైన కష్టాన్ని కలిగిస్తే, అవతలి వారికి కలిగిన మానసిక బాధ మనకి ఈ జన్మలో వ్యాధిగా పరిణమించి అవతలివారి బాధ ఎంతగా వాళ్లకి అయ్యిందో అంతకంటే ఎక్కువగా మనల్ని బాధిస్తుందని దానర్థం. ఈ కారణంగానే వ్యక్తులకి పాపభీతి(పాపం చేయాలంటే భయం– పాపం చేశాననే భయం– ఏ పాపం చేసి ఉన్నానో అనే భయం) ఉంటుంది. ఇలాంటి వాటిలో ఏది ఇతనికి కారణంగా ఉంటూ కర్ణశూల(చెవిపోటు)ని కలుగజేస్తోందా? అని ఆలోచించదలిచి ఆకాశంలోకి చూసాడన్నమాట సాయి.సాయి శూన్యంలోకి చూస్తుంటే తనకేమీ అర్థంకాని స్వామి చుట్టూ ఉన్న భక్తుల్ని దీనంగా చూడసాగాడు.

 అంతలానే సాయి స్వామికి ధైర్యవచనాలనీ చెప్తూ భయం లేదు. నీ ఊరికి నువ్వెళ్లు, అల్లా అచ్ఛా కరేగా! ఆ భగవంతుడైన అల్లా (నేను ఎవరి మంత్రాన్ని నిరంతరం మననం చేస్తూ ఉంటానో, ఆ మంత్ర జపాన్ని చేసి చేసి ఓ తీరు శక్తిని సంపాదించానో ఆ దైవం) అచ్ఛా కరేగా! (నీకు నీ బాధని తొలగించి మంచినే చేస్తాడు) అంటూ వెళ్లవలసిందిగా సూచించాడు. ఆ స్వామి తనదైన ప్రదేశం ‘పూనా’కి వెళ్లి పదిరోజుల పిమ్మట సాయికి ఉత్తరాన్ని రాస్తూ – ఎందరో వైద్యులకి చూపించుకుని ఎంతెంతో ప్రసిద్ధమైన వైద్యాన్ని తగు ఔషదాలతోనూ చేయించుకున్న నాకు తన దర్శనం కారణంగా పూర్తిగా చెవిపోటు తగ్గనే తగ్గిపోయింది. ఎక్కడ ఏ క్షణంలో మళ్లీ ఆ చెవినొప్పి నన్ను బాధిస్తుందోననే భయం గురించి బాధ తప్ప నాకు మరే బాధా లేదు అని ముగించాడు. చెవిపోటు దాదాపుగా తగ్గేకాలానికే స్వామి దర్శనానికొచ్చాడు. అంటే తాను పూర్వజన్మపాపం కారణంగా బాధపడుతూ పాపం పూర్తిగా తొలగిపోయే సమయానికి సాయి వద్దకి వచ్చాడన్నమాట!

స్థలమాహాత్మ్యం
అంతటి చెవినొప్పి అంతకాలంపాటున్న నొప్పి అంతగా మానసికంగా కుంగదీసిన నొప్పి ఒట్టి దర్శనంతో పూర్తిగా తొలగిపోయిందా? అనిపిస్తుంది మనకి. అది నిజమే.సాయికి పంచవిధవాయువుల మీదా అదుపు ఉంది. తెలుగులో ఒక తిట్టు కూడా ఉంది. ఎందుకలా చేశావు? ఏం వాయువు? (వాయువు అని వారి అర్థం) అని. అంటే వాయు కారణంగా వ్యాధి వస్తూ ఉందనేది దీనర్థమని గదా భావం. వాయువు మొత్తం ఒకే పక్షానికి తగిలేలా గనుక చేసుకుంటే అది పక్షవాయువు’ అవుతుంది అదే మరి పక్షవాతమంటే! సరే!

ఆ నేపథ్యంలో సాయి ఈ స్వామి విషయంలో స్వామిలో సంచరిస్తూండే అపానమనే వాయువుని అదుపులోనికి తీసుకుని ఆ వాయువు ద్వారా ‘నొప్పిని కలిగించడానికి కారణమైన కండరం మీద కండరం ఎక్కికూచున్న ఆ విధానాన్ని సవరించాడు. మన కాలిమీదే మనం మరో కాలుని వేసుకుని నిలబడితే కిందున్న కాలుకి కొద్ది సేపయ్యాక బరువుతనం గోచరిస్తుంది. అందుకని సాయి ఆ కండరం మీద ఎక్కికూర్చున్న మరో కండరపు బరువుతనాన్ని నివారిస్తూ తగు చికిత్సని వాయువు ద్వారా కలిగించాడు. దాంతో పై కండరం తన కిందున్న కండరాన్ని నొక్కడం మాని వాయుబలం తనలో లేని కారణం ఆ మెల్లగా తానింతవరకూ అదుపు చేస్తున్న కండరం నుండి తొలిగి పక్కకి పడి యథాస్థానానికి వచ్చేసిందన్నమాట!

కార్య కారణ సంబంధమని ఒకటుంది లోకంలో. ప్రమిదని తెచ్చి నిండుగా నూనెని పోసి, వత్తిని వేసి అది బాగా నూనెకి తడిసేలా చేసి నిప్పుని మంటరూపంలో అందిస్తే కదా దీపం అవుతుంది. ఇదంతా కారణమౌతుంటే నిప్పుని ముట్టించాకే దీపం వెలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. దీన్నీ కార్యం (ఫలితం) అంటారు శాస్త్ర పరిభాషలో. అలా కండరాల ఒత్తిడి వల్ల కలిగిన నొప్పి వైద్యశాస్త్రానికి సంబంధించిన విషయం. ఆ ఒత్తిడిని పూర్తిగా తొలిగేలా చేశాడు సాయి!అయితే పూనా వెళ్లిన ఆ స్వామి మరో రెండ్రోజులకి మరో ఉత్తరం సాయికి రాస్తూ చెవిపోటు పూర్తిగా నయమైనప్పటికీ ఆ చెవికున్న వాపు మాత్రం తగ్గనే లేదు.

 మళ్లీ తమకి శ్రమ కలిగించడమెందులకనే భావంతో ఇక్కడ ప్రముఖవైద్యులకి చూపించాను. వైద్యలంతా కలిసి శస్త్రచికిత్స చేస్తే తప్ప ఈ వాపుకి మరో చికిత్సలేదంటూ తేల్చి చెప్పేశారు. భగవంతుడి రూపంలో ఉన్న తమ దయ కారణంగా ఆ చెవిపోటు తగ్గినట్టుగా ఈ వాపు కూడా తగ్గినట్లైతే జీవితాంతమూ మీకు కృతజ్ఞునిగా పడి ఉంటాను’ అంటూ రాశాడు స్వామి.సాయి ఆ ఉత్తరాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వి– ఈ వాపు కూడా అపానమనే వాయు మహిమ తప్ప వేరుకాదనే నిర్ణయానికి వచ్చి ఆ చెవిలో నిలవ ఉంటూ తన ఉనికి కారణంగా చెవిని ఉబ్బేలా చేసి, చెవి వాపుగా కనిపింపజేస్తున్న ఆ వాపుని రెండుమూడు రోజుల్లో పూర్తిగా తొలగించేసాడు సాయి. 

స్వామి మరింత ఆశ్చర్యపడ్డాడు సాయి చికిత్సకి. ఆ జీవితం తానన్నమాటకి అనుగుణంగా పూర్తి దాసుడైపోయాడు.సాయి ఇలా చేయగలగడానికి కారణం ఆ రోగిగా ఉన్న స్వామికి పాపక్షయం అయిపోయి ఉండటమే. దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోగలగాలి మనకేదైనా అనారోగ్యం వస్తే అది మనం పూర్వజన్మంలో చేసిన పాపకారణమే అయ్యుంటుందని. పాపక్షయం కావడానికి భగవన్నామస్మరణని మనమైనా తగినంతగా చేస్తూ ఉండాలి లేదా మహాతపోనిధులైన వారి ద్వారా నామస్మరణని పొందగలగాలి దర్శనం పాదస్పర్శనం వంటి వాటి ద్వారా.

షిర్డీలో ఉండు!
ఇదే తీరు దత్తోపంత్‌(దత్తోపంత్‌ మహారాజ్‌) అనే అతనికి కడుపు నొప్పి వ్యాధి ఉండేది. అది ఎప్పుడొచ్చేదో తెలిసేది కాదు. సహజంగా ఒంట్లో సత్తువ లేకపోవడం, మూర్ఛరావడం, నీరసం ఆవహించడం, కళ్లు తిరగడం వంటివి ‘మేం రాబోతున్నాం’ అంటూ కొంత సమయం ముందు మనకి ఓ సూచన ఇస్తాయి. దాంతో మనం అప్పటికే తగు జాగ్రత్తలతో ఉంటాం కాబట్టి మిగిలిన పనుల్ని మాని ఆ వ్యాధికి తగిన నివారణ జాగ్రత్తలలో నిమగ్నమౌతాం. కష్టం నుండి బయటపడతాం. అయితే దత్తోపంత్‌కున్న ఉదరశూల(కడుపు నొప్పి) అలాంటి లక్షణాలతో ఉండేది కాదు. ఒక ముఖ్యమైన పనిని చేయడానికి కూడా భయంగా ఉండేది. ఎక్కడ ఆ పనిని మధ్యలోనే ఆపివేయవలసి వస్తుందోనని. ఈ తీవ్రమైన కడుపునొప్పితో ఏ ఆలోచనా చేయలేకపోయేవాడు. సుఖనిద్ర అనేది ఎన్నాళ్లయిందో! అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది ఎందుకీ జీవితం?! ముగించేస్తే సరికదా! అని.

ఇలాంటి స్థితిలో వాళ్లూ వీళ్లూ చెప్పగా సాయి వద్దకి ఆర్తిగా కనిపించే దైవంగా భావిస్తూ దీనంగా వచ్చాడు. సాయిని చూస్తూనే ఆయన రెండు పాదాల మధ్య తలపెట్టి చిన్న పిల్లవానిలా పొంగిపొర్లుతున్న దుఃఖంతో ఏడ్చేశాడు. సాయి మారు మాట్లాడకుండా అలానే నిలుచునిపోయి అతని దుఃఖానికి అనుగుణంగా కదులుతున్న శిరసుని చూస్తూ ఉండిపోయాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న భక్తులందరికీ కూడా కళ్లు చెమర్చాయి. కాసేపయ్యాక తలనెత్తి దత్తోపంత్‌ ఆగి ఆగి మాట్లాడుతూ ‘దేవా! ఒకటి రెండు నెలలు కాదు.. రెండుమూడు సంవత్సరాలు కాదు.. 14 సంవత్సరాల నుంచి ఒకటే కడుపు నొప్పి. కత్తితో కోసేసుకుందామనేంత తీవ్ర దుఃఖం వచ్చేస్తోంది. చివరి ప్రయత్నంగా నీ దగ్గరి కొచ్చా’ అంటూ వివరించుకున్నాడు తన బాధని సాయికి. సాయిలో ఉన్న గొప్పగుణం ఒక్కటే.

 వెంటనే అవును కాదు చెప్పడు. పరిస్థితిని గమనిస్తాడు. శరీరానికి సంబంధించిన ఇంద్రియాల కదలికలని శరీరం నిజంగా దుఃఖంతో వణుకుతోందా? వణుకుని నటిస్తున్నాడా? గమనిస్తాడు. అలాగే కళ్లు నిజమైన దుఃఖాల చెలమలుగా ఉన్నాయా? లేక తెచ్చిపెట్టుకుంటున్న దుఃఖమా? పరిశీలిస్తాడు. తాను మాట్లాడే మాటలని శ్రద్ధతో వింటున్నాడా? లేదా? అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ బాధామయవ్యక్తి మాట్లాడే మాటలు పొందికగా ఉన్నాయా? పడుతున్న దుఃఖాన్ని ప్రతి అక్షరంలోనూ ఒలికింపజేస్తోందా? లేదా? అని చూస్తాడు... ఇలా అన్ని పరిశీలనలనీ చేశాక అప్పుడా బాధితుని భూత భవిష్యత్‌ స్థితులతో పాటు వర్తమాన దశని గమనించి, తాను సరిచేయగలస్థితి గనుక ఉంటే తగిన పరిష్కారం చూపుతానంటూ పలుకుతూ ఆ మీదట మాట్లాడడాన్ని ప్రారంభిస్తాడు. 

అదే మరి ఆ బాధితుడు గర్వాహంకారాలతోనూ తన పట్ల తృణీకార భావంతో లోగడ ఉండి ఉన్నా– ఇప్పుడు కూడా ‘నలుగురిలో నారాయణ’ అన్నట్లుగా తనని కూడా చూడదలిచి వచ్చి ఉన్నా నోటికొచ్చినట్లు మాట్లాడి ఆ వచ్చిన వ్యక్తి తనకి తానుగానే వెళ్లిపోయేలా చేస్తాడు. అదే మరి పశ్చాత్తాపబుద్ధితో గాని ‘తాను లోగడ చేసింది తప్పు’ అనే భావంతో పరివర్తన దృష్టితో గానీ కనిపిస్తే ‘రక్షణకోసం చేతిని పెద్దది చేసి చాపి రక్షించి తీరుతాడు.ఇంత వివరంగా చెప్పేది ఎందుకంటే ఎందరో భక్తులు నిజంగా సాయి మీద అంత భక్తీ శ్రద్ధా ప్రేమా లేకుండా నలుగురితో పాటు నారాయణ అన్నట్లుగా షిర్డీకి పోయి చూసేసాంగా సాయిని!– అన్నట్లుగా సాయిని చూసి వచ్చేస్తారు. లోగడ అనుకున్నాం సాయిని చూడటం కాదు దర్శించడం చేయాలని. ఒకసారంటూ సాయిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే ఇక మన బాగోగులను సాయే చూసుకుంటాడు. ఎలాగైతే తల్లి చంకన ఎక్కి పిల్లవాడుంటే ఆ పిల్లవాని బాధ్యత తల్లిదే అవుతుందో అలా!! సరే!

ఇలా దత్తోపంత్‌ సాయి పాదాలని పట్టుకుని హృదయపూర్వకమైన తన బాధని యదార్థంగా చెప్పడంతో అలాగే చెప్పాడని సాయికి అనిపించడంతో సాయి అతనికి ఊదీ(విభూది)నిస్తూ  ‘కొన్నాళ్ల పాటు షిర్డీలోనే ఉండు’ అని ఆదేశించాడు.దత్తోపంత్‌ అలాగే షిర్డీలోనే ఉన్నాడు కొన్నాళ్లపాటు. ఏ తీరు బాధా లేకుండా పూర్తిగా ఆ కడుపు నొప్పి మటుమాయమైపోయింది. ఏ మహిమలూ తాయత్తులూ రక్షలూ సాయి ఇయ్యలేదు. మరి ఎలా తగ్గి ఉంటుంది? అనేది ఓ ప్రశ్న కదా!

ప్రారబ్ధ ఫలం
ప్రతి మానవుడూ మూడు తీరులుగా తాము చేసుకున్న పుణ్య–పాపకర్మల ఫలితాన్ని అనుభవించవలసి ఉంటాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ద్వారా ఈ జన్మలో లభించబోయే విద్య సంపద సంతోష వంటివి పొంది తీరాల్సి ఉంటుంది. ఈ తీరు కర్మని ‘సంచితకర్మ’ అంటుంది శాస్త్రం.ఇక ఈ జన్మనంటూ మనం ఎత్తి ఆ సంచితకర్మ (పోగు చేసుకున్న పాపపుణ్యాల ఫలితం)ని అనుభవించడానికి సిద్ధమైన సందర్భంలో పాపం ద్వారా దుఃఖం, పుణ్యం ద్వారా ఆనందం అనుభవిస్తూ ఉంటే అది ‘ప్ర+ఆరబ్ధకర్మ’ అంటే పాపపుణ్యాల ఫలితాన్ని అనుభవించడం ప్రారంభమైందని దీనర్థం.

సంచితకర్మ (పాపపుణ్యాల ఫలితం) ఎంత అనుభవించవలసి ఉందో దానిలో ప్రారబ్ధకర్మ అంటే అనుభవించడమనేది ప్రారంభమైపోయి అనుభవిస్తూ ఉంటే.. ఇంకా ఎంతగా పాపపుణ్యాలని అనుభవించవలసి ఉందో దానిని ‘ఆగామికర్మ’ ఇంకా అనుభవించాల్సిన కర్మా అని చెప్పింది శాస్త్రం.దీన్నే మనకి బాగా అర్థమయ్యే తేలికభాషలో చెప్పుకోవాలంటే.. (ఇలా శాస్త్రవిషయాన్ని చెప్పకూడదు. మన్నించాలి) ఒక వ్యాపారాన్ని లోగడ ఒక ఊళ్లో చేసి 10 రూపాయల ఆదాయం, 2 రూపాయల అప్పు చేశామనుకుందాం. అది సంచితం.

మరో ఊరుకి మారి ఆదాయంలోని 5 ఖర్చు చేయడమే కాక అప్పుకి మరో 2 కలిపి అప్పు చేసినట్లయితే అప్పటి ఆదాయ వ్యయస్థితి 5+4 అవుతుంది కదా! అదుగో అది ప్రారబ్ధకర్మ. లోగడ ఉన్న ఆదాయంలో అనుభవించినదీ, అప్పుకి మరికొంత అప్పుని కలిపి చేసినదీ ప్రారబ్ధం.ఇప్పుడు ఒకప్పటి ఆదాయ వ్యయాల్లో అంటే సంచితంలో 10+2లో ప్రారబ్ధం ప్రకారం 5+2 అయిపోగా, రాబోయే ఆగామిక మన దగ్గరున్నది 5+4 మాత్రమే. అంటే ఆదాయం (నిలవ) 5 కాగా అప్పు ‘4’ అన్నమాట.ఇప్పుడు మన తెలివి తేటలతో ఆదాయాన్ని పెంచితేనూ అప్పుని తగ్గించేందుకు మరికొంత ఆదాయాన్ని గడిస్తేనూ ఆదాయం పెరిగి అప్పు తరిగి వ్యక్తి ఆర్థికస్థితిలో బలిష్ఠునిగా ఉంటాడు కదా!

అదే తీరులో ఈ జన్మలో మరిన్ని పుణ్యాలని చేసి పుణ్యఫలాన్ని (ఆదాయం లాంటిది) పెంచి అప్పుని తగ్గించిన (పాపఫలాన్ని పోగొట్టుకునేందుకు జపాలనీ తపాలనీ చేయడం ద్వారా) పక్షంలో పుణ్యఫలాన్నే పొందగలం కదా! దత్తోపంత్‌కి ప్రారబ్ధం ఉంది కాబట్టి అది కూడా 4–5 రోజుల్లో పోయే వీలుంది కాబట్టి షిర్డీలోనే ఉండవలసిందన్నాడు. ఆ ప్రారబ్ధమనేది ఉదరశూలగా అతడ్ని బాధించింది 14 ఏళ్లపాటు. సాయి అతడ్ని అపానమనే వాయువు మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ వ్యాధిని నివారించాడనేది భావం. ఇక సాయికున్న ఉదానవాయువు మీద ఆధిపత్యాన్ని చూద్దాం!

ప్రతి మానవుడూ మూడు తీరులుగా తాము చేసుకున్న పుణ్య–పాపకర్మల ఫలితాన్ని అనుభవించవలసి ఉంటాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ద్వారా ఈ జన్మలో లభించబోయే విద్య సంపద సంతోషం వంటివి పొంది తీరాల్సి ఉంటుంది. ఈ తీరు కర్మని ‘సంచితకర్మ’ అంటుంది శాస్త్రం.

– సశేషం

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top